శిరీష, ఫణిరాజ్ (ఫైల్)
ధర్మవరం అర్బన్: కోవిడ్ బారినపడి కోలుకున్న భార్యాభర్తలు ఇంటికి వచ్చిన తరువాత బంధువులు, ఇరుగుపొరుగు వారు చూపించిన వివక్షను భరించలేక మేడపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లా జిల్లా ధర్మవరం పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని తేరుబజార్‌కు చెందిన ఫణిరాజ్ (39), శిరీష(36) దంపతులు. వీరికి 12 ఏళ్ల కుమారుడు బాలాజీ ఉన్నాడు. ఫణిరాజ్ మూగవాడైనప్పటికీ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన బెల్లం వ్యాపారాన్ని ఆత్మస్థైర్యంతో ముందుకు తీసుకెళ్లాడు. అయితే కరోనా నేపథ్యంలో వ్యాపారం సరిగా సాగక ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఇంటివద్దే కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకున్నారు.
ఈ క్రమంలో పదిరోజుల కిందట ఫణిరాజ్ తల్లి వరలక్ష్మి కరోనా బారిన పడి మరణించింది. ఫణిరాజ్, శిరీష టెస్ట్‌లు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో వారు కోవిడ్ కేర్ సెంటర్‌లో చికిత్స పొంది రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు బెల్లం వ్యాపారంలో నష్టాలు రావడంతో తమకు ఉన్న వాటిలో ఒక ఇంటిని అమ్మేసినా అప్పులన్నీ తీర్చలేకపోయారు. అప్పులు తీర్చే మార్గం కనిపించక పోవడం, కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చాక ఇరుగుపొరుగు వారు, బంధువులు దూరం పెట్టడంతో భరించలేకపోయారు. శనివారం తమ కొడుకును తాతగారి ఇంటికి పంపించేశారు. ఆదివారం తెల్లవారుజామున తాము ఉంటున్న మూడంతస్తుల భవనంపైనుంచి కిందకు దూకారు. ఫణిరాజ్ అక్కడికక్కడే మృతిచెందగా, శిరీష ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment