అమ్మానాన్నలను కోల్పోయిన చిన్నారుల కళ్లలో భయం ఇంకా పోలేదు. కన్నపేగులను పోగొట్టుకున్న వృద్ధుల కంట నీటి ధార ఇంకా ఆగలేదు. పగిలిన గాజులు, తెగిన తాళిబొట్లు ఊరి పొలిమేరలు దాటి పోలేదు. దాపురించిన ఆపత్కాలం అయిపోలేదు. కేసులు తగ్గినా ప్రమాదం తగ్గలేదు. ఇలాంటి సమయంలో వేడుకలు సరికావని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మన ఇంటిలో పెళ్లి మరొక ఇంటిలో చావుకు వేదిక కాకూడదని విన్నవిస్తున్నారు. మన వినోదం ఇంకొకరికి విషాదం పంచకూడదని హెచ్చరిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారు. వైద్య సిబ్బంది రాత్రీపగలు సేవలు అందిస్తున్నారు. అందరి కృషితో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి సమయంలో జిల్లాలో కొందరు మంచి ముహూర్తాల పేరిట వందలాదిగా గుమిగూడుతూ శుభ కార్యాలు చేసుకుంటున్నారు. ఇలాంటివి వద్దని వారిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇలాంటివి ఆగకపోతే మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వేడుకలకు హాజరైన వారు సూపర్ స్ప్రైడర్లుగా కోవిడ్‌ను వ్యాప్తి చేస్తున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. అనుమతించిన వారి కంటే ఎక్కువ మంది ఉంటే ఒక్కొక్కరిపైన రూ. 1000 అపరాధ రుసుం విధిస్తున్నారు.
తగ్గుతున్నవి కేసులే.. ప్రమాదం కాదు
జిల్లాలో రోజుకి 2,500కిపైగా కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడవి 231కి చేరాయి. ఇది మంచి పరిణామమే. అయితే కేసులు తగ్గుతున్నాయన్న ధీమాతో జిల్లాలో పలుచోట్ల కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యక్రమాలు చేపడుతున్నారు. వందలాది మంది హాజరై కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్పీ, డీఎస్పీలు, తహసీల్దార్లు, వీఆర్‌ఓలు ఎక్కడికక్కడ పెళ్లిళ్లు జరుగుతున్న చోటకు వెళ్లి పరిస్థితులను ఆరా తీస్తున్నారు. నిబంధనలకు మించి ఎక్కడ ఎక్కువ మంది హాజరయ్యారో అక్కడ సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. అక్కడికక్కడే అపరాధ రుసుం విధిస్తున్నారు.
జిల్లాలో నమోదైన కేసులివి..
► పాతపట్నంలో నిబంధనలకు మించి 200మంది అదనంగా హాజరయ్యారని పెళ్లి నిర్వాహకులపై రూ. 2లక్షల అపరాధ రుసుం విధించారు.
► ఆమదాలవలస మండలం దూసి గ్రామంలో నిబంధనలు ఉల్లంఘించి వివాహం జరిపిన ఒక కుటుంబానికి రూ.10వేలు ఫైన్ వేశారు.
► మర్రికొత్తవలసలో నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసిన వారికి రూ. 20వేలు అపరాధ రుసుం విధించారు.
► చేపనపేట గ్రామంలో రూ. 5వేలు అపరాధ రుసుం వేశారు.
► బూర్జ మండలంలో కూడా ఒక కుటుంబంపై రూ. 10వేలు అపరాధ రుసుం విధించారు.
► సోంపేట మండలం బెంకిలి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వివాహం జరిపించిన ఇద్దరికి రూ. 20వేలు ఫైన్ విధించారు.
► సోంపేట మండలంలోని జింకిభద్రలో ఒకరికి రూ. 20వేలు అపరాధ రుసుం విధించారు.
► ఎల్‌ఎన్‌పేట మండలం వాడవలస, శ్యామలాపురం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో రెండు కుటుంబాలకు రూ. 10వేల చొప్పున ఫైన్ వేశారు.
► ఇచ్ఛాపురం మండలం రత్తకన్న గ్రామంలో నిబంధనలు పాటించకుండా పెళ్లి చేసేందుకు సిద్ధమైన ఓ కుటుంబంపై రూ.25వేలు అపరాధ రుసుం విధించారు.
► నరసన్నపేట మండలం చెన్నాపురం పంచాయతీ గొనబుపేటలో నిబంధనలు ఉల్లంఘించినందుకు పెళ్లి నిర్వాహకులపై రూ. 15వేలు జరిమానా విధించారు.
► నరసన్నపేట మండలం శివరాంపురంలో ఒక కుటుంబంపై రూ. 20వేలు ఫైన్ వేశారు.
► సీతంపేట మండలం పూతికవలస పంచాయతీ ఈతమానుగుడలో నిబంధనలకు విరుద్ధంగా దైవప్రార్థనలు చేసిన వారికి రూ.లక్ష అపరాధ రుసుం విధించారు.
చర్యలు తప్పవు
కోవిడ్ కట్టడికి అధికారులంతా కష్టపడి పనిచేస్తుంటే కొంతమంది నిబంధనలు ఉల్లంఘించి అనుమతించిన వారి కంటే ఎక్కువ మందితో శుభ కార్యాలు నిర్వహిస్తున్నారు. ఇది సరికాదు. కోవిడ్ వ్యాప్తికి ఇవి కారణమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నాం. ఎంతటి వారైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అపరాధ రుసుం వసూలు చేస్తున్నాం.
– జె.నివాస్, కలెక్టర్, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment