మల్లన్న సేవలో రాష్ట్రపతి ముర్ము  | Draupadi Murmu visited Srisaila Bhramaramba and Mallikarjunaswamy | Sakshi
Sakshi News home page

మల్లన్న సేవలో రాష్ట్రపతి ముర్ము 

Published Tue, Dec 27 2022 3:41 AM | Last Updated on Tue, Dec 27 2022 3:41 AM

Draupadi Murmu visited Srisaila Bhramaramba and Mallikarjunaswamy - Sakshi

రాష్ట్రపతికి, తెలంగాణ గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న అర్చకులు, నాయకులు

సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం శ్రీశైల భ్రమరాంబ, మల్లి­కార్జునస్వామి వార్లను భక్తిశ్రద్ధలతో దర్శించు­కున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఆలయ అధికారులు ప్రత్యేక గౌరవ లాంఛనాలతో దర్శనం చేయించి తీర్థప్రసాదాలను అంద­జేశారు. మ.12.45 గంటలకు ప్రత్యేక హెలి­కాప్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్న రాష్ట్రపతికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్వాగతం పలికారు.

అక్కడి నుంచి నేరుగా ఆలయానికి చేరు­కున్న రాష్ట్రపతికి ఆలయ అధికారులు, వేద­పం­డితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీశైల ప్రధాన ఆల­యంలోకి ప్రవేశించిన తర్వాత ముందుగా రత్న గర్భగణపతి స్వామిని రాష్ట్రపతితో పాటు తెలంగాణ గవర్నర్‌ దర్శించు­కు­న్నారు. అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి­వారిని దర్శించుకు­న్నారు. వివిధ అభిషేకాలు నిర్వహించి స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అక్కడ నుంచి భ్రమరాంబదేవి అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన జరిపించారు. వేదపండితులు రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్‌ను వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాలను, శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి వారి చిత్రపటాల జ్ఞాపికలను ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈఓ లవన్న అందజేశారు.

స్వామి దర్శనం అనంతరం నందిసర్కిల్‌ సమీపంలోని టూరిజం ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో రూ.43.08 కోట్లతో చేపట్టిన ప్రసాద్‌ ప్రాజెక్టు శిలాఫలకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విశిష్టత.. భక్తులు, యాత్రికులకు అందే సౌకర్యాలు, సదుపాయాలను ఆలయ అధికారులు రాష్ట్రపతికి వివరించారు.
 
చెంచులతో ముఖాముఖి
ఆలయ ప్రాకారానికి సమీపంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని మ.2.40గంటలకు రాష్ట్రపతి సందర్శించారు. రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి గిరిజన విద్యార్థులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అక్కడ చెంచు మహిళలతో రాష్ట్రపతి ముఖాముఖి నిర్వహించారు. 26మంది చెంచులతో ప్రతి ఒక్కరినీ పేరు అడిగి తెలుసుకుని జీవన విధానం, ప్రస్తుత పరిస్థితులను ఆరా తీశారు.

ఎలా జీవనం సాగిస్తున్నారు? భూములు ఉన్నాయా? సాగులోని భూములకు పట్టాలిచ్చారా? పింఛన్లు అందుతున్నాయా? చదువుకున్న గిరిజనులకు ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి? తదితర అంశాలను ఆరా తీశారు. దీనికి గిరిజనులు స్పందిస్తూ.. ప్రభుత్వం రేషన్‌ అందిస్తోందని, పింఛన్లు, ఇళ్లు అందుతున్నాయన్నారు.

పిల్లల చదువుపై ఆరా తీసిన సమయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని, పిల్లలను స్కూలుకు పంపే ప్రతి తల్లికి డబ్బులు బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నారని, దీనివల్ల పిల్లలను మంచి చదువులు చదివించుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇళ్లు నిర్మిస్తోందన్నారు. కొంతమంది గిరిజనులకు ఇళ్ల స్థలాలు లేవన్నారు.

టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు కావడంతో గూడేల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఫారెస్టు అధికారులు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. దీనికి రాష్ట్రపతి స్పందిస్తూ.. ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. ఎలాంటి పంటలు సాగుచేసుకుంటున్నారని అడిగితే అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించేవాళ్లమని, ఇప్పుడు అటవీ భూముల్లో పంటలు పండించుకుంటున్నామన్నారు. 

తక్కువ ధరకే దేవస్థానంలో దుకాణాలు
ఇక గతంలో గిరిజనులకు ఆలయ పరిధిలో 16 దుకాణాలు మాత్రమే ఉండేవని, ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి చొరవతో తమకు ప్రస్తుతం 30 దుకాణాలు ఇచ్చారన్నారు. మార్కెట్‌లో రూ.40–50వేల అద్దె ఉంటే, తమకు కేవలం రూ.2–3వేల అద్దె మాత్రమే తీసుకుంటున్నారన్నారు. దుకాణాల నిర్వహణకు రుణాలు కూడా ఇచ్చారన్నారు. దుకాణాల్లో వ్యాపారం ద్వారా రోజుకు రూ.వెయ్యి ఆదాయం వస్తోందన్నారు.

తనను చూసేందుకు వచ్చిన వారితో రాష్ట్రపతి సరదాగా ఫొటోలు దిగారు. అందరితో సరదాగా, ఓపిగ్గా ముచ్చటించిన రాష్ట్రపతి సా.4 గంటలకు తిరుగు పయనమయ్యారు. రాష్ట్రపతి పర్యటనలో పర్యాటకశాఖ మంత్రి రోజా, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్‌ మనజీర్‌ జిలాన్‌సామూన్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ మేధా జ్యోష్ణవి, ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి, శివాజీ స్ఫూర్తి కేంద్రం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు టీజీ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement