సాక్షి, తూర్పుగోదావరి: గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ శాఖ అధికారులు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అధికం కావడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వస్తున్న మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటిమట్టం నమోదు కావడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరద నీటిని సుమారు పది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే తూర్పు డెల్టా కాలువలకు 2,500 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు మూడు వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలావుంటే భద్రాచలం వద్ద 45.10 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. గోదావరి ఎగువ ప్రాంతంలోని కాలేశ్వరం వద్ద 9.17 మీటర్లు, పేరూరు వద్ద 11.70, దుమ్ముగూడెం వద్ద 12.52, భద్రాచలం వద్ద 45.10 అడుగులు, కూనవరం వద్ద 18.30 మీటర్లు, కుంట వద్ద 12.94 మీటర్లు, కొయిదా వద్ద 23.15మీటర్లు, పోలవరం వద్ద 12.94, రాజమహేంద్రవరం రైల్వే హేక్ బ్రిడ్జి వద్ద 16.23 మీటర్ల తో వరద గోదావరి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న గోదావరి ఉప నదుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment