సాక్షి, అమరావతి: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో సోమవారం నుంచి 34వ రౌండ్ ఇంటింటి (హౌస్ టు హౌస్) ఫీవర్ సర్వేకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. వారంలో ఐదు రోజులపాటు నాణ్యత ప్రమాణాలతో ఫీవర్ సర్వే నిర్వహించాల్సిందిగా అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి ఆదేశాలు జారీ చేశారు. ఆశా వర్కర్లు, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి వాకబు చేస్తారు.
చదవండి: ఓటీఎస్‌కు మంచి స్పందన
ఎవరికైనా జ్వరంతో పాటు కోవిడ్ లక్షణాలుంటే సంబంధిత ఏఎన్‌ఎంతో పాటు మెడికల్ అధికారి దృష్టికి తీసుకువెళ్తారు. వారు వెంటనే కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాల ఆధారంగా హోం ఐసొలేషన్, చికిత్సకు సంబంధించిన సూచనలు చేస్తారు. ఉచిత మందుల కిట్ ఇవ్వడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో సహాయం అందిస్తారు. ఇప్పటికే 33 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించడం ద్వారా కోవిడ్ వ్యాప్తి నియంత్రించడంలో ప్రభుత్వం సఫలీకృతం అయింది. ఈ సర్వే డేటాను ఆన్‌లైన్ యాప్‌లో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు 34వ రౌండ్ తర్వాత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
విదేశాల నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు
ఒమిక్రాన్ వచ్చిన తరువాత విదేశాల నుంచి రాష్ట్రానికి రోజుకు 1,500 నుంచి 2,000 మంది వస్తున్నారు. ఈ నెల 1 నుంచి 17 వరకు 26,000 మందికి పైగా రాష్ట్రానికి వచ్చారు. వారందరికీ పరీక్షలు నిర్వహించాం. కోవిడ్ లక్షణాలుంటే తగిన చర్యలు చేపడుతున్నాం. ఒక పక్క కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా కొనసాగిస్తూ మరో పక్క ఫీవర్ సర్వే ద్వారా లక్షణాలున్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నాం.
– డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment