
సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామీణులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించేలా పనిచేయాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సీహెచ్‌వోలకు) వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సూచించారు. ఆయన గురువారం మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి సీహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో వైద్యసేవలన్నీ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా అందుబాటులోకి వస్తాయని, సీహెచ్‌వోలు టీం లీడర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు.
సెర్ప్ ఆధ్వర్యంలోని విలేజ్ ఆర్గనైజేషన్ల ద్వారా గ్రామీణుల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక పెద్దల సహకారం తీసుకోవాలని సూచించారు. ఎన్‌సీడీ సర్వేను త్వరగా పూర్తిచేయాలన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లతో పాటు టెలిమెడిసిన్ ద్వారా అవసరమైన మేరకు వైద్య సహాయం అందించాలని సూచించారు. పీహెచ్‌సీ వైద్యుడు గ్రామాన్ని సందర్శించే ముందురోజు సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు రోగులను ఆస్పత్రికి తీసుకొచ్చేలా పనిచేయాలన్నారు.
జిల్లా హబ్‌ల సూచనల మేరకు రోగులను ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు పంపించడంతోపాటు చికిత్స అనంతరం తిరిగివచ్చిన రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారంతో ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఏబీహెచ్‌ఏ–అభా) నమోదు ప్రక్రియలో మిగిలిన 30 శాతాన్ని డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. గర్భిణుల విషయంలో సీహెచ్‌వోలు ప్రత్యేకశ్రద్ధ
తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment