జిల్లా కలెక్టర్ , వైద్య అధికారులతో డాక్టర్ హరికృష్ణ
సాక్షి, చిత్తూరు: యుద్ధ క్షేత్రంలో వెన్నుచూపని సైనికుడు ఆయన. కుటుంబానికి అయిదు నెలలుగా దూరంగా ఉన్నా మనోధైర్యం ఏమాత్రం సడలకుండా శత్రువుతో పోరాడుతున్నారు. ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్న ఆ యోధుడు ఓ డాక్టర్. ఆయన పోరాటం చేస్తోంది కరోనా అనే కనిపించని శత్రువుపై. ఆ మహమ్మారి తననూ ఇబ్బంది పెట్టినా.. తట్టుకుని నిలబడి మళ్లీ పోరాటానికి సిద్ధమవుతున్నారు తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆర్‌ఎంవోగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఈ.ఆర్.హరికృష్ణ. (కరోనా కాదంటూ రోదించినా... )
దైనందిన జీవితం మారిపోయిందిలా..
♦ ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తూనే వరండాలోనే స్నానం
♦ ప్రత్యేకంగా మిద్దెపై ఏర్పాటు చేసుకున్న గదిలో నివాసం
♦ కుటుంబ సభ్యులు దూరంలో పెట్టిన భోజనాన్ని తెచ్చుకుని తినడం
♦ తిన్న తర్వాత గిన్నెలు తోమడం.. ఆ తర్వాత అటు నుంచి అటే ఆస్పత్రికి వెళ్లడం.
కుటుంబానికి దూరం..
హరికృష్ణ భార్య మణికర్ణిక కూడా డాక్టర్. గైనకాలజిస్ట్‌గా ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. హరికృష్ణ తల్లిదండ్రులు కూడా ఆ ఇంట్లోనే ఉంటారు. 5 నెలల క్రితం వరకూ కుటుంబంతో ఉల్లాసంగా గడిపిన ఆయన ఇప్పుడు ముందు జాగ్రత్తగా వారందరికీ దూరంగా ఉంటున్నారు. (పిల్లలు మొబైల్ వదలడం లేదు..! )
కరోనా బాధితుడైనా..
ప్రస్తుతం ఈ యుద్ధంలో ఆయన కూడా ఓ బాధితుడిగా మారారు. గతనెలాఖరున ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాను విధులు నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లోనే అడ్మిట్ అయ్యారు. బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘ఆస్పత్రిలో సదుపాయాలన్నీ ఉండటంతో విధి నిర్వహణలో ఎలాంటి అసౌకర్యమూ లేదు. ఇంటి వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. 5 నెలలుగా పిల్లలతో గడపలేని పరిస్థితి. వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో కొంత భయపడినా దేవుడి దయతో కోలుకున్నాను. డిశ్చార్జి అయిన తర్వాత రోజు నుంచే యథావిధిగా విధులకు హాజరవుతాను’’.
– తిరుపతి తుడా
Comments
Please login to add a commentAdd a comment