ఆ చిట్టి బుర్రలు సృజనకు స్మార్ట్‌గా పదునుపెట్టాయి. అద్భుత ఆవిష్కరణలకు రూపమిచ్చాయి. అందరిచేత ఔరా అనిపించాయి. నిపుణులనూ అబ్బురపరిచి జాతీయస్థాయిలో సత్తాచాటాయి. గుంటూరు జిల్లా కీర్తి పతాకను రెపరెపలాడించాయి.
రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ మనక్ ప్రదర్శనలో జిల్లా విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వినూత్న ఆవిష్కరణలతో అందరినీ ఆకట్టుకున్నారు. గత నెల 31, ఈనెల ఒకటో తేదీన విజయవాడలోని లయోలా కళాశాలలో ఇన్‌స్పైర్ మనక్ రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఆన్‌లైన్ మూల్యాంకనంలో భాగంగా 13 జిల్లాల నుంచి వచ్చిన 331 మంది విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శించారు.
వీటికి ముగ్దులైన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు జాతీయస్థాయికి 34 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వీటిలో గుంటూరు జిల్లా నుంచి మూడు నమూనాలు ఉన్నాయి. ఎంపికైన మూడు ప్రాజెక్టులూ ఒకే పాఠశాలకు చెందిన విద్యార్ధినులు రూపొందించినవి కావడం విశేషం. మంగళగిరిలోని సీకే జూనియర్ కాలేజ్ హైస్కూల్‌కు చెందిన జయశ్రీ, తేజశ్రీ, వర్గీస్ రూపొందించిన మూడు ప్రాజెక్టులు న్యాయ నిర్ణేతలను అమితంగా ఆకట్టుకున్నాయి. గైడ్ టీచర్ బండారు టైటస్ పర్యవేక్షణలో వీరు ప్రాజెక్టులను రూపొందించారు. వీరు త్వరలో జాతీయస్థాయిలో జరిగే ప్రదర్శనకు హాజరు కానున్నారు.
– గుంటూరు ఎడ్యుకేషన్
ప్రతిభే ‘బ్యాగ్’బోన్
ప్రాజెక్టు పేరు: స్మార్ట్ స్కూల్‌బ్యాగ్
విద్యార్థిని పేరు: బిట్రా జయశ్రీ, 8వ తరగతి
స్మార్ట్ స్కూల్ బ్యాగ్‌ను అత్యద్భుతంగా రూపొందించి ఔరా అనిపించింది. బిట్రా జయశ్రీ. ఈ బ్యాగ్ ద్వారా ఎంత బరువు పుస్తకాలను మోస్తున్నదీ తెలుసుకోవచ్చు. ఎక్కువ పుస్తకాలను మోయడం కష్టమనిపిస్తే దీనిని ట్రాలీగా మార్చుకోవచ్చు. బ్యాగ్‌లోనే మాస్క్, శానిటైజర్ ఉంచుకోవచ్చు. వర్షం వస్తే ఆటోమేటిక్‌గా గొడుగు తెరుచుకునేలా సెన్సార్ల అమరిక ఉంది. దీనివల్ల విద్యార్థి పొరపాటుగా తప్పిపోయినా, దుండగులు అపహరించుకుని వెళ్లినా జీపీఎస్ ద్వారా పోలీసులకు సమాచారం వెళ్తుంది. బ్యాగులో ఉన్న పుస్తకాలను దొంగిలించే యత్నం చేసినా వెంటనే పసిగట్టే వీలుంది.
ఔరా సౌర ఊయల
ప్రాజెక్టు పేరు: సోలార్ స్మార్ట్ ఊయల
విద్యార్థిని పేరు: బేగ్ వర్గీస్, 8వ తరగతి
చంటిపిల్లల కోసం చక్కటి ఊయలను తీర్చిదిద్దింది బేగ్ వర్గీస్. ఇది సౌర శక్తితో పనిచేస్తుంది. ఊయలకు మోటర్‌ను అమర్చడం ద్వారా సోలార్ మాడ్యూల్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌శక్తి ద్వారా ఇది ఊగుతుంటుంది. ఊయలకు ఫ్యాన్‌నూ అమర్చుకోవచ్చు. పిల్లలను ఆస్పత్రుల్లో ఉంచినప్పుడు సెలైన్ అయిపోయినా, ఎవరైనా అపరిచిత వ్యక్తులు పిల్లలను ఎత్తుకువెళ్లే యత్నం చేసినా సైరన్ మోగుతుంది.
భళా సైకిల్
ప్రాజెక్టు పేరు: స్మార్ట్ ఫోల్డబుల్ ఈ–సైకిల్
విద్యార్థిని పేరు: మాచర్ల తేజశ్రీ, 9వ తరగతి
సౌరశక్తితో పని చేసే స్మార్ట్ ఫోల్డబుల్ ఈ–సైకిల్‌ను ఆవిష్కరించి భళా అనిపించింది. మాచర్ల తేజశ్రీ. దీనిని పాఠశాలకు వెళ్లేందుకు, ఇతర పనులకు ఉపయోగించవచ్చు. ఫోల్డ్ చేసి ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. వ్యక్తిగత అవసరాలతోపాటు వ్యవసాయ పనుల్లో భాగంగా పంటకు నీరు పెట్టడం, విత్తనాలు నాటేందుకు ఉపయోగించొచ్చు. రైతులు, మహిళలు, వికలాంగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment