హృదయాన్ని తాకింది | Everyone applauds CM Jagan letter to give Bharat Ratna to Pingali Venkayya | Sakshi
Sakshi News home page

హృదయాన్ని తాకింది

Published Sun, Mar 14 2021 3:38 AM | Last Updated on Sun, Mar 14 2021 3:38 AM

Everyone applauds CM Jagan letter to give Bharat Ratna to Pingali Venkayya - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న వేళ.. ప్రజల్లో దేశ భక్తి పెంపొందించే విధంగా చేపట్టిన ‘ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్యను భారత రత్నతో సత్కరించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆ లేఖలో సీఎం ప్రస్తావించిన పలు అంశాలపై రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. పింగళి వెంకయ్యకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలన్నది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అంటూ లేఖ ప్రారంభించి.. వెంకయ్య ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్టు సమగ్రంగా వివరించారని కొనియాడుతున్నారు.

మరణానంతరం ఎంతో మందికి భారత రత్న ఇచ్చారని, దేశం కోసం పాటుపడిన పింగళి వెంకయ్యకు సరైన గుర్తింపు రానందున అదేరీతిలో ఇప్పుడైనా భారతరత్నతో గౌరవించాలని కోరడం సందర్భోచితమని మెచ్చుకుంటున్నారు. ఇదే సమయంలో వెంకయ్య కూతురు సీతామహాలక్ష్మి ఉంటున్న గుంటూరు జిల్లా మాచర్లకు స్వయంగా వెళ్లి ఆమెను సన్మానించడం, రూ.75 లక్షలు సాయంగా అందజేయడం గొప్ప విషయమని చెబుతున్నారు.

ఆమె కుటుంబ సభ్యులతో సీఎం జగన్‌ ఆప్యాయంగా మాట్లాడి.. నాటి విశేషాలను తెలుసుకోవడం చూస్తుంటే ఆనందంతో తమ కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయని పలువురు స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబీకులు ‘సాక్షి’కి తెలిపారు. అజాది కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న తరుణంలో సీతామహాలక్ష్మికి ఒక సీఎంగా వైఎస్‌ జగన్‌ తగిన గౌరవం ఇచ్చారని ప్రశంసించారు. ‘పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించడం చూస్తుంటే దేశాన్ని గౌరవించినట్లనిపించింది’ అంటూ పలువురు భావోద్వేగంతో చెప్పారు.    సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధులు, వారి కటుంబ సభ్యుల స్పందనలు ఇలా ఉన్నాయి. 
 
గతంలో ఎవ్వరూ ఇలా గుర్తించలేదు
సీఎం వైఎస్‌ జగన్‌.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబం వద్దకు స్వయంగా వెళ్లి పలకరించారని నా కుమారుడు రవీంద్రకుమార్‌రెడ్డి చెప్పారు. ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం కలిగింది. సీఎం స్వయంగా వెళ్లి వెంకయ్య కుటుంబ సభ్యులను పలకరించడం హర్షణీయం. దేశం కోసం పోరాడిన స్వతంత్య్ర సమరయోధులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తద్వారా ఈ తరం వారికి నాటి యోధుల గురించి తెలుస్తుంది. పింగళికి భారతరత్న ఇవ్వాలని సీఎం జగన్‌ ప్రధాన మంత్రికి లేఖ రాయడం అభినందనీయం. నా భర్త మాజీ చిత్తూరు ఎంపీ పొలకల నరసింహారెడ్డి తమ్ముడు. వారిద్దరూ 1923లో మద్రాసులోని లయోలా కాలేజీలో చదివేవారు. అప్పట్లో స్వాతంత్య్రం కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో వారు పాల్గొన్నారు. నా భర్త ను బళ్లారిలోని అలిపోర్‌ జైలులో నాలుగు నెలలు బంధించారు. గతంలో ఏ ప్రభుత్వమూ స్వాతంత్య్ర సమర యోధులను పట్టించుకోలేదు.. గుర్తించలేదు. 
– పొలకల సరోజమ్మ (94), స్వాతంత్య్ర సమరయోధుడు పొలకల కృష్ణమూర్తి సతీమణి, రెడ్డివారిపల్లి, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా 

సీఎం పరామర్శిస్తుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయాను
జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించి సత్కరించడం దేశ భక్తికి నిదర్శనం. గత ప్రభుత్వాలు స్వాతంత్ర సమరయోధులను పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవాలంటే యుద్ధమే చేయాల్సి వచ్చేది. రాజన్న బిడ్డ స్వయంగా సమర యోధుని ఇంటికి వచ్చి పరామర్శించడం టీవీల్లో చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు. మా నాన్న డి.రంగారావు దేశం కోసం పడిన నరకం వర్ణించలేనిది. పలుమార్లు ఆయన్ను జైల్లో పెట్టారు. జనాన్ని సేకరించి, ఉద్యమ పాఠాలు చెబుతున్నారని శారీరకంగా కూడా హింసించారు. అవన్నీ ఈరోజు మళ్లీ నా కళ్ల ముందు మెదిలాయి. మా నాన్నకు 11 మంది సంతానం. నేను ఆయనకు 3వ కూతుర్ని. ప్రస్తుతం నా వయస్సు 76 ఏళ్లు. పెళ్లి చేసుకోకుండా ఆయనకు సేవ చేశాను. 16 ఏళ్ల క్రితం నాన్న చనిపోయారు.  
– డి.భానుమతి, మారుతి నగర్, కొర్లగుంట, తిరుపతి 
 
ఆనందదాయకం 
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యతో స్వాతంత్య్ర సమరయోధులది విడదీయరాని సంబంధం. భారతదేశం కోసం ఓ పతాకం కావాలని జాతిపిత మహాత్మాగాంధీ పిలుపు నిచ్చినప్పుడు కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి పింగళి వెంకయ్య జండాను తయారు చేసి చూపారు. దాని అర్థాన్ని వివరించి చెప్పడంతో గాంధీజీ సంతోషంగా అంగీకరించారు. అప్పట్లో కృష్ణా జిల్లా నుంచి ఉద్యమం నడిపిన వాళ్లలో నేను పిన్న వయస్కుడిని. గాంధీ గారు వన్‌టౌన్‌కు వచ్చినప్పుడు నేనూ వెళ్లాను. అప్పటి నుంచి ఉద్యమాల్లో పాల్గొన్నాను. అంతగొప్ప చరిత్ర ఉన్న పింగళి వెంకయ్య కుటుంబాన్ని గుర్తించి సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించడం ఆనందదాయకం. 
– యెర్నేని నాగేశ్వరరావు (92), స్వాతంత్య్ర సమరయోధుడు, గుణదల, విజయవాడ
 
గౌరవం దక్కింది
స్వాతంత్య్ర సమరయోధులకు గుర్తింపు కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్‌ బాబు పింగళి కుటుంబాన్ని పరామర్శించి, అండగా నిలవడం అభినందనీయం. ఇది స్వాతంత్య్ర సమరయోధులందరికీ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. మా త్యాగాలను గుర్తించి గౌరవించిన మొదటి ముఖ్యమంత్రి జగనే. ఆయన పాలనలో సమరయోధులకు గౌరవం దక్కింది. పైగా పింగళికి భారత రత్న ఇవ్వాలని ప్రధానికి లేఖ రాయడం సరైన సమయంలో సరైన చర్య.
– రామ్‌పిళ్ల నరసాయమ్మ (93), స్వాతంత్య్ర సమర యోధురాలు, వన్‌టౌన్, విజయవాడ

ఎంతో ఆనందంగా ఉంది 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను సత్కరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పింగళి కుటుంబాన్ని సత్కరిస్తుంటే రాష్ట్ర ప్రజలంతా గర్వంతో ఉప్పొంగిపోయుంటారు. మా ఆయన దేవినేని నారాయణస్వామి. 1920 అక్టోబర్‌ 31న రాకెట్లలో జన్మించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే, ఎంపీగా అనంతపురం జిల్లా వాసులకు ఎంతో సుపరిచితులు. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 1942 నుంచి నాలుగు సార్లు బళ్లారి లోని ఆల్లీ పూర జైలుకు వెళ్లొచ్చాడు. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పుడు స్వాతంత్య్ర సమర యోధులకు మళ్లీ గౌరవం పెంచారు. 
– దేవినేని కమలమ్మ, రాకెట్ల, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా

స్వాతంత్య్ర సమరయోధులకు గౌరవం
పింగళి వెంకయ్య కుమార్తెను సీఎం వైఎస్‌ జగన్‌ సన్మానించడం అంటే స్వాతంత్య్ర యోధులందరికీ సన్మానం లాంటిది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ధర్నాలు, సత్యాగ్రహాలు చేసి జైలు జీవితాలు గడిపి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన వాళ్లలో నేనూ భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. ఇవాళ మన ముఖ్యమంత్రి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రధానికి లేఖ రాయడం హర్షించదగ్గ పరిణామం. సీఎం చర్యలను అభినందిస్తున్నాను. 
–అనుమల అశ్వత్త నారాయణ (96), స్వాతంత్య్ర సమర యోధుడు, నందనవనం, జరుగుమల్లి మండలం, ప్రకాశం జిల్లా

గర్వంగా ఉంది..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పింగళి వెంకయ్య ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత సమరయోధుల చరిత్రను అందరికీ తెలిసేలా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఆనందించదగ్గ విషయం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేందుకు చేసిన పోరాటాలకు గుర్తింపుగా అప్పుడప్పుడు సన్మానిస్తున్నారు. ప్రభుత్వమే ఇలాంటి వేడుకలను నిర్వహించటం వల్ల నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. 
– తోట వెంకటభారతమ్మ, స్వాతంత్య్ర సమరయోధురాలు, మచిలీపట్నం

 సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా దేశభక్తిని ప్రజల్లో మరింతగా పెంపొందించాలి. ‘అజాది కా అమృత్‌ మహోత్సవ్‌ ’ నిర్వహించేందుకు కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు స్ఫూర్తిని కలిగించే విధంగా ఉండాలి. మువ్వెన్నల జెండా రూపకర్త పింగలి వెంకయ్యను భారతరత్నతో సత్కరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రికి లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నాం. సమరయోధుల కుటుంబాలను ఆదరించాలి. ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలి.
– గొద్దు దమయంతి, స్వాతంత్య్ర సమరయోధుడు జీఎల్‌నాయుడు భార్య, తామరాపల్లి, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లా

ఆనందాన్నిచ్చింది..
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లి ఆమెను సన్మానించి గౌరవించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. స్వాత్రంత్య్ర పోరాట సమయంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి బానిస బతుకుల నుంచి కాపాడిన వారిని అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో గౌరవించడం గొప్ప విషయం. జాతిపిత గాంధీ సారవకోట వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యులు ఆతిథ్య మివ్వడం ఎంతో ఆనందం కలిగించింది. 
– బోయిన రమణమ్మ, స్వాతంత్య్ర సమరయోధుడు బోయిన కామరాజు భార్య, సారవకోట, శ్రీకాకుళం జిల్లా 

పింగళి కుమార్తెకు సన్మానం అభినందనీయం
ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించడం సంతోషకరం. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మిని సన్మానించటం అభినందనీయం. పింగళి వెంకయ్యకు భారతరత్న బిరుదు ఇవ్వాలని సీఎం జగన్‌ లేఖ రాయడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఇది నాలాంటి స్వాతంత్య్ర పోరాట యోధులకు ఎంతో సంతృప్తినిస్తుంది. 
– పావులూరి శివరామకృష్ణయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు, గోవాడ, గుంటూరు జిల్లా

సీఎం నిర్ణయం అభినందనీయం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వయస్సులో చిన్నవాడైనప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. అన్ని వర్గాలు, వయస్సుల వారికి విలువ, గౌరవాన్ని ఇస్తూ ఆయన పాలన సాగిస్తున్నారు. త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం స్వయంగా కలసి ఆయనకు ఉన్న దేశభక్తిని చాటుకున్నారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులతో మమేకమై పలకరించిన తీరు అభినందనీయం. ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు.  
– వరికూటి చెన్నయ్య, కొత్తపేట, కంచికచర్ల మండలం, కృష్ణా జిల్లా 

శభాష్‌ జగన్‌
స్వతంత్ర భారత దేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఇంత మంచి పని చేయలేదు. మన రాష్ట్ర సీఎం జగన్‌ పింగళి వారసులను సన్మానించి స్వాతంత్య్ర సమరయోధులను తలెత్తుకొనేలా చేశారు. కేవలం ఆగస్టు 15, జనవరి 26న మొక్కుబడిగా మమ్మల్ని గుర్తు చేసుకునే వారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కొద్ది మంది కోసం, వారి వారసుల కోసమైనా ఒక ప్రత్యేక భరోసా ఇస్తే బావుంటుంది. సీఎం జగన్‌ కృషికి ధన్యవాదాలు. నేను నా భర్తతో కలిసి గాంధీజీ పిలుపు నిచ్చిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నాం. బళ్లారి, రాజ
మండ్రి జైళ్లలో శిక్ష అనుభవించాం. 
– గరగ వెంకటరమణమ్మ, స్వాతంత్య్ర సమర యోధురాలు, విప్పర్రు, పశ్చిమగోదావరి జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement