Andhra Pradesh Government Support Is Invaluable Says Investors - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ప్రభుత్వ మద్దతు అమోఘం

Published Mon, Mar 6 2023 3:40 AM | Last Updated on Mon, Mar 6 2023 11:45 AM

Government support is invaluable says investors - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు తమ భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించడం ద్వారా రాష్ట్ర ఫ్రభుత్వంపై తమకున్న విశ్వాసాన్ని గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు వేదికగా ప్రపంచానికి చాటిచెప్పారు. విశాఖలో జరిగిన రెండ్రోజుల జీఐఎస్‌ సదస్సులో కొత్త పరిశ్రమలు, పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకోవడమే కాకుండా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న వివిధ సంస్థలు తమ భారీ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించాయి.

రిలయన్స్‌ గ్రూపు దగ్గర నుంచి కొత్త తరం నోవా ఎయిర్‌ సంస్థ వరకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందిస్తున్న తీరును సభా వేదికగా కీర్తించాయి. అంతేకాక.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రండి అంటూ ఇతర పారిశ్రామికవేత్తలను ఆయా సంస్థల అధిపతులు ఆహ్వా నించడం విశేషం.

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఆయిల్‌ అండ్‌ గ్యాస్, టెలికాం, రిటైల్‌ వంటి వ్యాపారాల్లో ఇప్పటికే రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని.. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో మరో రూ.50,000 కోట్లతో 10 గిగావాట్ల రెన్యువబుల్‌ సోలార్‌ ఎనర్జీ పార్కును ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు.   

అదానీ మరో రూ.43,664 కోట్లు 
అలాగే.. అదానీ గ్రూపు పోర్టులు, సిమెంట్‌ వంటి రంగాల్లో రాష్ట్రంలో సుమారు రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టగా భవిష్యత్తులో ఆయా రంగాల్లో సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు ఏపీ సెజ్‌ సీఈఓ కరణ్‌ అదానీ ప్రకటించారు. రాష్ట్రంలో డేటా సెంటర్, గ్రీన్‌ ఎనర్జీతో పాటు వివిధ రంగాల్లో రూ.43,664 కోట్ల పెట్టుబడులను పెట్టే విధంగా అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇక లాక్‌డౌన్‌ కాలంలో తక్కువ సమయంలో యూనిట్‌ను ప్రారంభించామని, దీనికి రాష్ట్ర మద్దతే కారణమని నోవా ఎయిర్‌ సీఈఓ, ఎండీ గజానన్‌ నంబియార్‌ స్పష్టంచేశారు. సాధారణంగా ఆక్సిజన్‌ వంటి పారిశ్రామిక వాయువుల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయడానికి కనీసం 18 నుంచి 24 నెలల సమయం పడుతుందని, కానీ కేవలం 14 నెలల కాలంలోనే యూనిట్‌ను ప్రారంభించి వేలాది మంది జీవితాలను కాపాడినట్లు ఆయన తెలిపారు.   

జేఎస్‌డబ్ల్యూ రూ.50,632 కోట్లు 
జిందాల్‌ స్టీల్‌ పవర్‌ చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఏపీ పారిశ్రామిక రాష్ట్రంగా ఎదగనుందన్నారు. అందుకే తన సోదరుడికి చెందిన జేఎస్‌డబ్ల్యూ రూ.50,632 కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇక, ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్‌ బల్క్‌ డ్రగ్‌ పార్కును దక్కించుకుంది. దీనితో రాష్ట్రంలో ఫార్మా రంగం మరింతగా విస్తరించనుంది.

సాధారణంగా ఫార్మా పరిశ్రమ స్థాపనకు మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని, కానీ అన్ని అనుమతులున్న బల్క్‌ డ్రగ్‌ పార్కులో తక్షణం కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం కలుగుతుందని దివీస్‌ ఫార్మా వైస్‌ ప్రెసిడెంట్‌ మధుబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా రంగానికి ఇస్తున్న మద్దతుతో తాము మరింతగా కార్యకలాపాలు విస్తరించడానికి రూ.వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు దివీస్, లారస్, హెటిరో, అపోలో తదితర సంస్థలు ప్రకటించాయి.

రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్న సంస్థలు ఇలా భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ తెలుగుదేశంతో పాటు దాని అనుబంధ పత్రికల దుష్ప్రచారానికి తెరపడుతుందని భావిస్తున్నట్లు పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement