సాక్షి, అమరావతి: సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు వంటి గుజ్జు కలప సాగుదారులకు మంచి రోజులొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ముందెన్నడూ లేనివిధంగా కంపెనీలు పోటీపడి నేరుగా రైతు క్షేత్రాల వద్దే గుజ్జు కలపను కొంటున్నాయి. రాష్ట్రంలో 1,04,985 మంది రైతులు 3,28,954 ఎకరాల్లో సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు తోటల్ని సాగు చేస్తున్నారు.
గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల టన్ను రూ.1,600 నుంచి రూ.1,800 వరకు మాత్రమే పలికేది. ఫలితంగా వాటిని పండించే రైతులకు కనీస ఖర్చులు కూడా వచ్చేవి కాదు. ఈ నేపథ్యంలో గుజ్జు కలపకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్ల క్రితం మంత్రుల కమిటీని నియమించింది.
ఈ కమిటీ కృషితో 2019–20లో 4.35 లక్షల మెట్రిక్ టన్నులు, 2020–21లో 1.38 లక్షల టన్నులు, 2021–22లో 5.60 లక్షల టన్నుల చొప్పున గిట్టుబాటు ధరలకే గుజ్జు కలపను కంపెనీలు కొనుగోలు చేశాయి.
ఫలించిన ప్రభుత్వ కృషి
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిæ కాగితం తయారీ కంపెనీలు, రైతులతో పలు దఫాలుగా జరిపిన చర్చలు ఫలించాయి. గత ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా ధరలు నిర్ణయించడం, వాటి అమలు కోసం ఒత్తిడి చేయడంతో కంపెనీలు ఒక్కొక్కటిగా రాష్ట్రానికి దూరమయ్యాయి.
ఇప్పుడు కంపెనీలు, రైతుల సమన్వయంతో గిట్టుబాటు ధర నిర్ణయించడంతో పాటు కొనుగోలుకు సుహృద్భావ వాతావరణం కల్పించడంతో పొరుగు రాష్ట్రాల కంపెనీలు ఇక్కడి కలపను కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. కొత్త కంపెనీల రాకతో పోటీపెరిగి ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు రాజమండ్రి, భద్రాచలం, బళ్లార్‌పూర్ పేపర్ మిల్లులు మాత్రమే రాష్ట్రంలో గుజ్జు కలప కొనుగోలు చేసేవి.
ఇప్పుడు ఏపీతోపాటు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20కు పైగా కంపెనీలు మన రాష్ట్రంలోని గుజ్జు కలప కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి.
15 ఏళ్ల క్రితం కొనుగోళ్లు నిలిపివేసిన గ్రాషిం ఇండస్ట్రీస్, వెస్ట్ కోస్ట్(కర్ణాటక), జేకే సిర్పూర్ (తెలంగాణ), జేకేసీ (గుజరాత్), శేషసాయి (తమిళనాడు), ఓరియంట్ (మధ్యప్రదేశ్) పేపర్ మిల్లులతో పాటు తొలిసారి 10కి పైగా ప్‌లైవుడ్ కంపెనీలు సైతం గుజ్జు కలప కొంటున్నాయి.
నాణ్యత, ప్రాంతాలను బట్టి టన్ను సుబాబుల్ రూ.2,400 నుంచి రూ.3,200, యూకలిప్టస్ రూ.2,900 నుంచి రూ.3,500 వరకు చెల్లిస్తున్నారు. ఇక సరుగుడు కలపను రికార్డు స్థాయిలో రూ.6 వేల నుంచి రూ.6,500కు కొనుగోలు చేస్తున్నారు.
సీఎం కృషి వల్లే..
గత ప్రభుత్వ హయాంలో సుబాబుల్ రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోయారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం, కంపెనీలు, రైతులతో పలు దఫాలు చర్చలు జరపడంతో రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. రైతులకు మంచి ధర లభిస్తోంది. రానున్న ఆరు నెలల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి
Comments
Please login to add a commentAdd a comment