thellam bala raju
-
పట్టాభి నాపై చేసిన వ్యాఖ్యలు నిరాధారం: తెల్లం బాలరాజు
సాక్షి, అమరావతి : టీడీపీ నేత పట్టాభి తనపై చేసిన వ్యాఖ్యలు నిరాధారమని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం ప్యాకేజీలో నిర్వాసితులందరికీ న్యాయం చేస్తున్నామని, తనపై ఆరోపణలు చేసిన మచ్చ మహాలక్ష్మి, మడకం సావిత్రి ఎవరో తనకు తెలియదని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. ‘‘ పట్టాభి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. పట్టాభి నాపై చేసిన వ్యాఖ్యలకు సీబీఐ విచారణకు సిద్ధం. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు పట్టాభి సిద్ధమా?. బాబు హయాంలో నిర్వాసితులకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసింది మేమే. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారు’’ అని అన్నారు. -
వసంతవాడ విషాదం: స్పందించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం వసంతవాడ వాగు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. వసంతవాడ వద్ద వాగులో గల్లంతై ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద సంఘటనను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మృతుని కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మంత్రి ఆళ్ల నాని ద్వారా ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.18 లక్షలు అందజేయనుంది. మృతి చెందిన ఆరుగురు కూడా విద్యార్థులు, యువకులు కావడంతో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. (చదవండి: గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం) చావులోనూ వీడని స్నేహితులు ఒకే ఊరు. ఒకే వీధి. అందరూ దాదాపు ఒకే ఈడూ పిల్లలు. ఒకరు తొమ్మిదో తరగతి, ఒకరు పది , ఒకరు ఇంటర్మీడియట్. మొత్తం ఎనిమిది మంది స్నేహ బృందం. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సంతర్పణ కాస్త విషాదంగా మారి గంగాధర వెంకటరావు, కర్నాటి రంజిత్, గొట్టి పర్తి మనోజ్, కునారపు రాధాకృష్ణ (16), కెల్లా భువన్ (18), శ్రీరాముల శివాజీ (18) వాగులో మునిగి చనిపోయిన ఘటనతో ఏజెన్సీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అమ్మవారి నిమజ్జనం తెల్లారే విషాదం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం వసంతవాడ వాడ వాగులో దిగి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యి మృత్యువాత పడ్డారు. దసరా ఉత్సవాల సందర్భంగా భుదేవిపేట గ్రామానికి చెందిన ఓ 15 కుటుంబాలు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు నిర్వహించి నిన్న నిమజ్జనం చేశారు. మరుసటి రోజు సంతర్పణ ఏర్పాటు చేసుకోవడం వీరి ఆచారం. ఈ నేపథ్యంలో ముగింపు వేడుకల అనంతరం వసంతవాడ వాగు వద్ద బుధవారం వన సంతర్పణ ఏర్పాటు చేసుకున్న క్రమంలో స్నేహితులంతా కలిసి వంట సామాన్లు తీసుకు వచ్చారు. ఈ ఆరుగురు స్నేహితులు వాగు దాటి బహిర్భూమికి వెళ్లి వచ్చే క్రమంలో ప్రవాహంలో మునిగిపోయి వాగులో మునిగి మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు ఆడుతూ నీళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో ఒకరు మునిగిపోగా మిత్రుణ్ణి కాపాడే క్రమంలో ఒక్కొక్కరు మునిగిపోయారు. 'వారిని కాపాడటానికి వాగులో దిగాను అందరూ ఒకేసారి నన్ను పట్టుకునేసరికి ఊపిరాడక ఒడ్డుకి వచ్చేసా..ఒక్కరినీ కూడా కాపాడలేకపోయాను' అని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. విహారానికి వచ్చి మృత్యువాత పడటం విచారకరమని, మృతుల కుటుంబాలన్ని నిరుపేద జీవితాలని, బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. -
‘బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం’
సాక్షి, పశ్చిమగోదావరి : వరద ముంపు బాధిత ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఉండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. బాధిత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే బాలరాజు, కలెక్టర్ ముత్యాల రాజు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరిలో లాంచ్‌లో వెళ్లి వరద బాధిత ప్రజలను పరామర్శించారు. జోరు వర్షంలోనే ముంపు గ్రామాల బాధితుల సమస్యలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ('అది టీడీపీ కాదు.. ట్విటర్ జూమ్ పార్టీ') ఆళ్ల నాని మాట్లాడుతూ.. బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతాయని తెలిపారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇప్పటికే అందించినట్లు తెలిపారు. ఒకరికి అయిదు కేజీల బియ్యం, కుటంబానికి కిలో కంది పప్పు, నూనె, అయిదు రకాల నిత్యావసర వస్తువుల అందజేసినట్లు వెల్లడించారు. జిల్లాలో 10 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారన్నారు. అంటు వ్యాధులు రాకుండా శానిటేషన్ చేశారని, పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు, డాక్టర్లను అందుబాటులో ఉంచామని.. అందరి సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగామని పేర్కొన్నారు. (ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దు: ఆళ్ల నాని) నిత్యావసర వస్తువులు అందించాం వరదపై ముందుగానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజలకు వరద వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ఇప్పటికే సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారని, వరద వలన నష్టపోయిన ఒక్కొక్క కుటుంబానికి రెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల అందించామన్నారు. ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని మమ్మల్ని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. మళ్ళీ వర్షాలు పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. అయితే ఎన్ని మంచి పులు చేసిన విమర్శించడం టీడీపీకి అలవాటు అయ్యిందని మండిపడ్డారు. వారు పనులు చేయరు.. చేసిన వారిపై విమర్శలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకు విమర్శలు చేయడం తప్ప మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. (నవరత్నాల అమలులో మరో ముందడుగు) వరద బాధితులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. వరదకు ముందుగానే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించామన్నారు.మళ్ళీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామన్నారు. చంద్రబాబు నిర్వహకం వలనే గ్రామాలు మునిగిపోయే పరిస్థితి వచ్చిందని, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు కంటే ముందుగా కాపర్ డ్యామ్ నిర్మించడం వలన తరుచూ గ్రామాలు మునిగిపోతున్నాయని విమర్శించారు. (గోదావరి ఉధృతి.. అధికారులు అప్రమత్తం) -
గోదావరి ఉధృతి.. అధికారులు అప్రమత్తం
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం నియోజకవర్గంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలను పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నది పరివాహక ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో గోదావరి వరద ఉధృతి, ముందస్తు చర్యలపై ఐటీడీఏ, పీఓ, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ, 3 మండలాల తహశీల్దార్, ఎంపీడీఓ, ఇతర మండల స్ధాయి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గోదావరి నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నందున ఇప్పటికే చాలా గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయని, తక్షణమే ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చాలని ఆదేశించారు. (పరవళ్లు తొక్కుతున్న గోదావరి) గర్భిణులు, బాలింతలు, ఇతర వైద్య అవసరాలు ఉన్న వృధ్ధులు ను తక్షణమే అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యం కలిగిన ప్రాంతాలలోని వైద్యుల పర్యవేక్షణకు తరలించాలని తెలిపారు. పై గ్రామాల ప్రజలకు సరిపడా నిత్యవసరాలు, ఆహార పదార్థాలు, మంచినీరు అందుబాటులో ఉంచాలి అని ఆదేశించారు. డయోరియా, అతిసార, మలేరియా, టైపాయిడ్ వంటి జబ్బలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని, తగినన్ని మందులు, వైద్య, ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. (గోదావరి, కృష్ణా జిల్లాలకు అతి భారీ వర్ష సూచన) ముంపు గ్రామాలు, రాకపోకలు లేని గ్రామాలకు నోడల్ అధికారులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచార సేకరణ తో పాటు అన్ని వ్యవస్ధల పై పూర్తి పర్యవేక్షణ ఉంచాలన్నారు. తగినన్ని బొట్లు,ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకుని అత్యవసర పరిస్ధితుల్లో సంసిధ్ధులుగా ఉండాలన్నారు. అనుమతి లేని ప్రయాణికుల బోట్లు నిషేధించి ఎవరైన నిబంధనలు అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ వరద నష్టాన్ని తగ్గించాలన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 24 గంటలు పనిచేసే విధముగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే.. కరెంటు సరఫరా ఉండని ప్రాంతాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రహదారి సౌకర్యం, కరెంటు సరఫరా నిలిచిపోయే ప్రాంతాల్లో ని ఆసుపత్రులకు జనరేటర్ సౌకర్యం కల్పించాలని, సరిపడా ఆయిల్ నిల్వలు కూడా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి, అధికారులకు సహకరించి వరద నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని నివరించాలన్నారు.ప్రజలకు సాధ్యమంత అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ అధికారులకు తోడ్పాటును అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బాలరాజు పిలుపునిచ్చారు. -
అటవీప్రాంతంలో బాలరాజు పర్యటన
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: ఏజెన్సీలోని అటవీప్రాంతంలో బాహ్యప్రపంచానికి దూరంగా కనీస వసతులు కరువై జీవనం సాగిస్తున్న గోగుమిల్లి, చింతపల్లి, గడ్డపల్లి, దారావాడ, చిలకలూరు తదితర గ్రామాల్లోని సుమారు 1800 కొండరెడ్డి కుటుంబాలకు బుధవారం నాగ భూషణం, ఎం.రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఐటీడీఏ పీవో ఆర్వి సూర్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశా రు. గిరిజనులకు మాస్క్‌లు పంపిణి చేయడంతో పాటు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. కొండకోనల్లో, దట్టమైన అటవీ ప్రాంతంలో అనేక అవస్థలు పడుతూ భుజాలపై నిత్యావసరాలు మోసుకుంటూ వెళ్లారు. -
పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి సంజీవిని : అనిల్ కుమార్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవిని అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్ కాల్వలు తవ్వకపోతే భూసేకరణకు వేలకోట్ల రూపాయల అదనపు భారం పడేదన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. పోలవరం దగ్గర ఫొటోలు తీసుకోవటం తప్ప! గత ప్రభుత్వానికి ప్రాజెక్ట్ పూర్తి చేద్దామన్న ధ్యాసే లేదని ఎద్దేవా చేశారు. ముంపునకు గురయ్యే లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్ట్ వ్యయం అంచనా పెంచుకుంటూ పోవడమే తప్ప.. టీడీపీ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వైఎస్సార్ కల : తెల్లం బాలరాజు పోలవరం ప్రాజెక్ట్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వానికి పోలవరంను పూర్తి చేయాలన్న ఆలోచన రాలేదని మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితులను కూడా గత ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. టీడీపీ నిర్వాకం వల్లే ప్రాజెక్ట్ పూర్తి కాలేదని ఆరోపించారు. -
రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమే ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
జీలుగుమిల్లి, (జంగారెడ్డిగూడెం), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో 48 గంటలపాటు నిర్వహించిన రహదారుల దిగ్బంధనం కార్యక్రమం విజయవంతమైంది. గురువారం జీలుగుమిల్లిలో జరిగిన దిగ్బంధనం కార్యక్రమంలో బాలరాజు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో నీటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 60 ఏళ్లుగా హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. అయితే విభజన ద్వారా సీమాంధ్రులను హైదరాబాద్ నుంచి దూరం చేయాలని చూడటం బాధాకరమన్నారు. మహానేత వైఎస్సార్ పాలనలో ఎవరూ విభజన ఊసు ఎత్తలేదని, ఆయన మరణానంతరం రాష్ట్ర పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు, సీట్ల కోసం నాయకులు వేర్పాటు వాదాన్ని తెరపైకి తీసుకువచ్చి రాష్ట్రాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేశారన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి అవిరళ కృషి చేస్తున్నారన్నారు. చింతలపూడి సమన్వయకర్త కర్రా రాజారావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. ఉదయం 10 గంటల నుంచి జగదాంబ సెంటర్లో జాతీయ, రాష్ట్ర రహదారిపై అడ్డంగా టెంట్ వేసి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. జీలుగుమిల్లికి చెందిన కోలాట భజన బృందం సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహాన్ని నింపారు. పార్టీ మండల కన్వీనర్ బోధా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. నాయకులు కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, జీలుగుమిల్లి సర్పంచ్ ఎం.రామచంద్రరావు, సరిపల్లి సత్యనారాయణరాజు, ఎస్సీసెల్ నాయకుడు సిర్రి మోహన్, కక్కిరాల చంద్రరావు, కె.రాము, ఎం.వెంకన్నబాబు, గుడెల్లి సూర్యచంద్రం, షామిల్భాష, వల్లం వసంత్, మామిళ్ల కనకరాజు, పాముల ప్రసాద్, జంగారెడ్డిగూడెం నాయకులు కొయ్య లీలాధరరెడ్డి, లక్కవరం మైనార్టీ సెల్ మస్తాన్ వలీ, వీరాస్వామి పాల్గొన్నారు. ఆందోళనలో పాల్గొన్న బాలరాజును, వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఆసమయంలో కొద్దిసేపు తోపులాట జరిగింది.