కరోనా భయంతో ముగ్గురి ఆత్మహత్య | Three people commit suicide for fear of Corona | Sakshi
Sakshi News home page

కరోనా భయంతో ముగ్గురి ఆత్మహత్య

Published Wed, Aug 12 2020 6:26 AM | Last Updated on Wed, Aug 12 2020 6:30 AM

Three people commit suicide for fear of Corona - Sakshi

జీడిమెట్ల/చాదర్‌ఘాట్‌/కమ్మర్‌పల్లి: కరోనా భయంతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కరోనాతో చిక్సిత పొందుతూ ఒకరు, కరోనా సోకిందేమోనన్న భయంతో మరొకరు, టీవీలో కరోనా వార్తలు చూసి ఆందోళన చెంది ఇంకొకరు ఆత్మహత్య చేసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారుల వివరాల ప్రకారం.. జీడిమెట్ల పీఎస్‌ పరిధిలోని షాపూర్‌ నగర్‌కు చెందిన అనంత్‌రెడ్డి భార్య సుజాత (45)కు రెండ్రోజుల క్రితం జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చూపించగా మామూలు జ్వరమేనని డాక్టర్‌ తెలిపారు. అప్పటి నుంచి తనకు కరోనా సోకిందని మదనపడుతూ ఉండేది. ఈ క్రమంలో 10వ తేదీ రాత్రి సుజాత భర్త నైట్‌ డ్యూటీకి వెళ్లగా బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది.

పక్క రూమ్‌లో పడుకున్న కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి మంగళవారం ఉదయం లేచి చూడగా తల్లి విగతజీవిగా కనిపించింది. కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి (60) ఈ నెల 6న కరోనా పాజిటివ్‌తో మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేరాడు. కరోనా నుంచి కోలుకోగా మరో రెండ్రోజుల్లో డిశ్చార్జ్‌ కానున్నాడు. అయితే ఇంటికి వెళితే స్థానికులు ఏలా చూస్తారోనన్న ఆందోళనతో పాటు కరోనాపై టీవీల్లో వచ్చే వార్తలు చూసి మరింత భయానికి గురయ్యాడు. దీంతో పీపీఈ కిట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఏలేటి ఆనంద్‌రెడ్డి తన భార్య హేమలతరెడ్డి (65)తో కలిసి హైదరాబాద్‌లోని జీడిమెట్లలో నివాసం ఉంటున్నారు. హేమలతరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.

టీవీలో వచ్చే కరోనా వార్తలను రోజూ చూసి చూసి భయంతో మానసికంగా మరింత కుంగిపోయింది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం భర్తకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య ఇంట్లో లేకపోవడంతో ఆమె సెల్‌ఫోన్‌కు రాత్రి 8 గంటల సమయంలో ఫోన్‌ చేయగా.. నేను చావడానికి వస్తే పరిస్థితులు అనుకూలిస్తలేవు అని ఆమె చెప్పింది. దీంతో ఆనంద్‌రెడ్డి నీవెక్కడ ఉన్నావ్‌ అంటూ ఆరా తీయగా పోచంపాడు కాల్వ వద్ద ఉన్నానని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది. వెంటనే ఆనంద్‌రెడ్డి తన బావమరుదులతో కలిసి మంగళవారం ఉదయం ఎస్సారెస్పీ కాకతీయ కాలువ వెంట గాలించగా కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ గ్రామ శివారులోని కాలువలో మృతదేహంగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement