సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు కొంగ జపం చేస్తున్నారని సాగు నీటి రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ నిర్వాసితుల త్యాగాలను పణంగా పెట్టి, పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. నిర్వాసితులను ముంచేసైనా సరే కమీషన్లు వసూలు చేసుకోవాలన్న లక్ష్యంతో స్పిల్ వే పునాది స్థాయిలో ఉన్నా సరే పట్టించుకోకుండా.. 2018లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు చేపట్టారని ఎత్తి చూపుతున్నారు. తమకు పునరావాసం కల్పించకుండా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టిస్తున్నారని.. అవి పూర్తయితే తాము మునిగిపోతామని నిర్వాసితులు అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖలకు విన్నవించుకోవడాన్ని జల వనరుల శాఖ అధికారవర్గాలు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా మారాక పోలవరం ప్రాజెక్టుపై, నిర్వాసితుల పునరావాసంపై చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయని పేర్కొంటున్నారు.
ఈ పాపం ఎవరిది బాబూ?
► రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం వ్యయాన్ని భరించి, నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు, డిజైన్లకు తామే బాధ్యత వహిస్తామని తేల్చి చెప్పింది.
► ప్రాజెక్టును చేపట్టడం కోసం 2014 మే 24న పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఏర్పాటు చేసింది. నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని అప్పట్లో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి కూడా అయిన చంద్రబాబు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు.
► చివరకు పత్యేక హోదాను తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవడంతో 2016 సెప్టెంబరు 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది.
► 2014 ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని షరతు విధించింది. అంటే ఆనాటి పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు మాత్రమే ఇస్తామని 2017 మార్చి 15న జరిగిన కేంద్ర కేబినెట్‌లో పేర్కొంది. ఆ సమావేశంలో అప్పటి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న టీడీపీ సభ్యులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు అభ్యంతరం చెప్పలేదు.
► దీన్ని సాకుగా చూపుతూ.. 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదించి.. ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇవ్వడంలో కేంద్ర జల్ శక్తి శాఖ జాప్యం చేస్తూ వస్తోంది. ఇందులో నిర్వాసితుల పునరావాసానికి అయ్యే వ్యయమే రూ.33,168.23 కోట్లు ఉండటం గమనార్హం.
నిర్వాసితులకు ‘చంద్ర’ ద్రోహం
► పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కాక 2106 డిసెంబర్ 30 వరకు అంటే అధికారం చేపట్టి 31 నెలలు పూర్తయ్యాక నాటి టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు.
► స్పిల్ వే పునాది స్థాయి కూడా దాటకుండానే.. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను బావర్–ఎల్‌అండ్‌టీలకు అప్పగించి 2018 నాటికి పూర్తి చేశారు. ఆ తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు చేపట్టారు. పీపీఏ చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. పునరావాసం కల్పించే పనుల్లో కమీషన్లు రావని వాటిపై దృష్టి పెట్టలేదు. కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుం డా.. ఇరు వైపులా ఖాళీ పెట్టి చేతులెత్తేశారు.
► దాంతో 2019, 2020లలో గోదావరికి వచ్చిన భారీ వరదలు కాఫర్ డ్యామ్‌ల ఖాళీల గూండా అధిక ఉధృతితో ప్రవహించడం వల్ల ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై రెండు చోట్ల పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైంది. దీని వల్లే పోలవరం పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది.
కళ్లెదుటే కనిపిస్తున్నా కబోదిలా మాటలు!
► ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరోనా వేళ ఆర్థిక ఇబ్బందులున్నా సరే రాష్ట్ర ఖజానా నుంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు.
► 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 20,946 కుటుంబాల్లో ఇప్పటికే 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని 8,808 కుటుంబాలకు పునరావాసం కల్పించి.. గతేడాది జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. ఇప్పుడు 41.15 పరిధిలోని మిగతా 12,138 కుటుంబాలకు పునరాసం కల్పించే పనులు కొలిక్కి తెస్తున్నారు.
► పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.2,717.85 కోట్లను ఇప్పటికీ కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లను ఆమోదించి, నిధులు ఇవ్వాలని ప్రధాని, కేంద్ర మంత్రులకు పలుమార్లు సీఎం స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. అనేక సార్లు లేఖలు రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
► కేంద్రం నుంచి నిధులు రాబట్టి 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని 1,06,006 కుటుంబాలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాకనే ప్రాజెక్టులో 194.6 టీఎంసీలు నిల్వ చేస్తామని సీఎం వైఎస్ జగన్ ఇటు శాసనసభలో అటు వరద బాధితులను పరామర్శించిన సమయంలో తేల్చి చెప్పారు.
► పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల కంటే ఒక్క ఇంచు కూడా తగ్గదని.. కావాలంటే టేపు తెచ్చుకుని కొల్చుకోవాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. కళ్లెదుట జరగుతున్న పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తుండటం.. నిధుల కోసం కేంద్రంతో సీఎం వైఎస్ జగన్ పోరాడుతుంటే కళ్లున్న కబోదిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సాగు నీటి రంగ నిపుణులు, అధికార వర్గాలు మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment