పందేలకు శిక్షణ పొందుతున్న పుంజులు
తగరపువలస(భీమిలి): సంక్రాంతి బరిలో కయ్యానికి పందెం కోళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఏడాది పాటు వీటికి శిక్షణ ఇచ్చి, ఆహారాన్ని పెట్టుబడిగా పెట్టిన వ్యాపారులు, రైతులు ప్రస్తుతం వీటి విక్రయాలపై దృష్టి సారించారు. పందెం కోళ్లను సిద్ధం చేసే ప్రాంతాలను మకాం అంటారు. ప్రస్తుతం ఇలాంటి మకాంలు ఉత్తరాంధ్రలో 250కు పైగా ఉన్నాయి. మకాంలలో లక్షలాది పందెం కోళ్లు పోరాటంలో శిక్షణ పొంది కాలు దువ్వుతున్నాయి. వీటిలో పైచేయి సాధించే కోళ్ల కోసం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పందెం రాయుళ్లు ఉత్తరాంధ్రకు వచ్చి మకాంలలో సరైన కోడి కోసం డేగ కళ్లతో వేట మొదలెట్టారు.
చదవండి: Good Governance Index 2021: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ
ఇలాంటి మకాంలు ఎక్కువగా భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలు, తిమ్మాపురం, సాగర్‌నగర్, ఆరిలోవ, నర్సీపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నాయి. పందెం కోళ్లలో సేతువ, కక్కెర, సవల, పాస, రసంగి, డేగ, పచ్చకాకి, అబాస్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏడాది వయసున్న కోళ్లు రూ.15 వేల నుంచి 20 వేలు, ఏడాదిన్నరవి రూ.30 వేలు, నాలుగేళ్ల వయసు వరకూ ఉన్నవి రూ.40 వేల వరకూ ధర పలుకుతున్నాయి.
ఒక్క ఉత్తరాంధ్రలోనే రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుందంటే పందెం కోళ్లకున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఒక్కో మకాంలో 50 నుంచి వందలాది కోళ్లుంటాయి. వీటికి ప్రత్యేకంగా రోజుకు నాలుగు బాదం పప్పులు, కోడిగుడ్లు, వారానికోసారి ఖైమా, చోళ్లు, గంట్లుతో పాటు రోజూ రెండు పూటలా తడిపిన ధాన్యాన్ని ఆహారంగా ఇస్తారు. మధ్యాహ్నం వేళల్లో అలసిపోయే వరకూ ఈతకు వదులుతారు. ఏడాది కాలంలో ఒక్కో కోడిపై రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తారు. వీటిని చంటిపిల్లల్లా చూసుకుంటారు. రోగాలు రాకుండా యాంటీబయోటిక్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తుంటారు.
విదేశీ బ్రీడ్‌లకు భలే డిమాండ్
విశాఖకు చెందిన ఒక మకాం యజమాని రూ.18 లక్షలు వెచ్చించి విదేశాల నుంచి మైలా బ్రీడ్ పుంజును కొనుగోలు చేశారు. దానితో దేశవాళీ కోడిపెట్టలను సంకరం చేయించి.. వెయ్యి పిల్లలను పొదిగించి ఒక్కో కోడిని రూ.5 వేలకు విక్రయించడం ద్వారా ఏడాదిన్నరలో రూ.50 లక్షల ఆదాయం పొందినట్టు చెప్పాడు. ఈ కోళ్లు బరిలోకి దిగితే రూ.లక్షలాది రూపాయలు కొట్టుకొస్తాయని పందెం రాయుళ్లకు గట్టి నమ్మకం. అలాగే ఫిలిప్పీన్స్, పెరూ దేశానికి చెందిన మేలు జాతి కోడి పెట్టలు ఒక్కోటి రూ.6–7 లక్షలు పలుకుతున్నాయి. వీటిని కూడా సంకరం చేయించడం ద్వారా మంచి ఆదాయాన్నిచ్చే పందెం పుంజులను సృష్టిస్తున్నారు.
ప్రత్యేక శిక్షణ పొంది పందేలకు సిద్ధంగా ఉన్న కోడిపుంజులు
ప్రభుత్వ అనుమతులే కీలకం
గతేడాది ప్రభుత్వం అనుమతులు లేని కారణంగా ఉత్తరాంధ్రలో పందెం కోళ్ల వ్యాపారం జరగలేదు. ఒక్క పందెం కోడి పుంజు కూడా విక్రయం కాలేదు. ఈ ఏడాది ప్రభుత్వం అనుమతిపైనే వ్యాపారం ఆధారపడి ఉంటుంది. చాలామంది వచ్చి వారికి నచ్చిన బ్రీడ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. హైదరాబాద్, ఏలూరు, భీమవరం, నర్సీపట్నం, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల వారితో కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తుంటాం.
– ఎన్.వరాహరఘునాథరెడ్డి, తగరపువలస
కోళ్లకు రోగం వస్తే.. ఇక అంతే...
పందెం కోళ్ల పెంపకం రిస్క్‌తో కూడుకున్నది. పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తున్నప్పటికీ వాటికి సోకే రోగాలపై అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఒక్కోసారి రూ.లక్షలు పోసి కొనుగోలు చేసినా ఎలాంటి ఆదాయం రాకుండానే మృత్యువాత పడుతుంటాయి. నాటు కోళ్లతో పోలిస్తే పందెం కోళ్లకు తెగుళ్లు తక్కువ. ప్రస్తుతం రైతులంతా నాటుకోళ్ల పెంపకంపైనే ఆసక్తి చూపుతున్నారు. రిస్క్ కూడా ఎక్కువే.
– నమ్మి ఎర్రినాయుడు, ఆనందపురం
Comments
Please login to add a commentAdd a comment