సాక్షి, అమరావతి: ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే నివేదించారు. అందులో భాగంగానే ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటును సవాలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ఇలాంటి వ్యాజ్యాలను దాఖలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ కారణాలతో ప్రభుత్వ విధాన నిర్ణయాలను అడ్డుకునే దిశగా దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలను ఆదిలోనే కొట్టివేయాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వొద్దంటూ బ్యాంకులకు లేఖలు రాస్తున్నారని, తద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని న్యాయస్థానానికి నివేదించారు.
రుణాలు కొత్తేమీ కాదు..
ఆస్తులపై హక్కులను బదలాయించి రుణాలు తీసుకోవడం కొత్తేమీ కాదని, కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో ఏకంగా ఓ పథకాన్ని అమల్లోకి తెచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఆ ఆస్తులపై యాజమాన్య హక్కులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని, పిటిషనర్లు వాస్తవాలను తెలుసుకోకుండా రాజకీయ కారణాలతో రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలన్నీ సంచిత నిధికే జమ అవుతాయని, ఆ తరువాతే అవి ఏపీఎస్‌డీసీకి వెళతాయన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల గవర్నర్ సార్వభౌమత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లడం లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని నివేదించడంతో హైకోర్టు అందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
గవర్నర్ పేరా?
ఏపీఎస్‌డీసీ చట్టబద్ధతపై విజయవాడకు చెందిన కన్నెగంటి హిమబిందు, ఏపీఎస్‌డీసీకి ఆదాయాల బదలాయింపుపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, బ్యాంకులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎస్క్రో ఒప్పందాన్ని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన వెంకట గ్రీష్మ కుమార్‌లు వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై సీజే ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాలపై విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం విశాఖపట్నంలోని పలు ప్రభుత్వ ఆస్తులను ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీ వద్ద తనఖా పెట్టి భారీ రుణం పొందిందని వెలగపూడి తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కున్న రక్షణను తొలగించి ఆయన సార్వభౌమత్వం విషయంలో ప్రభుత్వం రాజీపడిందన్నారు. గవర్నర్‌పై కేసులు, పిటిషన్లు వేసే విధంగా బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ అసలు ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. వీటిని మొగ్గలోనే తుంచేయాలన్నారు.
ఈ వ్యాజ్యాల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ గవర్నర్ సార్వభౌమత్వం విషయంలో ఎలా రాజీపడతారని ప్రశ్నించింది. ఒప్పందంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరును ఎలా ప్రస్తావిస్తారని, ఎల్లకాలం ఆయనే కొనసాగరు కదా? అని పేర్కొంది. రుణాల విషయంలో గవర్నర్ పేరును చేర్చడం సరికాదని సూచిస్తూ దీనిపై తమకు స్పష్టతనివ్వాలని ఆదేశించింది. ఇందుకు దవే సమాధానమిస్తూ ప్రభుత్వ కార్యనిర్వాహక నిర్ణయాలు, ఒప్పందాలు అన్నీ గవర్నర్ పేరు మీదే జరుగుతాయని, ఇదేమీ కొత్త కాదని వివరించారు. అన్ని వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని నివేదించడంతో మూడు వ్యాజ్యాల్లో విచారణను ధర్మాసనం ఈ నెల 21కి వాయిదా వేసింది. కౌంటర్ల దాఖలు తరువాత మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయాన్ని పరిశీలిస్తామంది.
ప్రజాక్షేత్రంలో చెల్లక కోర్టుకెక్కారు
Published Fri, Oct 8 2021 3:37 AM | Last Updated on Fri, Oct 8 2021 3:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment