Fact Check: కోర్టులను మోసం చేసే రామోజీకి పోర్టుల గురించి ఏం తెలుసు? | Eenadu fake news on the government | Sakshi
Sakshi News home page

Fact Check: కోర్టులను మోసం చేసే రామోజీకి పోర్టుల గురించి ఏం తెలుసు?

Published Thu, Feb 22 2024 5:20 AM | Last Updated on Thu, Feb 22 2024 5:22 AM

Eenadu fake news on the government - Sakshi

‘అసలే కోతి.. ఆ పైన కల్లు తాగింది.. ఆ తర్వాత దానికి పిచ్చెక్కింది.. తర్వాత దానికి దయ్యం పట్టింది.. ఇక ఈ కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?.. పచ్చ పత్రిక ఈనాడు అధినేత రామోజీరావు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజా  సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ప్రతి అంశంలోనూ విషం జిమ్మడమే రామోజీ పనిగా పెట్టుకున్నారు.

నిత్యం ప్రభుత్వంపై అసత్యాలు, అబద్ధాలు,  వక్రీకరణలతో కూడిన కథనాలను అచ్చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ‘రేవూ.. రేవూ..  ఎందుకు పూర్తికావు’ అంటూ ఈనాడులో ఒక విష కథనాన్ని వండివార్చారు. అభూత కల్పనలతో, అసత్యాలతో సాగిన ఈ కథనానికి  సంబంధించి అసలు వాస్తవాలివీ..  – సాక్షి, అమరావతి

దేశంలో గుజరాత్‌ తర్వాత అత్యధిక సముద్ర తీరం 974 కి.మీ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాభివృద్ధికి సుదీర్ఘ సముద్ర తీరాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తీర ప్రాంతం వెంట లక్షల్లో నివసిస్తున్న మత్స్యకారుల సంక్షేమంపై ముందుగా దృష్టి సారించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులు చేపల వేటకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేవారు.

గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలసపోయేవారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌ కోస్ట్‌గార్డుకు  మన మత్స్యకారులు చిక్కారు. ఇలాంటి దుస్థితిని అరికట్టడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పేరుతో వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. అంతేకాకుండా వలసలను నివారించడానికి రాష్ట్రంలోనే పది ఫిషింగ్‌ హార్బర్లను నిర్మించాలని తలపెట్టింది.

వీటిలో ఇప్పటికే జువ్వలదిన్నె హార్బర్‌ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేసుకుని ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం అందుబాటులోకి రానున్నాయి. రెండో దశ కింద మరో ఆరు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు సాగుతు­న్నాయి. అయితే ఇంత జరుగుతున్నా రామోజీ­రావు మాత్రం కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారు.  

ఏకంగా రూ.4 వేల కోట్ల వ్యయంతో.. 
మత్స్యకారులు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితికి చెక్‌ పెడుతూ ఏకంగా రూ.4 వేల కోట్ల వ్యయంతో పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఏకంగా 60 వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా.. వారు స్థానికంగానే ఉపాధి పొందేలా మినీ పోర్టుల స్థాయిలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచి­లీపట్నం, ఉప్పాడ, మంచినీళ్లపేట, బుడగట్లపాలెం, పూడిమడక, ఓడరేవు, బియ్యపుతిప్ప, కొత్తపట్నం వద్ద ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తోంది.

అదేవిధంగా విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పలంకల్లో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను అభివృద్ధి చేస్తోంది. 12,000 బోట్లను సురక్షితంగా నిలుపుకోవడమే కాకుండా అక్కడే చేపలను వేలం వేసుకోవడం, శీతలీకరణ, ఎండబెట్టుకోవడం, మార్కెటింగ్‌ వంటి అన్ని సౌకర్యాలను సమకూరుస్తోంది. అలాగే ఈ ఫిషింగ్‌ హార్బర్ల పక్కనే ఆక్వా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కులను కూడా అభివృద్ధి చేస్తోంది.  

అందుబాటులోకి తొలి దశ హార్బర్లు 
తొలి దశలో రూ.1,523 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పనులు పూర్తయి వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధమవుతుండటంతో రామోజీ కడుపుమంటతో తట్టుకోలేకపోయారు.

మిగిలిన మూడు హార్బర్లలో నిర్మాణ పనులు 65 శాతంపైగా పూర్తయినా కేవలం 30 శాతమే అయ్యాయంటూ ఎప్పటిలానే అబద్ధాలను అచ్చేశారు. దాదాపు రెండేళ్లపాటు కరోనా, మధ్యలో భారీ వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ ప్రభుత్వం పనులను వేగంగా పూర్తి చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement