‘దారి’్రద్యాన్ని తొలగిస్తూ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విరివిగా నిధులు మంజూరు చేస్తోంది. ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య రాకపోకలను సులువు చేసే విధంగా జాతీయ రహదారులను సైతం తీర్చిదిద్దుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ పనులు చేపట్టేందుకు త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే ‘హాయి’వేలపై ప్రయాణం బడలిక లేకుండా సాగనుంది.
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోడ్లను మెరుగు పరుస్తూనే ... మరో వైపు కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో ఐదు జాతీయ రహదారులను అభివృద్ధి చేయనుంది. ఈ ఐదు జాతీయ రహదారుల పనులు పూర్తి అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మంజూరైన ఐదు జాతీయ రహదారుల పనులకు సంబంధించి మరో నెలన్నర రోజుల్లో నాలుగు పనులకు టెండర్లు ఆహా్వనించనుండగా, మరో పనికి సంబంధించిన టెండర్ ఈ నెలాఖరు నాటికి ఖరారు కానుంది. మొత్తం రూ.2516 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్ నంబర్: 167 కే, 765, 167 , 340బీలో 208.781 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చెందనున్నాయి. ఈ వ్యయంలో రూ.461 కోట్లను భూ సేకరణకు వెచ్చిస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి భూములను ఇచ్చిన రైతులకు పరిహారంగా ఈ నిధులను అందించనున్నారు.
మరమ్మతులకు అధిక ప్రాధాన్యం
జిల్లా పలు ఆర్‌అండ్‌బీ రోడ్లకు కాలానుగుణంగా మరమ్మతులు చేపట్టేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇప్పటికే ఈ పనులకు సంబంధించి రూ.43.35 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఈఎన్‌సీ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పూర్తి అధ్వానంగా తయారైన రోడ్లను ఎంపిక చేసి ప్రతిపాదనలను రూపొందించారు. ఇందులో ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రహదారులు కూడా ఉన్నాయి. రాష్ట్ర రహదారులకు సంబంధించి 16 రోడ్లలో 102.668 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. ఆయా రోడ్లకు ప్యాచ్ వర్కులతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్లను కూడా వేయనున్నారు. కర్నూలు – బళ్లారి, కోడుమూరు – ఎమ్మిగనూరు, బిల్లేకల్ – ఎమ్మిగనూరు, గుత్తి – పత్తికొండ ( ఆదోని రోడ్డు ), పెద్దతుంబలం – కోసిగి ( హాల్వి– రాంపురం రోడ్డు ), మద్దికెర – పత్తికొండ, ఆలూరు – హోళగుంద ( కర్ణాటక సరిహద్దు వరకు ) తదితర రోడ్లను ఈ ప్రతిపాదనల్లో చేర్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన అనంతరం ఈ రోడ్ల పనులను ప్రారంభం కానున్నాయి.
అభివృద్ధి చెందనున్న హైవేల వివరాలు..
♦ సంగమేశ్వరం నుంచి నల్లకాల్వ (93/819 నుంచి 124/530 కిలోమీటరు) వరకు, వెలుగోడు నుంచి నంద్యాల (141/700 నుంచి 173/560 కి.మీల) వరకు మొత్తం రూ.776.17 కోట్లతో 62.571 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పనులు జరగనున్నాయి. ఇందులో భూ సేకరణకు రూ.165 కోట్లు ఖర్చు చేయనున్నారు.
♦ ప్రకాశం జిల్లాకు సంబంధించి దోర్నాల నుంచి కుంట (244/0 నుంచి 268/700 కి.మీల) వరకు మొత్తం రూ.244.83 కోట్లతో 24.20 కి.మీల మేర పనులు చేపట్టనున్నారు. ఇందులో భూసేకరణకు రూ.51 కోట్లు వెచ్చించనున్నారు.
♦ నంద్యాల నుంచి జమ్మలమడుగు (186/02 నుంచి 248/010 కి.మీల) వరకు మొత్తం రూ.690 కోట్లతో 62.01 కి.మీల మేర పనులు చేయనున్నారు. ఇందులో భూసేకరణకు రూ. 135 కోట్లు వెచ్చించనున్నారు.
♦ రూ.155 కోట్లతో 7 కి.మీల మేర ఆదోని బైపాస్ రోడ్డు పనులు చేపట్టనున్నారు.
♦ సోమయాజులపల్లె నుంచి డోన్ (0/0 నుంచి 53/0 కి.మీల) వరకు రూ.650 కోట్లతో 53 కి.మీల మేర రోడ్డును వేయనున్నారు. ఇందులో భూసేకరణకు రూ.110 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ రోడ్డు పనులకు సంబంధించిన టెండర్ ఈ నెలాఖరు నాటికి పూర్తి కానుంది.
నాలుగు రోడ్లకు త్వరలోనే టెండర్లు
జిల్లాకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన నాలుగు రోడ్ల పనులకు నెలన్నర రోజుల వ్యవధిలోనే టెండర్లను ఆహా్వనించేందుకు చర్యలు చేపట్టాం. టెండర్లు పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభం అవుతాయి. సోమయాజులపల్లె – డోన్ జాతీయ రహదారికి సంబంధించిన టెండర్ ఈ నెలాఖరు నాటికి ఖరారు కానుంది. ఈ పనులు పూర్తి అయితే ఇటు వైఎస్సార్, అటు ప్రకాశం జిల్లాలకు మన జిల్లా నుంచి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
– ఏ ఇందిర, ఈఈ, ఎన్‌హెచ్ కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment