సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడిని శరవేగంగా సాకారం చేసి రాష్ట్ర ప్రజలకు ఫలాలను అందచేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఆయన పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం ఇది మూడోసారి. ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పనులను పరిశీలిస్తారు. ఉదయం 11.50 నుంచి 1.15 వరకు పనుల పురోగతిపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.25 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
రివర్స్ టెండర్లతో అవినీతి ప్రక్షాళన..
పోలవరం పనుల్లో గత సర్కారు తప్పిదాలను సరిదిద్దడంతోపాటు కేంద్రాన్ని ఒప్పించి, మెప్పిస్తూ 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి 2022లో ఖరీఫ్ ఆయకట్టుకు నీళ్లందించే దిశగా ముఖ్యమంత్రి జగన్ సన్నద్ధమయ్యారు. గతేడాది జూన్ 20న సీఎం హోదాలో తొలిసారిగా ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి గత సర్కార్ ప్రణాళిక లోపం, చిత్తశుద్ధి లేమి, అవగాహన రాహిత్యాన్ని ఎండగట్టారు. నిపుణుల కమిటీతో పోలవరం పనులను ప్రక్షాళన చేయించి రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.838.58 కోట్లను ఆదా చేసి టీడీపీ సర్కారు అవినీతిని నిరూపించారు. ఫిబ్రవరి 28న పోలవరం పనులను రెండో సారి క్షేత్ర స్థాయిలో సీఎం పరిశీలించారు.
ఆగమేఘాలపై పనులు..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో హెడ్ వర్క్స్‌లో స్పిల్ వే పనులను 52 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్‌లో 3.228 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసింది. కరోనా ఉద్ధృతి సమయంలోనూ 2.308 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయడం గమనార్హం. మరో 6.029 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తే స్పిల్‌వే పూర్తవుతుంది. వచ్చే ఏడాది మే నాటికి స్పిల్ వే, స్పిల్ చానల్‌లను సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను జూన్ నాటికి, దిగువ కాఫర్ డ్యామ్‌ను జూలై నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. 2021 డిసెంబర్ నాటికి ఈసీఆర్‌ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్)ను పూర్తి చేయనున్నారు. ఆలోగా కనెక్టివిటీస్ పనులు పూర్తి కానున్నాయి.
పునరావాసంపై ప్రత్యేక దృష్టి..:
పోలవరంలో ముంపునకు గురయ్యే 373 గ్రామాల్లోని 1,05,601 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. 2009 నాటికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 3,110 గృహాలను నిర్మించి పునరావాసం కల్పించారు. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క ఇంటినీ నిర్మించలేదు, పునరావాసమూ కల్పించలేదు. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) డ్యామ్ సేఫ్ట్ అండ్ స్టెబులిటీ ప్రోటోకాల్ ప్రకారం కొత్త ప్రాజెక్టుల్లో ఒకేసారి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయకూడదు. ఆ ప్రోటోకాల్ ప్రకారం మొదటి ఏడాది 41.15 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 17,760 కుటుంబాలకు జూన్ నాటికి పునరావాసం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ తర్వాత దశలవారీగా 84,731 కుటుంబాలకు పునరావాసం కల్పించి సీడబ్ల్యూసీ మ్యాన్యువల్ ప్రకారం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం మేరకు 194.6 టీఎంసీలను నిల్వ చేస్తారు.
సానుకూలంగా పీపీఏ సిఫారసు..
2014 ఏప్రిల్ 1కి ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రీయింబర్స్‌పై వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆగమేఘాలపై కాగ్‌తో ఆడిట్ జరిపి రూ.4,730.71 కోట్లపై సమగ్ర నివేదిక పంపడంతో కేంద్ర జల్ శక్తి శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరంలో కమీషన్ల దాహంతో చంద్రబాబు నిర్వాకాలను గుర్తు చేస్తూ 2013–14 ధరలతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఈ నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం పోలవరానికి నిధులు విడుదల చేయాలని కోరగా ఇందుకు పీపీఏ సానుకూలంగా స్పందించి సిఫారసు చేసింది. పీపీఏ సిఫారసుల మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ, ఆర్థికశాఖలు దీనిపై నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ క్రమంలో ఇటీవల రూ.2,234.28 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment