ఇకపై జిల్లాకు మరింత దగ్గరగా.. | Goutham Reddy Foundation Stone Industrial Park Nellore District | Sakshi
Sakshi News home page

'ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటా'

Published Sun, Sep 20 2020 3:29 PM | Last Updated on Sun, Sep 20 2020 4:57 PM

Goutham Reddy Foundation Stone Industrial Park Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి ఆలోచన పరిశ్రమల మంత్రి ఆచరణతో ఏపీలో పారిశ్రామిక విప్లవం ఊపందుకుంది. మంత్రి మేకపాటి ఇలాకాలో ఏపీ పారిశ్రామికాభివృద్ధికి తొలి అడుగు పడింది. సొంత నియోజకవర్గం ఆత్మకూరులో ఆదివారం రోజున పారిశ్రామికవాడకు శ్రీకారం చుట్టారు. మెట్ట ప్రాంత ప్రజల సాక్షిగా పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆత్మకూరు ప్రజలు, ముఖ్యమంత్రి నమ్మకం వల్లే మంత్రిగా అవకాశం దక్కింది. మెట్ట ప్రాంత ప్రజలు గర్వించేలా ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఏడాది పాలనలోనే ఢిల్లీలో ముఖ్యమంత్రికి కీర్తి ప్రతిష్టలు దక్కాయి. ఉద్యోగాల కోసం ఊరు వదిలే పరిస్థితి రానీయం. పారిశ్రామిక పార్క్ వల్ల భవిష్యత్‌లో 2,000 ఉద్యోగాలు దక్కనున్నాయి. ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు రూ.400కోట్లతో అత్యున్నత హంగులతో అభివృద్ధి చేస్తాం. పార్క్ శంకుస్థాపన ఏవిధంగా అయితే వేగంగా జరిగిందో అలాగే.. ఏడాదిన్నరలోగా ఎంఎస్ఎమ్ఈ పార్క్ పూర్తి చేస్తాం.

మొత్తం 173 ఎకరాలలో పార్కు నిర్మాణం చేస్తుండగా.. మొదటి దశలో 87 ఎకరాలలో అభివృద్ధి చేయనున్నాము. ప్లాస్టిక్ ఫర్నిచర్ తయారు చేసే పార్కుతోనే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. సకల వసతులతో , అన్ని వనరులు పుష్కలంగా ఉండేలా పార్కును తీర్చిదిద్దుతాము. కీలక శాఖలు, ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతల వల్ల ప్రత్యక్ష్యంగా మాత్రమే నియోజకవర్గానికి దూరం ఉన్నాను. నేనెక్కడున్నా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. (ఏపీలో సమగ్ర పరిశ్రమ సర్వే: గౌతమ్‌రెడ్డి)

ఎలాంటి సమస్య వచ్చినా పాలనపరంగా నిత్యం అందుబాటులో ఉంటాను. ఎంత కుదరకపోయినా ఎంజీఆర్ హెల్ప్ లైన్, వర్చువల్ మీటింగులతో మీ మధ్యే ఉన్నా. ఇకపై నియోజకవర్గం, జిల్లాకు మరింత దగ్గరగా ఉంటా' అని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్ఎస్ఈఎమ్ఈల నిర్మాణం ఎలా ఉండబోతుందో  మంత్రి మేకపాటి వీడియో ద్వారా ప్రజలకు చూపించారు. వీడియోలు, ఫోటోలకు పరిమితమయ్యే పారిశ్రామికాభివృద్ధి మా విధానం కాదు. చెప్పింది చెప్పినట్లు చేసి చూపే  నినాదం మా ప్రభుత్వానిది.  (2024 నాటికి మద్య రహిత రాష్ట్రంగా ఏపీ)

సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులతో మెట్ట ప్రాంతం పచ్చని మాగాణమవుతుంది. త్వరలోనే ఆ పనులు చేపట్టి పూర్తి చేస్తాం. పాదయాత్రలో చెప్పిన సోమశిల హామీని నెరవేరుస్తాం. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు 6 టీఎంసీల నీరు అందిస్తాం' అని మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా..  'వైఎస్సార్‌ ఆసరా' పథకం ద్వారా నియోజకవర్గ మహిళలకు రూ. 13.05 కోట్ల చెక్కును అందించారు.

ఉదయగిరిలో పార్క్‌ ఏర్పాటు చేయండి
యువత ఆశయాలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి, మంత్రి కృషి చేస్తున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఆయన విజ్ఞప్తి చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, ఆత్మకూరు ఆర్డీవో సువర్ణమ్మ, ఏపీఐఐసీ ఈడీ ప్రతాప్ రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కంచెర్ల శ్రీహరి నాయుడు, ఏఎంసీ ఛైర్మన్ అనసూయమ్మ, ఆత్మకూరు నియోజకవర్గంలోని మండలాల కన్వీనర్లు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement