నగరం వద్ద గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడు సమయంలో ఎగిసిపడుతున్న మంటలు (పాతచిత్రం)
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కోనసీమ గుండెలపై నిప్పుల కొలిమి రాజేస్తున్న చమురు సంస్థలు హామీలు నెరవేర్చకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. పాతికేళ్ల క్రితం పాశర్లపూడి సమీపాన 1995 జనవరి 8న సంభవించిన దేవర్లంక బ్లో అవుట్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా రికార్డు సృష్టించింది. నాటి ప్రమాదంలో ప్రాణనష్టం లేకున్నా ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఆ బ్లో అవుట్ గాయం నుంచి కోలుకుంటుండగా, 2014 జూన్ 27న నగరం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్) సమీపాన ట్రంక్ పైపులైన్ పేలుడు ఘటన 23 మందిని పొట్టన పెట్టుకుంది.
మరో 16 మంది క్షతగాత్రులుగా మిగిలారు. ఈ సంఘటనలే కాకుండా కోనసీమలో తరచూ జరిగే గ్యాస్ లీకేజీ ప్రమాదాలు అక్కడి ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) హామీలు గాలిలో కలిసిపోతున్నాయి. వాటిని నెరవేర్చడంలో ఆ సంస్థ విఫలమవుతోంది. నగరం గ్యాస్ విస్ఫోటం సందర్భంలో ఇచ్చిన హామీలే ఇప్పటికీ నెరవేరలేదు. 23 మంది మృతుల్లో కుటుంబాలకు కుటుంబాలే బూడిదైపోయాయి. ఒక్క గటిగంటి శ్రీనివాసరావు కుటుంబంలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు.
పరిహారం పెంపులో బాధితుల పక్షాన ‘జగన్’
నగరం జనాభా 6,279. ఇక్కడ ఘోర విస్ఫోటం జరిగి ఆదివారానికి ఎనిమిదేళ్లవుతున్న సందర్భంగా స్థానికులను ‘సాక్షి’ శనివారం పలకరించింది. గెయిల్ ఇచ్చిన ప్రధాన హామీలు ఇన్నేళ్లయినా ఆచరణకు నోచుకోలేదని వారు చెప్పారు. ఆ ప్రాంతంలో ఇళ్లు, పచ్చని కొబ్బరి తోటలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఘటనకు పూర్తి బాధ్యత గెయిల్‌దే. ఓఎన్‌జీసీ సహజ వాయువు వెలికి తీస్తే దాని సరఫరా, మార్కెటింగ్ చేసేది గెయిలే. ఆ ప్రక్రియలో లోపంతోనే విస్ఫోటం సంభవించింది. పేలుడు అనంతరం ఇచ్చిన హామీలను ఆ సంస్థ మరచిపోయిందని బాధితులు దుమ్మెత్తి పోస్తున్నారు.
అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు సరే అన్నారు తప్ప మారుమాటాడలేదు. 48 గంటల్లో సంఘటన స్థలానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి వైఎస్సార్ సీపీ తరపున రూ.లక్ష పరిహారం అందించారు. మృతుల కుటుంబాలను, అమలాపురం, కాకినాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి వంతున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్‌పై స్పందించిన కేంద్రం పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచింది.
గ్రామాభివృద్ధిని విస్మరించారు
నగరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని గెయిల్ మాట ఇచ్చినప్పటికీ దానిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. ఏడాదికి రూ.2 కోట్ల చొప్పున ఐదేళ్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లకు రూ.4 కోట్లు మాత్రమే ఇచ్చారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న హామీని గెయిల్ పూర్తిగా విస్మరించింది.– తాడి రామకృష్ణ, నగరం
పరిహారంలో మోసం
పేలుడు సంఘటనలో తీవ్ర గాయాలతో ప్రాణాలు నిలబడ్డాయి. నాలుగు నెలలకు పైనే చికిత్స చేయించారు. నా భార్య రత్నకుమారి ఊపిరితిత్తులు దెబ్బతిని ఏడాదిన్నర తర్వాత చనిపోయింది. మా అమ్మ, ఇద్దరు కుమార్తెలు కూడా తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. నాకు రూ.25 లక్షలు, నా భార్యకు రూ.25 లక్షలు, ఇళ్లు దెబ్బ తిన్నందుకు రూ.15 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి, చివరకు రూ.10 లక్షలతో సరిపెట్టారు. పిల్లల విద్యకు, ఉపాధికి అవకాశం కల్పిస్తామని మోసం చేశారు. – బోనం పెద్దిరాజు, క్షతగాత్రుడు
ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు
గెయిల్ పైపులైన్ విస్ఫోటంలో నాతోపాటు బిడ్డలు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని గెయిల్ మాట ఇచ్చింది. ఆ రోజు ఆ మాటకు చాలా సంతోషించాం. ఏదో ఒక భరోసా లభిస్తుందని అనుకున్నాం. ఎనిమిదేళ్లయినా హామీ నిలుపుకోలేదు. మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకరికి ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలి. – వానరాశి దుర్గాదేవి, క్షతగాత్రురాలు
Comments
Please login to add a commentAdd a comment