నిర్దిష్ట సమయంలో సేవలు | CM YS Jagan Video Conference with Collectors and SPs over Spandana Program | Sakshi
Sakshi News home page

నిర్దిష్ట సమయంలో సేవలు

Published Wed, Sep 9 2020 3:42 AM | Last Updated on Wed, Sep 9 2020 9:43 AM

CM YS Jagan Video Conference with Collectors and SPs over Spandana Program - Sakshi

ప్రభుత్వం ప్రకటించిన నిర్దిష్ట సమయంలో 91 శాతం రైస్‌ కార్డులను ఇస్తున్నాం. 76.60 శాతం ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. 97 శాతం పెన్షన్ల మంజూరు జరుగుతోంది. ఇవన్నీ నూరు శాతం జరిగేలా చూడాలి. ఇంటి స్థలాలకు సంబంధించిన దరఖాస్తులు 90 రోజుల్లో పూర్తి కావాలి. అర్హత ఉన్న వారికి నిర్దిష్టమైన సమయంలో మంజూరు చేయలేకపోతే కలెక్టర్లు, జేసీలు బాధ్యత వహించాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి సేవకు నిర్దిష్ట సమయం పెట్టామని, ఆ సమయంలోగా పూర్తి అవుతున్నాయా లేదా అనే విషయాన్ని కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. దీని ఆధారంగానే కలెక్టర్లు, జేసీల పనితీరును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హత ఉన్న వారికి నిర్దిష్ట సమయంలో సేవలు అందించకపోతే కలెక్టర్లు, జేసీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘స్పందన’లో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాలు, ఉపాధి హామీ పనులు, ఆర్బీకేలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం, స్కూళ్లు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులలో నాడు–నేడు, ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..  

స్పందన కార్యక్రమంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ఫీల్డ్‌ విజిట్‌
► కలెక్టర్లు వారానికి రెండుసార్లు గ్రామ సచివాలయాలకు కచ్చితంగా వెళ్లాలి. వారానికి నాలుగు సార్లు జేసీలు వార్డు, గ్రామ సచివాయాలను సందర్శించాలి. సంబంధిత విభాగాల అధిపతులు (హెచ్‌ఓడీ), కార్యదర్శులు కూడా గ్రామ, వార్డు సచివాలయాలను నెలకు రెండు సార్లు సందర్శించాలి.  
► ఇది కచ్చితంగా జరగాలి. దీన్ని సీఎం కార్యాలయం నుంచి స్వయంగా పర్యవేక్షిస్తాం. 

కాల్‌ సెంటర్‌.. పోస్టుల భర్తీకి పరీక్షలు 
► 200 మందితో కాల్‌ సెంటర్‌ పని చేస్తోంది. వార్డు, గ్రామ సచివాలయాల్లో అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.  
► సచివాలయం, మండల, జిల్లా స్థాయి వరకు ఆ కాల్‌ సెంటర్‌ పరిధిలోకి వచ్చారు. హెచ్‌వోడీ, సెక్రటరీ స్థాయి వరకు కూడా దాని పరిధిలోకి తీసుకురాబోతున్నాం. 
► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న 16,208 పోస్టులకు ఈనెల 25, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించబోతున్నాం. మొత్తం 10.57 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 228 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం.   

వైఎస్సార్‌ ఆసరా 
► ఈ పథకం ద్వారా దాదాపు 90 లక్షల మందికి ఆర్థిక సహాయం. అక్క చెల్లెమ్మలకు వ్యాపారంలో తోడ్పాటు అందించే విధంగా పలు సంస్థలతో ఒప్పందం. బ్యాంకులతో కలెక్టర్లు మాట్లాడాలి. జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలి.  

జాతీయ ఉపాధి హామీ పథకం
► రాష్ట్రానికి 4.25 కోట్ల పని దినాలు అదనంగా వచ్చాయి. రూ.4 వేల కోట్లకు సంబంధించిన మెటీరియల్‌ కాంపోనెంట్‌కు అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో ప్రతి వారంలో రూ.10 కోట్లు మెటీరియల్‌ కాంపోనెంట్‌ వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. పేమెంట్లు పెండింగ్‌ లేకుండా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం.  
►  గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూల్‌ కాంపౌండ్‌ నిర్మాణాలను నెలాఖరుకు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి.  
► అక్టోబర్‌ నుంచి డ్రైన్స్‌.. గతంలో ఒక శాతం పనులు జరిగి, నిలిపివేసిన వాటికి కూడా అనుమతి ఇవ్వాలి. ఒక శాతం కన్నా ఎక్కువ ఖర్చు చేసినవి రూ.2 వేల కోట్ల విలువైన పనులు ఉన్నాయి. వాటికి కూడా అనుమతులు ఇస్తాం.  
► అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు స్థలాల గుర్తింపు పూర్తి చేయాలి. కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రులను నిర్మించబోతున్నాం. వచ్చే నెలలో వాటికి టెండర్లు జరుగుతాయి. మొత్తంగా 27 టీచింగ్‌ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయి. 

నాడు–నేడు
► స్కూళ్లలో నాడు–నేడుకు సంబంధించి తొమ్మిది అంశాలతో పాటు కిచెన్‌ కూడా జత చేశాం. అక్టోబర్‌ 5న స్కూల్స్‌ తెరిచే అవకాశం ఉంది కాబట్టి, నాడు–నేడులో చేపట్టిన పనులను ఈ నెల 30వ తేదీ లోగా పూర్తి చేయాలి. 
►  పనుల్లో క్వాలిటీపై కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలి. 1,085 టాయిలెట్లపై శ్లాబ్‌ వేయాల్సి ఉంది. వాటిని కూడా పూర్తి చేయాలి.  

అంగన్‌వాడీ కేంద్రాలు 
► 55,607 అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూల్స్‌గా మార్చబోతున్నాం. ఈ కేంద్రాల్లో 10 అంశాల్లో నాడు – నేడు పనులు చేపడతాం. 
► అద్దె భవనాల్లో ఉన్న 22,979 కేంద్రాలకు నూతన భవనాలను సమకూర్చాలి. 11,961 చోట్ల స్థలం గుర్తించారు. 12,018 చోట్ల స్థలం కేటాయింపు ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలి.  
► ప్రైమరీ స్కూళ్లలో స్థలం అందుబాటులో ఉంటే, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 1,200 నూతన భవనాలు పూర్తయ్యే స్థితిలో ఉన్నాయి.  

టీచింగ్‌ ఆస్పత్రులు.. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు  
► రాష్ట్రంలో కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఏలూరు, పులివెందుల, ఆదోని, పిడుగురాళ్ల, మదనపల్లి, అమలాపురంలో వెంటనే భూసేకరణపై కలెక్టర్లు చొరవ చూపాలి. 
► అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి నాడు, 35 షెడ్యూల్డ్‌ మండలాల్లో ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.  
► ఎరువులకు ఈ నెలలో ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. అందువల్ల వ్యవసాయ శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా అందించాలి.   
► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

జగనన్న తోడు – వైఎస్సార్‌ బీమా 
► వచ్చే నెల జగనన్న తోడు పథకం ప్రారంభిస్తున్నాం. వీ«ధుల్లో చిల్లర వ్యాపారం చేసుకునే వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. వారికి రూ.10 వేల రుణం వడ్డీ లేకుండా మంజూరు చేస్తాం. 
► ఈ పథకం కోసం ఇప్పటి వరకు 6 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వైఎస్సార్‌ బీమా లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే పూర్తి చేయాలి. లబ్ధిదారులతో బ్యాంక్‌ ఖాతాలు తెరిపించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement