
వంద రోజుల పాలనపై నేటి నుంచి సచివాలయాల ఉద్యోగులకు కరపత్రాలు పంపిణీ బాధ్యతలు
‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో వారం రోజులపాటు కార్యక్రమం నిర్వహణ
సాక్షి, అమరావతి: తమ వంద రోజుల పాలన గొప్పతనాలు అంటూ రాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనుంది. ఈనెల 20 నుంచి 26 వరకు వారం రోజులపాటు ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది తమ పరిధిలోని ఇంటింటినీ సందర్శించి సీఎం చంద్రబాబు ఫొటోతో కూడిన స్టిక్కర్‌ను ఇళ్ల తలుపులపై అంటించి.. ప్రభుత్వం అందజేసే కరపత్రాలను పంచిపెట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ బుధవారం రాత్రే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.
వారం రోజులపాటు జరగాల్సిన ఈ కార్యక్రమంపై గురువారం కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం మెసేజ్‌లు పంపింది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో ప్రజావేదికలు.. ఇక శుక్రవారం నుంచి మొదలుపెట్టే ఈ కార్యక్రమంలో సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరపత్రంలో పేర్కొన్న అంశాలను ప్రజలకు వివరించడంతో పాటు వారం రోజులపాటు అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జి ఒక్కో మండలంలో రోజుకొక గ్రామంలో ప్రజావేదిక నిర్వహించాలి. కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి గ్రామ, మండల స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
గత ఐదేళ్లలో 39.30 లక్షల కుళాయిలు
వైఎస్సార్‌సీపీ పాలనలో 2019–24 మధ్య రాష్ట్రంలో 39.30 లక్షల ఇళ్లకు కొత్తగా నీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. రాష్ట్ర సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్ పథకం అమలుపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తో కలిసి గురువారం సమీక్షించారు.
అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 95.44 లక్షల ఇళ్లు ఉండగా.. 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. ఇంకా 28 లక్షల ఇళ్లకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రానున్న మూడేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు.
జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళతో పాటు పలు రాష్ట్రాలు బాగా వినియోగించుకున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అలసత్వం కారణంగా రాష్ట్రంలో పనులు ముందుకు సాగలేదన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలన్నారు. తప్పులు సరిదిద్ది కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని, 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కోరారు.
Comments
Please login to add a commentAdd a comment