
సాక్షి, అమరావతి: తొలి విడతలో ఈ నెల 9వ తేదీన పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గురువారం సాయంత్రం 3 గంటలతో గడువు ముగియనుంది. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. నామినేషన్ల పరిశీలన తర్వాత సర్పంచ్ పదవులకు 18,168, ఆయా గ్రామాల్లో వార్డు పదవులకు 77,554 నామినేషన్లు మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నచోట ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు.
ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నచోట అభ్యర్థులకు క్రమపద్ధతిలో ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లోని 7 మండలాలు, ఎటపాక రెవెన్యూ డివిజన్‌లోని 4 మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయాన్ని తగ్గించాలంటూ ఆ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రతిపాదించారు. ఆ మండలాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్న దృష్ట్యా మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతి కోరారు.
రెండో విడత గ్రామాల్లో...
రెండో విడతలో 3,327 పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు 33,562 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. ఆ గ్రామాల్లో బుధవారం కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. గురువారం సాయంత్రం 5 గంటలతో ఈ కార్యక్రమం ముగియనుంది. కాగా, గ్రామాల్లో దాఖలయ్యే నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు అన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి వీలుగా పంచాయతీరాజ్ శాఖప్రత్యేక వెబ్ అప్లికేషన్ రూపొందించింది. దీనికి సంబంధించిన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను జిల్లాల వారీగా డీపీవోలకు పంపించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్ తెలిపారు. సదరు లింక్ ఆధారంగా నామినేషన్ల సమాచారాన్ని ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.