సాక్షి, అమరావతి: కళ్లెదుట వాస్తవాలు కన్పిస్తున్నా వాటికి ముసుగేసి తలతోక లేని రాతలు రాస్తూ.. నోటికొచ్చి న విమర్శలు చేసే వారిని ఏమనాలి.. రామోజీరావు అనాలి. ఎందుకంటే.. అన్నదాతలను అయోమయానికి గురిచేయడం.. సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా రోజుకో కథనాన్ని వండి వార్చడం ఆయన లక్ష్యం.
టీడీపీ ప్రభుత్వ హయాంలో టమాటా రైతు కోసం చంద్రబాబు ఏనాడు పట్టించుకోకపోయినా పల్లెత్తు మాట అనని రామోజీ.. ఈ నాలుగేళ్లలో టమాటా రైతులకు అన్ని విధాలుగా బాసటగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. టమాటా, ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు విషయంలో ‘మాటలు సరే.. చేతలేవీ జగన్ సారూ? అంటూ గురువారం ఈనాడులో అచ్చోసిన కథనంలో వాస్తవాలివిగో..
ఈనాడు ఆరోపణ: ఉల్లి, టమాటా రైతులకు బాసట ఏది?
వాస్తవం: రాష్ట్రంలో 1.50 లక్షల ఎకరాల్లో టమాటా, లక్ష ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 62,500 ఎకరాల్లో ఉల్లి.. 11,250 ఎకరాల్లో టమాటా సాగవుతోంది. ఉల్లి, టమాటా రైతులను గతంలో ఏ ప్రభుత్వమూ ఆదుకోని రీతిలో ఈ ప్రభుత్వం ఆదుకుంటోంది.
ధరలు పడిపోయినప్పుడు ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయడమే కాక.. కంపెనీలతో సరైన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇలా.. నాలుగేళ్లలో రూ.10.26 కోట్ల విలువైన 3,193.53 టన్నులను ధరల స్థిరీకరణ కింద సేకరించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. కానీ, ఈ విషయాన్ని చెప్పేందుకు ఈనాడుకు మనసు రాలేదు.
ఈనాడు ఆరోపణ: ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కడ?
వాస్తవం: రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వయం ఉపాధి కలి్పంచేలా సోలార్ డ్రయ్యర్‌తో కూడిన డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారు. తొలుత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ)ల వద్ద రెండు యూనిట్లను మే 2022నæ ఏర్పాటుచేశారు. ఆ తర్వాత.. పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా తడకనాపల్లిలో గత ఏడాది ఆగస్టులో 10 యూనిట్లు ఏర్పాటుచేశారు. మహిళల ఆసక్తి మేరకు 35 శాతం సబ్సిడీపై మరో 40 యూనిట్లు ఇచ్చారు.
రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటివరకు 1,200 టన్నుల టమాటా, ఉల్లిని ప్రాసెస్ చేశారు. వీటికి కొనసాగింపుగా 2023 జూలైలో మరో వంద యూనిట్లను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రతీరోజూ ఒక్కో యూనిట్ ద్వారా 200 కేజీల టమాటా, ఉల్లి ఫ్లేక్స్‌ను తయారుచేయడం ద్వారా ప్రతీ ఒక్కరూ నెలకు రూ.10వేల నుంచి రూ.12 వేలు వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ నిజాల్ని దాచేస్తే ఎలా రామోజీ?
ఈనాడు ఆరోపణ: ప్రాసెసింగ్ విస్తరణ చర్యలేవి?
వాస్తవం: పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్లతో 5 వేల యూనిట్ల ఏర్పాటుకోసం ఇటీవలే బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవగాహనా ఒప్పందం చేసుకుంది. వీటిలో 3,500 యూనిట్లను రాయలసీమ జిల్లాల్లోనే ఏర్పాటుచేస్తున్నారు. ప్రతి 100 సోలార్ యూనిట్లను ఒక క్లసర్ కిందకు తీసుకొస్తున్నారు.
రైతుల నుంచి ప్రతిరోజూ 20 టన్నులు టమాటా, ఉల్లిని సేకరించి తద్వారా రెండు టన్నుల ఫ్లేక్స్ తయారుచేసేలా ఈ క్లస్టర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఇప్పటికే 900 మంది లబ్దిదారులను గుర్తించింది. సెప్టెంబరు నాటికి 500 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుంది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతాల్లో లబ్దిదారులను గుర్తిస్తున్నారు.
ఈనాడు ఆరోపణ: సెకండరీ ప్రాసెసింగ్‌యూనిట్ల పరిస్థితి?
వాస్తవం: ఆపరేషన్ గ్రీన్స్ పథకం కింద రూ.110 కోట్లతో 100 శాతం సబ్సిడీపై ఎఫ్‌పీఓల కోసం 20 ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు (పీపీసీ) 20 పాలీహౌస్‌లు, షేడ్‌నెట్లను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే ఒక్కోటి రూ.3 కోట్ల వ్యయంతో.. 1.5 టన్నుల సామర్థ్యంతో రాయలసీమ జిల్లాల్లో గంగవరం, సోమాల, బైరెడ్డిపల్లి (చిత్తూరు), బి.కొత్తకోట (అన్నమయ్య)లో ఏర్పాటుచేసిన నాలుగు పీపీసీ సెంటర్లను జూలై 25న సీఎం జగన్ ప్రారంభించారు.
వీటి వద్ద 1.5 టన్నులను సార్టింగ్, వాషింగ్, గ్రేడింగ్ వంటి వసతుల కల్పనతో పాటు 250 టన్నుల సామర్థ్యంతో కూడిన కోల్డ్ స్టోరేజీలనూ ఏర్పాటుచేశారు. మరో రెండు ప్రాసెసింగ్, ఒక పాలీహౌస్, షేడ్‌నెట్ నిర్మాణంలో ఉన్నాయి. కర్నూలు జిల్లా గూడూరు వద్ద ఉల్లి–టమాటాలను పౌడర్‌గా మార్చే సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేస్తున్నారు. వచ్చే అక్టోబరు నాటికి ఈ ప్లాంటును ఏర్పాటుచేసి ఎఫ్‌పీఓకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈనాడు ఆరోపణ: సీఎం హామీ ఏమైంది?
వాస్తవం: సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు పత్తికొండలో 3.5 ఎకరాల్లో ఏడాదికి 12వేల టన్నుల సామర్థ్యంతో రూ.10 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు సెపె్టంబర్ రెండో వారంలో భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ యూనిట్‌లో స్టోరేజీ, సార్టింగ్, గ్రేడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్పింగ్ లైన్, డీ హైడ్రేషన్ లైన్ ఉంటాయి. కెచప్, జామ్, గ్రేవీ లాంటి అదనపు విలువతో కూడిన ఉత్పత్తులు తయారవుతాయి.
పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో రాజంపేటలో రూ.294.92 కోట్లతో, నంద్యాలలో రూ.165.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గుజ్జు, ఐక్యూఎఫ్ (టమాటా) పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నారు. ఏటా 2.85 లక్షల టన్నులు ప్రాసెస్ చేసే సామర్థ్యంతో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. రూ.8.03 లక్షల విలువైన ఉల్లి డీ–టాపింగ్ మిషన్లు, 20 వేల విలువైన సీడ్ డిబ్లర్స్‌ను 50 శాతం సబ్సిడీపై ఉల్లి రైతులకు అందిస్తున్నారు.
ఉల్లిని కనీసం 3–4 నెలలపాటు నిల్వచేసుకునేందుకు వీలుగా 25 టన్నుల సామర్థ్యంతో రూ.1.75 లక్షల అంచనాతో మల్టీ యుటిలిటీ నిల్వ కేంద్రాలూ నిర్మిస్తున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 600కు పైగా ఈ నిల్వ కేంద్రాలు నిర్మిచారు. ఉల్లి ఎఫ్‌పీఓలకు రూ.6.10 లక్షల విలువైన 15 సోలార్ పాలీ డ్రయ్యర్లను 75 శాతం సబ్సిడీపై సమకూరుస్తున్నారు.
ఈనాడు ఆరోపణ: టమాటా, ఉల్లి రైతులకు చేయూత ఏదీ?
వాస్తవం: టమాటా, ఉల్లి రైతులకు ఓ వైపు శిక్షణనిస్తూనే మరోవైపు సబ్సిడీపై సూక్ష్మ సేద్యం పరికరాలు అందజేశారు. నాలుగేళ్లలో 30,838 మంది టమాటా రైతులకు 76,383 ఎకరాల్లో రూ.130 కోట్ల విలువైన తుంపర పరికరాలు అందించారు. అకాల వర్షాలవల్ల పంట దెబ్బతిన్న 1,577 మంది టమాటా రైతులకు రూ.102.76 లక్షల ఇన్‌పుట్ సబ్సిడీని అందించారు. అలాగే, పంటల బీమా కింద ఉల్లి రైతులకు రూ.86 కోట్లు, టమాటా రైతులకు రూ.4.20కోట్లు ఇచ్చారు.
కానీ, బాబు హయాంలో ఏనాడు ౖపైసా పరిహారం విదిల్చిన పాపాన పోలేదు. ఇలా ఉల్లి, టమాటా రైతులకు మేలు చేసేలా ఈ ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈనాడు పత్రికకు అవేమీ కనిపించడంలేదు. ఎందుకంటే దాని యజమాని ఉద్దేశం, లక్ష్యం కేవలం ప్రభుత్వం మీద అక్కసు వెళ్లగక్కడమే.
Comments
Please login to add a commentAdd a comment