సాక్షి, కడప కార్పొరేషన్/రూరల్: జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించడంతో దోమల వ్యాప్తి అధికమవుతోంది. దీంతో కొద్దిపాటి జ్వర లక్షణాలు కనిపించినా ప్రజలు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. డెంగీ నిర్ధారణ పరీక్షలకు క్యూ కడుతున్నారు. జిల్లాలో 19 డెంగీ కేసులు, 13 మలేరియా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా నమోదయ్యే కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రైల్వేకోడూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి.
పరీక్షల పేరుతో దోపిడీ
జిల్లా వ్యాప్తంగా డెంగీతోపాటు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతుండటం ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులకు వరంగా మారింది. జ్వరాలు ఎక్కువగా వస్తున్నందున ప్రజలు అది కోవిడ్ వల్ల వచ్చిందా, డెంగీ, మలేరియా, వైరల్ ఫీవరా తెలియక పరీక్షలకు వేలకు వేలు ఖర్చు చేస్తూ అవస్థలు పడుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగీ, ప్లేట్‌లెట్ కౌంట్ పరీక్షల పేరుతో ప్రైవేటు ల్యాబ్‌ల వారు రోగుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. జిల్లాలో కడప రిమ్స్, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి, పులివెందుల ఆసుపత్రుల్లో డెంగీకి ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఇవి అందుబాటులో ఉన్నాయని తెలియక, అవగాహన లేక ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి నష్టపోతున్నారు. నిజానికి ప్రభుత్వాసుపత్రుల్లోనే డెంగీ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.
దడ పుట్టిస్తున్న దోమలు
మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఎక్కువగా దోమ కాటువల్లే సంభవి స్తాయి. వ్యాధి కలిగిన జీవిని ఇది కుట్టి ఆరోగ్యంగా ఉన్న మరో జీవిని కుట్టడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందేలా చేస్తాయి. వీటి ద్వారా మలేరియా, బోదకాలు, చికున్‌గున్యా, డెంగీ, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ప్రస్తుత వర్షా కాలంలో దోమల వల్ల ప్రతి ఇంట్లో జనం జ్వరాల బారిన పడటం అధికమైంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దగ్గు, జలుబు, విష జ్వరాలు జిల్లాను వణికిస్తున్నాయి. కేవలం పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. గతంలో దోమలు ఆయా కాలం, వాతావరణ పరిస్థితులను బట్టి ఉధృతంగా ఉండేవి. అయితే ఇటీవల అన్ని కాలాల్లోనూ, అన్ని వేళల్లోనూ దోమలు ఉంటున్నాయి.
దోమల ఆవాసాలుగా
ఖాళీ స్థలాలు: పారిశుధ్యంపై మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నిర్లక్ష్యం దోమల ఉధృతి పెరగడానికి కారణమవుతోంది. ఖాళీ స్థలాల్లో నిల్వ ఉంటున్న నీరు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, ఫాగింగ్, స్ప్రేయింగ్ సరిగా చేయకపోవడం వల్ల దోమలు ఎక్కువగా పెరుగుతున్నాయి. దోమల నివారణకు మలాథియాన్ స్ప్రేయింగ్ సక్రమంగా చేస్తున్న దాఖలాలు కన్పించడం లేదు. చాలా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఫాగింగ్, స్ప్రేయింగ్ మెషీన్లు పనిచేయక మూలనపడ్డాయి. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రజలు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు ఒక వైపు చెబుతున్నా తప్పని పరిస్థితి ఏర్పడుతోంది
డెంగీ లక్షణాలు
♦ శరీర ఉష్ణోగ్రత పెరగడం
♦ వాంతులు, విరేచనాలు
♦ కళ్లు మంటలు, తీవ్రమైన తలనొప్పి
♦ చర్మ సమస్యలు
♦ చిగుళ్ల నుంచి రక్తస్రావం
♦ మూత్రంలో, మలంలో రక్తం పడటం
♦ కడుపు నొప్పి, జలుబు, దగ్గు
♦ నీరసం
అప్రమత్తంగా ఉండాలి
డెంగీ, మలేరి యా, టైఫాయిడ్ జ్వరాలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు, పెద్దలు పారాసిటమాల్ తప్ప వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు. కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి. 101 డిగ్రీలకు మించి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, వాంతులు తదితర లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. – కె. నాగరాజు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment