వివాహ, శుభకార్యాల్లో ఈ చీరలు ప్రత్యేకం
దేశ, విదేశాల్లో వీటికి విశేష ఆదరణ
చేనేత వ్రస్తాల్లో ఈ చీరకు 300 ఏళ్ల చరిత్ర బంగ్లాదేశ్‌కు చెందిన అపూరూప కళ
పురాతన సాంస్కృతిక సంపదగా గుర్తించిన యునెస్కో
5 దశాబ్ధాల క్రితమే రాష్ట్రపతి అవార్డు సొంతం చేసుకున్న కోక
అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ చీరల తయారీ
ఒక్కో చీర ఖరీదు రూ.5 నుంచి రూ.80 వేలు
ఒక చీర తయారీకి కనీసం 15 రోజుల సమయం
చేయి తిరిగిన చేనేత కార్మికులు వారు.. వస్త్ర రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. వారు తయారు చేసే వ్రస్తాలు చిరకాలం గుర్తుండిపోతాయి. వివాహ, శుభకార్యాల్లో జమదానీ చీరను ధరించడానికి మగువలు విశేష ఆదరణ కనబరుస్తారు. చేనేత వ్రస్తాల తయారీలో జమదానీ చీరలకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ అపురూప కళ ఈనాటిది కాదు..శతాబ్దాల నాటి చరిత్ర ఉంది.
మొఘలు సామ్రాజ్య రాణులు, బ్రిటీష్ పాలకుల సతీమణిలు ధరించిన చీర ఇది. 5 దశబ్దాల క్రితమే రాష్ట్రపతి అవార్డు సొంతం చేసుకున్న చరిత్ర ఈ చీరకు ఉంది. ఈ చీరను పురాతన సాంస్కృతి సంపదగా యునెస్కో కూడా గుర్తించింది. దేశ, విదేశాల్లో కూడా జమదానీకి ఎంతో ప్రత్యేకత ఉంది. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో వందలాది మంది నేతన్నలు ఈ చీరలను తయారీ చేస్తున్నారు.
ఈ జమదానీ చీరల తయారీలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట చేనేత కార్మికులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రత్యేకమైన ఆకర్షణలు, డిజైన్లతో మగువల మనసు దోచే జమదానీ చీరలు తయారు చేస్తుంటారు. కొత్త అందాలను తెచ్చే ఈ చీరలు వివాహాది శుభకార్యాల్లో తలుక్కుమంటుంటాయి. మన నేత కార్మికుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో పిఠాపురం, ఉప్పాడ, తూర్పుగోదావరి జిల్లాలో దొండపూడి వంటి ప్రాంతాల్లో కూడా జమదానీ చీరలు తయారు చేస్తున్నారు. – సాక్షి, అనకాపల్లి
పేటకు పట్టం కట్టిన కోక..
అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేటతో పాటు, కాకినాడ జిల్లా పిఠాపురం, ఉప్పాడ తదితర ప్రాంతాల్లో తయారయ్యే ఈ జమదానీ చీరలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. జమదానీ చీరల డిజైన్లతో కేంద్రం కూడా విడుదల చేసిందంటే ఈ చీరలకు ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట,నక్కపల్లి మండలంలో గోడిచర్లతో పాటు జిల్లావ్యాప్తంగా 1500 మంది వరకూ ఈ చేనేత కార్మికులు ఉన్నారు.
కాకినాడ జిల్లాలో పిఠాపురం, ఉప్పాడలో 100 కుటుంబాలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ద్వారపూడి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 300 కుటుంబాలు నేతన్నలు ఆర్డర్లు వారీగా ఈ చీరలు నేస్తుంటారు. స్థానికంగా విక్రయించేందుకు నేత చీరలు, పంచెలు, తువాళ్లు, తక్కువ ధరలకు విక్రయించే చీరలు తయారు వేస్తూ చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయిస్తుంటారు. పాయకరావుపేట, తుని పట్టణాల్లో ఉన్న వస్త్ర దుకాణాలకు తాము తయారు చేసిన వస్త్రాలను సరఫరా చేస్తుంటారు.
బెంగుళూర్‌లో నూలు కొనుగోలు..
జమదానీ చీరలు తయారు చేయడానికి ముడిసరుకు (నూలు) బెంగళూరు నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడంతో కొంతమంది మాత్రమే ఈ చీరలను తయారు చేస్తున్నారు. పాయకరావుపేటకి చెందిన వ్యాపారి ముడిసరుకు కొనుగోలు చేసి తీసుకువచ్చి తనకు వచ్చిన ఆర్డర్ల మేరకు కొనుగోలుదారులు కోరిన, సూచించిన డిజైన్లు, మోడళ్లు ఆధారంగా ఇక్కడి కార్మికులతో జమదాని చీరలను తయారుచేయిస్తారు...
ఒక్కో చీరకు ముగ్గురు కార్మికులు
సాధారణంగా జమదానీ చీర తయారీలో ఒక్కో చీరను ముగ్గురు కార్మికుల అవసరం ఉంటుంది. చీర డిజైన్‌ను బట్టి తయారీకి అదనపు సమయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక చీర తయారీకి 15 రోజుల సమయం పడుతుంది. అదనపు డిజైన్లు కూడా యాడ్ చేయాలంటే మరో మూడు నాలుగు రోజులు అదనంగా పడుతుంది. ఉదాహరణకు పాయకరావుపేటలో ఉండే 500కు పైగా నేతన్నలు జమదానీ చీరలు నేస్తారు.
ముడిసరుకు కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో ఇక్కడి కార్మికులు కేవలం మజూరీ కోసమే పనిచేయాల్సి వస్తుంది. బెంగళూరు వెళ్లి ముడిసరుకు కొనుగోలు చేయడం, మార్కెటింగ్ చేయడం చాలా కష్టతరం కావడంతో కాంట్రాక్టరు ఇచి్చన మజూరీ తీసుకుని తమ వస్త్ర నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. జాందాని చీరల తయారీలో పట్టును ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఈ రకం చీరల తయారీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా లూజు అనేది రాకూడదు. అడ్డు నిలువు పట్టును ఉపయోగించాలి. దీంతో ఒక్కో చీర తయారీలో ముగ్గురు కార్మికుల అవసరం కూడా
ఉంటుందని నేత కార్మికులు అంటున్నారు.
ఆరు మెట్రోపాలిటన్ సిటీల నుంచి ఆర్డర్లు..
ఇక్కడ తయారు చేయించిన జమదానీ చీరలను హైదరాబాద్, బెంగళూరు. చెన్నై, విశాఖపట్నం, ముంబై, కోల్‌కత వంటి మహానగరాల్లో ఉన్న పెద్ద వస్త్ర దుకాణాలకు విక్రయిస్తుంటారు. ముందుగానే ఆర్డర్లు ఇచ్చి జమదానీ చీరలు తయారు చేయస్తుంటారు. ఒక జమదానీ చీర తయారీకి డిజైన్ బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల విలువ గల నూలు అవసరమవుతుంది.
ఇద్దరు నేత కార్మికులు 15 రోజుల పాటు కప్పపడితే ఒక జమదాని చీర తయారవుతుంది. ఇలా నెలకు రెండు నుంచి మూడు చీరలు తయారు చేస్తారు. ఇక్కడ తయారయ్యే జమదానీ చీరల ఖరీదు కనిష్టంగా రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉంటుంది. ఇంటి వద్దే ఉంటూ నెలకు రెండు చీరలు తయారు చేస్తే మజారి కింద రూ.10 వేలు చెల్లిస్తారు.
జమదానీ చీరలు తయారు చేయించి విక్రయించే వ్యక్తికి నూలు, మజారి ఖర్చు పోను చీర దగ్గర రూ.3 నుంచి రూ.5 వేలు మిగులుతుంది. ఇతని దగ్గర రూ.10వేలు పెట్టి కొనుగోలు చేసిన చీరను పెద్ద పెద్ద మాల్స్, షాపుల్లోను 504 శాతం లాభం వేసుకుని. రూ.15 వేలకు విక్రయిస్తుంటారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
గత ఐదేళ్లలో చేనేత రంగానికి స్వర్ణయుగం..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నేతన్నలకు పెట్టుబడి సాయం అందించారు. మగ్గం కలిగిన కుటుంబాలకు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాల్లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. దీంతో కార్మికులు నేరుగా ముడిసరకు తామే కొనుగోలు చేసుకుని వ్రస్తాలు తయారు చేసి లాభాలు పొందేవారు. పెట్టుబడికి అప్పు చేసే పరిస్థితి లేక పోవడంతో గత ఐదేళ్లు చేనేత రంగానికి స్వర్ణయుగంగానే గడిచినా..ఇప్పుడు గడ్డుకాలమే.
వివాహ, శుభకార్యాల్లో జమదానీ కోక..
వివాహ, శుభకార్యాలకు ప్రత్యేకంగా ఆర్డర్లు పెట్టుకుంటారు. ఆర్డర్లు ఆధారంగా జమదానీ చీరలు తయారు చేస్తాం. పాయకరావుపేటలో చేయి తిరిగిన నేత కార్మికులు ఉన్నారు.పలు డిజైన్లతో పట్టు. జమదానీ చీరలు తయారీ చేయడంలో వీరు దిట్ట.
ముడి సరుకు సొంతంగా కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో మజూరు కోసం వ్రస్తాలు తయారు చేస్తుంటారు. మార్కెటింగ్ సదుపాయం పెంచి..కాంట్రాక్టర్లు ఆర్డర్లు పెంచితే చీరలు తయారీ పెరుగుతుంది. హైదరాబాద్, బెంగుళూర్, ముంబై, కోల్‌కత, చైన్నై వంటి సిటీలకు ఎగుమతి చేస్తుంటాం. – వీరనాగేశ్వరరావు, చేనేత సొసైటీ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment