సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన జనాభాలో 93.94 శాతం మందికి కోవిడ్ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో టీకాల ప్రక్రియలు జరగడంవల్లే రాష్ట్రంలో కోవిడ్ మూడో దశలో లక్షణాల తీవ్రత, మరణాల శాతం చాలా తక్కువగా ఉంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కూడా తొలిడోసు నూటికి నూరు శాతం పూర్తయింది. అలాగే, 18 ఏళ్ల పైబడిన వారికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు డోసులు నూటికి నూరు శాతం పూర్తికాగా.. ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికి పైగా పూర్తయింది. మూడు జిల్లాల్లో 80 శాతానికి పైగా పూర్తయింది. ఇక మొత్తం మీద రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన 50.28 లక్షల మందికి మాత్రమే రెండు డోస్‌ల టీకా వేయాల్సి ఉంది. వీరికి కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోంది.
వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేయడంవల్లే..
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా పూర్తిచేయడంవల్లే కోవిడ్ మూడవ వేవ్‌లో మరణాల సంఖ్య దేశంతో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువగా ఉంది. అంతేకాక.. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు కూడా చాలా స్పల్పంగా ఉండడంవల్ల కేవలం వారం రోజుల్లోనే అందరూ కోలుకుంటున్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషనే కోవిడ్‌కు పరిష్కారమని తొలి నుంచీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడమే కాక రాష్ట్రంలో ఆచరణలో అమలుచేసి చూపించారు. దీనివల్లే ఇప్పుడు కోవిడ్ కేసులతో పాటు మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దేశంలో మరణాల రేటు 1.20 శాతం ఉంటే రాష్ట్రంలో కేవలం 0.64 శాతమే ఉంది.
అందుకే మరణాల రేటు తక్కువ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచీ వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించడంవల్లే రాష్ట్రంలో 18ఏళ్లు పైబడిన వారిలో 93.94 శాతం మందికి రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తయింది. దీని ఫలితం ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగైదు రోజుల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గడమే కాకుండా మరణాల రేటు దేశంతో పాటు ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి కూడా లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటోంది. కోవిడ్ వ్యాక్సినేషన్‌ను రాష్ట్రంలో వేగంగా పూర్తిచేయడమే ఇందుకు కారణం. ఈ నెలాఖరుకల్లా మిగతా వారికీ పూర్తిచేస్తాం.
– డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment