సాక్షి, అమరావతి: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కోవిడ్ ప్రొటోకాల్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి నిమిత్తం ప్రభుత్వం, అభ్యర్థి టీవీ అన్నపూర్ణ శేషుకుమారి దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
మధ్యంతర ఉత్తర్వుల రద్దు
ఏలూరు నగరపాలక సంస్థ ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఈ ఏడాది మార్చి 8న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల్లో పోటీ చేసిన టీవీ అన్నపూర్ణ శేషుకుమారి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చి.. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ అప్పీళ్లపై తుది విచారణ జరిపిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఎన్నికలపై స్టే విధించారని, ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు అధికరణ 226 కింద ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సబబేనా? అంటూ ధర్మాసనం తనకు తాను ప్రశ్న వేసుకుంది. ఇటీవల రత్నప్రభ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో ఇదే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. ఎన్నిక ప్రక్రియ మొదలైన తరువాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ధర్మాసనం చెప్పిన విషయాన్ని సీజే ధర్మాసనం గుర్తు చేసింది. ఆ తీర్పుతో పాటు పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ఆధారంగా చేసుకుంటూ.. ప్రభుత్వంతో పాటు అన్నపూర్ణ దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తూ పైవిధంగా తీర్పునిచ్చింది.
'ఏలూరు' ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్
Published Sat, May 8 2021 3:56 AM | Last Updated on Sat, May 8 2021 8:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment