ఒకప్పుడు అమ్మాయి పుట్టిందంటే మైనస్ అని భావించేవారు..చదువుల్లో, ఇతర రంగాల్లో వారికి అవకాశాలు తక్కువగా ఉండేవి. సమాజంలో ‘అబల’ అనే వివక్షను సైతం ఎదుర్కొనేవారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వివిధ పథకాల అమలులో తరుణీమణులకు పెద్ద పీట వేయడంతో వారిజీవితాలు మెరుగుపడ్డాయి. అవకాశాల్లో సగ భాగం కల్పించడంతో పలు రంగాల్లో మగవారికి దీటుగా రాణిస్తున్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా దూసుకుపోతున్నారు. నేడు (సోమవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
కర్నూలు: మహిళాభ్యున్నతి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. స్త్రీనే ఇంటి యజమానురాలిగా మార్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. చట్ట సభల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనులు.. ఇలా అనేక వాటిలో సగం మహిళలకే కేటాయించారు. వివక్ష లేకుండా మహిళలకు విద్య, వైద్యం అందించడంతోపాటు వారి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చి అతివల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచారు.
బాలికా సంరక్షణ..
జిల్లాలో బాలికల సంరక్షణ యూనిట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న అమ్మాయిలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి చూపుతున్నారు. ఆపైన వయస్సు ఉన్న మహిళలకు కూడా వివిధ సహాయ సహకారాలు అందిస్తున్నారు. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యల నివారణకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్ల వయస్సులోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. బాలికా సంరక్షణ కేంద్రం ద్వారా అనాథ, సొంతవాళ్లు లేనివాళ్లను చేరదీసి పోషిస్తున్నారు. దత్తత కేంద్రం ద్వారా పిల్లలను 5వ తరగతి వరకు అక్కడే చదివిస్తున్నారు. 6 నుంచి కేజీబీవీ విద్యా సంస్థల్లో చదివించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత ఇస్తున్నారు.
దిశ వన్ స్టాప్ సెంటర్
హింస, వేధింపుల నుంచి ఆడ పిల్లలకు రక్షణ కల్పించేందుకు దిశ వన్‌స్టాప్ సెంటర్‌ను కర్నూలులో ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, గైనకాలజీ, ఫొరెన్సిక్, ఆర్‌ఎంఓ వైద్యులను కేటాయించారు. ఒక దుర్ఘటన జరిగితే ఆడపిల్లలు పోలీస్, లాయర్లు, డాక్టర్లు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఒకే చోట సేవలన్నీపొందే వీలు కల్పించారు. అలాగే కిశోర బాలికల కోసం వైఎస్సార్ కిశోర వికాసం పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో తొమ్మిది రకాల సేవలు అందిస్తున్నారు. పౌష్టికాహారం అందించడం, బాల్య వివాహాలను అరికట్టడం, బాల కారి్మక వ్యవస్థను నిర్మూలించడం, బాలికల అక్రమ రవాణాను అడ్డుకోవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశాలు. ఈ పథకం కింద సలహాలు, సూచనలు అందిస్తారు.
జిల్లాలో 3,126 మంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 2,399 కిరాణా దుకాణాలకు రూ. 8.03 కోట్లరుణాలు మంజూరు చేసింది. అలాగే 675 మంది మహిళలకు గొర్రెలు, మేకల యూనిట్లు ఇప్పించింది.విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా అమ్మ ఒడి పథకం కింద జిల్లాలో 4,12,884 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు ప్రతి ఏడాది రూ.15వేలు చొప్పున ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 2.42లక్షల మంది బాలింతలకు, అలాగే 1.92 లక్షల మంది పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
సాయం కోసం ఫోన్ నంబర్లు..
స్త్రీ, శిశు సంరక్షణ కోసం ఉచిత ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 181 (ఉమెన్), 1098 (చైల్డ్ ), 112, 100, 1091, 08518–255057(పోలీసు సహాయం కోసం) 24గంటలూ పనిచేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment