
మాస్క్ లేకపోతే రానివ్వబోమంటూ దాదాపు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాలూ తీర్మానం చేశాయి.
సాక్షి, అమరావతి: మాస్క్ లేకపోతే రానివ్వబోమంటూ దాదాపు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాలూ తీర్మానం చేశాయి. ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నాయి. అలాగే కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13,371 గ్రామ పంచాయతీలుండగా శనివారం రాత్రి 12,193 చోట్ల ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరుతో గ్రామసభలు జరిగాయి.
ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నియంత్రణకు స్వచ్ఛందంగా తగిన జాగ్రత్తలు పాటిస్తామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గ్రామాల్లో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై గ్రామసభల్లో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్ లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి.. జరిమానా విధించాలని స్థానిక ప్రజలే స్వచ్ఛందంగా తీర్మానం చేసుకున్నారు. గ్రామాల్లోని హోటళ్లు, టీస్టాళ్ల వద్దకు వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా యజమానులే చూడాలని.. లేకపోతే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆయా హోటళ్లు, టీస్టాళ్ల నుంచి జరిమానా వసూలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు.
సర్పంచ్ అధ్యక్షతన కమిటీలు..
కరోనా కట్టడి కోసం చేపట్టే పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక గ్రామ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు అధ్యక్షులుగా సర్పంచ్‌లు వ్యవహరిస్తారు. వార్డు సభ్యులు, గ్రామ సచివాలయంలో పనిచేసే మహిళా పోలీస్‌తో పాటు ఏఎన్‌ఎంలు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. కాగా, జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ శాఖ కమిషన్ కార్యాలయంలో ఓఎస్‌డీ దుర్గాప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ పనిచేస్తుంది.