పందెం కోఢీ!
మిర్యాలగూడ అర్బన్ : సంక్రాంతి పండుగ అనగానే వాకిట్లో రంగురంగుల రథం ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, పతంగులు గుర్తుకు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటితోపాటు కోడి పందేలు ఆనవాయితీగా వస్తున్నాయి. ఈ పందేలు ప్రస్తుతం తెలంగాణ జిల్లాలకు పాకాయి. సంక్రాంతి పండుగ వస్తుందనగానే పందెంరాయుళ్లు కోడి పందాలకు సిద్ధమవుతూ బరులను రెఢీ చేస్తున్నారు. అంతే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా కోడి పందేలు నిర్వహిస్తూ రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారనేది విశ్వనీయ సమాచారం. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒక వైపు పోలీసులు హెచ్చరిస్తున్నా.. పందెం రాయుళ్లు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రా ప్రాంతానికి చేరువలో కృష్ణాతీరంలో గుట్టు చప్పుడు కాకుండా ఈ పోటీలు సాగుతున్నాయి. ప్రధానంగా మిర్యాలగూడ, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని తోటలు, అటవీ ప్రాంతాన్ని పందెం రాయుళ్లు అడ్డాగా చేసుకుంటున్నారు.
తాజాగా మిర్యాలగూడ మండలం బొర్రాయిపాలెం అన్నారంలో రెండు రోజులుగా కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు స్థావరంపై దాడులు చేసి కోడి పందేలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.10వేల నగదు, 4 ద్విచక్ర వాహనాలు, ఐదు కోడి పంజులను స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కాగా ఈ దాడిలో కోడి పందేలు ఆడుతున్న 38మందితో పాటు 18 కోడి పుంజులు, భారీగా నగదుసైతం స్వాధీనం చేసుకున్నుట్లు ప్రచారం సాగుతోంది. కానీ ఐదుగురిపై మాత్రమే కేసులు నమోదు చేయడంతో పోలీసుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు స్పందించి కుంటుబాలను వీధిన పడేసే ఇలాంటి పందేలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రూ.20వేల నుంచి రూ.లక్ష పలుకుతున్న పందెంకోళ్లు...
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలను నిర్వహించవద్దని అక్కడి కోర్టు తేల్చిచెప్పడంతో కొంత మంది పందెం రాయుళ్లు తెలంగాణ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. పందెంలో ఆడే కోడి పుంజులకు వాటి జాతిని బట్టి రూ.20వేల రూపాయల నుంచి రూ.1లక్ష వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం. దీంతో వారు పండుగకు ముందుగానే బరులు సిద్ధం చేసి పందెం కాసేవారిని ఎంచుకుని ప్రచారం కూడా చేస్తున్నట్లు సమాచారం. పట్టణాలకు దూరంగా, తోటల్లో కోడి పందాలతోపాటు పేకాట నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కుటుంబాలను వీధిన పడేసే కోడి పందేలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.