సాక్షి, తుని: శ్రావణ శుక్రవారం పూట రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పెర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ అమోదం తెలపడంతో కర్నూల్, విశాఖపట్నం, తుని ప్రతి చోట ప్రజలు పండుగ చేసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు వికేంద్రీకరణ బిల్లు ఆమోదాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. రెండు వందల రోజులు రాజధాని కోసం కృత్రిమ ఉద్యమం చేశామని చెప్పుకునే చంద్రబాబు తాబేదార్లు మాత్రం స్వాగతించడం లేదని పేర్కొన్నారు. రాజధాని ప్రకటించక ముందే రూ. 30 లక్షలు కూడా విలువ చేయని భూములను చంద్రబాబు తాబేదార్లు కొనుక్కున్నారన్నారు.
ప్రకటన వచ్చాక వారిలో కొందరు ఎకరం రూపాయలు కోటిన్నర, రెండు కోట్లకు అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. ఇంకా అత్యాశకు పోయి కొంత మంది ఎకరం 10 కోట్ల రూపాయలు వస్తుందన్న దురాశతో ఆ భూములును ఉంచుకున్న వారే వికేంద్రీకరణ బిల్లుతో యిబ్బంది పడుతున్నారన్నారు. వికేంద్రీకరణ బిల్లుకు అనేక అడ్డంకులు సృష్టించాలని చంద్రబాబు త్రయం అనేక ప్రయత్నం చేసినప్పటికీ అవి సఫలీకృతం కావన్నారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని ఆ భారం అంతా తమ నెత్తిన చంద్రబాబు పెడుతున్నాడని తెలిసే రాష్ట్ర ప్రజలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చి ఘన సత్కారం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఈ విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారని, ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నానని ప్రభుత్వ విప్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment