సాక్షి, అమరావతి: పొగతాగే వ్యసనం ఉన్నవారి నోటికి కోవిడ్–19 వైరస్ తాళం వేసింది. ఈ అలవాటు ఉన్న వారికి ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, ఇటువంటి వారికి కరోనా వైరస్ సోకితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో.. ఆరోగ్య భద్రత కోసం అనేక మంది పొగతాగే అలవాటును బలవంతంగా విరమించుకుంటున్నారు. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కరోనా కాలంలో చాలా మంది మానుకున్నట్టు సర్వే సంస్థలు నిర్ధారిస్తున్నాయి. ‘ఫౌండేషన్ ఫర్ స్మోక్–ఫ్రీ వరల్డ్’ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో అనేక మంది పొగ తాగడానికి దూరంగా ఉన్నట్టు తేలింది. ఈ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
► భారత్‌లో లాక్‌డౌన్ సమయంలో 72% మంది పొగ తాగడం మానేయాలని నిర్ణయం తీసుకున్నారు. చివరకు వీరిలో 66% మంది అలవాటును మానేశారు. పొగతాగడం వల్ల కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వీరిలో 48% మంది భావించారు.
► 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వినియోగదారుల్లో.. 72% మంది ధూమపానాన్ని మానేయడానికి ప్రయత్నించారు.
► 25 నుంచి 39 ఏళ్ల వయస్సున్న వారిలో 69% మంది పొగతాగడానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు.
కరోనా బాధితుల్లో పొగరాయుళ్లే ఎక్కువ..
► ధూమపానం అలవాటు ఎక్కువగా ఉన్న వారికి వైరస్ సోకే ప్రమాదం ఉందని మరొక సర్వేలో తేలింది. ప్రపంచంలో కోవిడ్–19 వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శ్వాసకోశ వైద్య నిపుణుడు జానీస్‌లీంగ్ ఇటీవల అధ్యయనం నిర్వహించారు. కరోనా బాధితుల్లో ఎక్కువ మంది పొగతాగే వారేనని తేలింది.
► పొగ పీల్చినప్పుడు ఎస్–2 ఎంజైమ్‌ను ముక్కు అధికంగా స్రవిస్తుందని, కరోనా వైరస్ నేరుగా, వేగంగా ఊపిరితిత్తుల్లోకి చేరుకునేందుకు ఇది బాటలు వేస్తోందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. చైనా, ఇటలీలలో అత్యధిక శాతం కరోనా రోగులు పొగతాగేవారేనని వెల్లడించింది.
డబ్ల్యూహెచ్‌వో అధ్యయనంలో వెలుగుచూసిన నిజాలు
► చైనాలో కరోన బారిన పడిన 82,052 మందిలో 95% మంది పొగతాగే అలవాటు ఉన్నవారే.
► ఇటలీలోనూ సింహభాగం కరోనా రోగులు పొగరాయుళ్లే ఉన్నారు.
► కరోనా బారిన పడిన వారిలో పొగతాగేవారి తర్వాతి స్థానం తీవ్ర శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారిదేనని వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment