మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే | Global Handwashing Day 2020 Special Story In Srikakulam | Sakshi
Sakshi News home page

మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే

Published Thu, Oct 15 2020 11:08 AM | Last Updated on Thu, Oct 15 2020 1:18 PM

Global Handwashing Day 2020 Special Story In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కరోనా కాలంలో చేతుల పరిశుభ్రతపై అందరికీ అవగాహన వచ్చింది. అయితే ఇలాంటి ఆపత్కాలంలోనే కాదు.. ఎల్లవేళలా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులకు బాల్యం నుంచే దీనిపై అవగాహన పెంచితే చాలా వరకు రోగాలు రాకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. నేడు గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే. ఈ సందర్భంగా.. 

ఎందుకు శుభ్రం చేసుకోవాలి..? 
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం సబ్బుతో చేతులు శుభ్రపర్చుకోకుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు టైఫాయిడ్, పచ్చకామెర్లు, కళ్ల కలకలు, దగ్గు, జలుబు, న్యూమోనియా, మెదడు వాపు, చర్మవ్యాధులు వంటి వ్యాధులు కూడా సోకు తాయి. పాఠశాలల్లో విద్యార్థులు చేతుల శుభ్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. వారు వినియోగించే సాక్సులు రోజూ ఉతకడం, నీటి సీసాలు కడగడం వంటివి చేయకపోతే ఫంగస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకోకుండా చూడాలి. ఆటలాడి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కునేలా చర్యలు తీసుకోవాలి. 

దినసరి కార్యక్రమాల్లోనూ.. 
రోజు చేతులు మారే కరెన్సీతోపాటు ప్రతి చోటా చేతులు పెట్టడం ద్వారా మనకు క్రి ముల రూపంలో వ్యాధులు సోకే ప్రమా దం ఉంది. వివిధ రకాల రోగాలున్న వారి నుంచి రోగకారక క్రిములు మన చేతికి వస్తున్నందున అవి మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి తలుపులు, ఫ్రిజ్‌ల డోర్లు, కుళాయిలు తిప్పడం, ద్విచక్ర వాహనాల హ్యాండిల్, కంప్యూటర్లు కీబోర్డు వినియోగంలోనూ అప్రమత్తంగా ఉంటూ పరి శుభ్రత పాటించకుంటే తెలీకుండానే రోగాల పాలయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందువల్ల ఇలాంటి వాటిని పట్టుకున్నప్పుడు తక్షణమే చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.    

మీకు తెలుసా..? 

  • చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా 80 శాతం అంటువ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు దూరమవుతాయి.  
  • ప్రతి వంద మందిలో పది మందికి వచ్చే అంటువ్యాధులు చేతులు పరిశుభ్రంగా లేకుంటేనే వస్తున్నాయని ఓ అధ్యయనం తెలిపింది.  
  • ఆహారం తీసుకునే ముందు 38 శాతం మంది, లెట్రిన్‌కు వెళ్లి వచ్చిన వారిలో 53 శాతం మంది, వంట చేసే సమయంలో 33 శాతం మంది మాత్రమే చేతులను పరిశుభ్రం చేసుకుంటున్నారని ఓ సర్వేలో తేటతెల్లమైంది.  
  • చేతులు శుభ్రం చేసుకోకుండా కంటిని, ముక్కుని, నోటిని తాకడం ద్వారా ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకుతుంది. 

 చేతుల శుభ్రత ఇలా.. 

  • ఏటా మన జిల్లాలో సర్వశిక్షాభియాన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ చేతుల పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తుంది. చిన్నారుల కు చేతులు శుభ్రం చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తుంది. 
  • అరచేతులు, వేళ్ల సందులను సబ్బు లేదా లోషన్‌తో రుద్దుకోవాలి.  
  • చేతుల వెనుక వైపు నుంచి వేళ్ల సందుల్లో శుభ్రం చేసుకోవాలి. చేతుల ముని వేళ్లను రుద్దుకోవాలి.  
  • చేతుల మణికట్టును బాగా రుద్ది కుళాయి కింద వేళ్లు ఉంచాలి. మురికిపోయే విధంగా శుభ్రం చేసుకోవాలి.  
  • చేతి బొటన వేళ్లతో బాగా రుద్ది శుభ్రం చేసుకోవడం ద్వారా చేతులు పరిశుభ్రంగా ఉంటాయి. 
  • ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవాలి.  
  • లెట్రిన్‌కు, టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన ప్రతి సారి చేతిని శుభ్రం చేసుకోవాలి.  
  • హ్యాండ్‌ శానిటైజర్‌ వినియోగం తప్పనిసరి. అలా అని శానిటైజర్‌ రాసిన తర్వా త చేతిని శుభ్రం చేసుకోకుండా ఆహా రం తీసుకుంటే అనారోగ్యం దరి చేరుతుంది.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

  • ఆహారం తీసుకునే ప్రతిసారి రెండు చేతులను కనీసం రెండుసార్లు సాధారణ సబ్బుతో కడగాలి. 
  • సబ్బు అందుబాటులో లేనిచోట కనీ సం నీటితో బాగా కడగాలి. కుళాయి ఉంటే ఫోర్స్‌గా తిప్పి చేతులు కడగాలి. కాళ్లు కడగడం కూడా తప్పనిసరి. 
  • ఆహారం తీసుకున్న తర్వాత చేతులు కడిగాక, ఉతికిన పరిశుభ్రమైన వస్త్రంతో చేతిని తుడుచుకోవాలి. 
  • గోళ్లలో మట్టి చేరకుండా జాగ్రత్తపడాలి. గోళ్లు ఎక్కువైతే కట్‌ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు అయి నా తలస్నానం చేయాలి. దువ్వెనలో మట్టిలేకుండా చూసుకోవాలి. 
  • మల విసర్జన తర్వాత తప్పనిసరిగా రెండు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.  
  • తినే ఆహార పదార్థాలను ముట్టుకునే ముందు, తినే ముందు, పిల్లలకు ఆహారం తినిపించే ముందు ఆహారం తినిపిస్తున్న సమయంలో చేతులు ఇతర పనులకు వినియోగించరాదు. 
  • పెంపుడు జంతువులను తాకినప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకోవాలి.  
  • బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి.  
  • అప్పుడే పుట్టిన నవజాత శిశువును తాకే సమయంలో. 
  • కంప్యూటర్‌పై వర్క్‌ చేసిన సమయంలో పక్కనే శానిటైజర్‌తో చేతిని శుభ్రం చేసుకోవాలి.  

చేతుల పరిశుభ్రత అవసరం
చేతుల పరిశుభ్రత అనేది చాలా అవసరం. జనాభా పెరగడంతో పాటు కాలుష్య పరికరాలు వినియోగం పెరిగిపోతుంది. ప్రతి వ్యక్తి చేతిలో 10 మిలియన్‌ వైరస్‌తో ఒక మిలియన్‌ బ్యాక్టీరియా ఉంటుంది. భోజనానికి ముందు, తర్వాత లెట్రిన్, బాత్‌రూమ్‌లకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు సబ్బుతో, లోషన్‌తో శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది. ఇలా చేయడం ద్వారా 80 శాతం మేర అంటురోగాలు దరి చేరవు.  
– డాక్టర్‌ ఎంసీహెచ్‌ నాయుడు, సూపరింటెండెంట్, రాజాం సీహెచ్‌సీ 

ఎంతో ప్రయోజనం  
చేతుల శుభ్రతతో రోగాల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువగా చిన్నారుల్లో జలుబు, దగ్గు, జ్వరం, నీరసం వంటి వ్యాధులు చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్లనే సంక్రమిస్తుంటాయి. ప్రతి నిత్యం ఆటలాడుకునే చిన్నారులు చేతులు కడగకుండా చిరుతిళ్లు తినడంతోపాటు ఆహారం తీసుకోవడంతో క్రిములు వ్యాపించి రోగాల బారిన పడుతుంటారు. చేతుల శుభ్రత తప్పనిసరిగా చేయడం ద్వారా ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. 
– ఎం.కోటేశ్వరరావు, చిన్నపిల్లల వైద్యులు, రాజాం 

అంతర్జాతీయ ప్రమాణాలు..
హ్యాండ్‌వాష్‌ చేసుకోవడానికి అంతర్జాతీయంగా ప్రమాణాలు ఉన్నాయి. సాధారణ సబ్బుతో గానీ, లిక్విడ్‌తో గానీ చేతులను శుభ్రం చేసుకోవాలి. ముందుగా రెండు అరచేతులను రుద్దుకోవాలి. అదే విధంగా చేతివేళ్ల మధ్య ఉన్న భాగాన్ని శుభ్రం చేసుకోవాలి. చేతి గోళ్లను శుభ్రం చేసుకోవాలి. అరచేతి వెనుక భాగాన్ని బాగా కడగాలి. చేతులను శుభ్రం చేసుకున్నాక పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. – డాక్టర్‌ ఆర్‌.స్వాతి, వైద్యాధికారి, ఇచ్ఛాపురం మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement