సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం నియోజకవర్గంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలను పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నది పరివాహక ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో గోదావరి వరద ఉధృతి, ముందస్తు చర్యలపై ఐటీడీఏ, పీఓ, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ, 3 మండలాల తహశీల్దార్, ఎంపీడీఓ, ఇతర మండల స్ధాయి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గోదావరి నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నందున ఇప్పటికే చాలా గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయని, తక్షణమే ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చాలని ఆదేశించారు. (పరవళ్లు తొక్కుతున్న గోదావరి)
గర్భిణులు, బాలింతలు, ఇతర వైద్య అవసరాలు ఉన్న వృధ్ధులు ను తక్షణమే అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యం కలిగిన ప్రాంతాలలోని వైద్యుల పర్యవేక్షణకు తరలించాలని తెలిపారు. పై గ్రామాల ప్రజలకు సరిపడా నిత్యవసరాలు, ఆహార పదార్థాలు, మంచినీరు అందుబాటులో ఉంచాలి అని ఆదేశించారు. డయోరియా, అతిసార, మలేరియా, టైపాయిడ్ వంటి జబ్బలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని, తగినన్ని మందులు, వైద్య, ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. (గోదావరి, కృష్ణా జిల్లాలకు అతి భారీ వర్ష సూచన)
ముంపు గ్రామాలు, రాకపోకలు లేని గ్రామాలకు నోడల్ అధికారులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచార సేకరణ తో పాటు అన్ని వ్యవస్ధల పై పూర్తి పర్యవేక్షణ ఉంచాలన్నారు. తగినన్ని బొట్లు,ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకుని అత్యవసర పరిస్ధితుల్లో సంసిధ్ధులుగా ఉండాలన్నారు. అనుమతి లేని ప్రయాణికుల బోట్లు నిషేధించి ఎవరైన నిబంధనలు అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ వరద నష్టాన్ని తగ్గించాలన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 24 గంటలు పనిచేసే విధముగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
అలాగే.. కరెంటు సరఫరా ఉండని ప్రాంతాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రహదారి సౌకర్యం, కరెంటు సరఫరా నిలిచిపోయే ప్రాంతాల్లో ని ఆసుపత్రులకు జనరేటర్ సౌకర్యం కల్పించాలని, సరిపడా ఆయిల్ నిల్వలు కూడా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి, అధికారులకు సహకరించి వరద నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని నివరించాలన్నారు.ప్రజలకు సాధ్యమంత అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ అధికారులకు తోడ్పాటును అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బాలరాజు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment