సాక్షి, అమరావతి: సముద్ర వాణిజ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. దేశీయ వాణిజ్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతోంది. ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో క్షీణత నమోదవుతున్నా, మన రాష్ట్రంలో మాత్రం వృద్ధి నమోదైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ – జూన్ మధ్య దేశవ్యాప్తంగా ఎగుమతులు 8.48 శాతం క్షీణించగా, అదే సమయంలో మన రాష్ట్ర ఎగుమతుల్లో 6.20 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2022 – 23) తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా రూ. 9,34,041.13 కోట్ల విలువైన ఎగుమతులు జరగ్గా ఈ ఏడాది అదే కాలంలో రూ.8,54,792.12 కోట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో మన రాష్ట్రం నుంచి ఎగుమతులు రూ.40,760.22 కోట్ల నుంచి రూ.43,289.32 కోట్లకు పెరిగాయి.
తొలి త్రైమాసికంలో మొత్తం దేశ ఎగుమతుల్లో 5.06 శాతం వాటాతో మన రాష్ట్రం అయిదో స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆరో స్థానంలో ఉండగా ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో ఒక ర్యాంకును మెరుగుపరుచుకుంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రాష్ట్ర ఎగుమతులు 10.79 శాతం వృద్ధితో రూ.1,59,368.02 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
రాష్ట్రం నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఎగుమతుల ప్రోత్సాహానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. విదేశాల్లో డిమాండ్ ఉన్న మన రాష్ట్ర ఉత్పత్తులను గుర్తించి, అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకుంటోంది. రవాణా, ఇతర మౌలిక సౌకర్యాలు మెరుగుపరుస్తోంది. ఎగుమతుల కోసం దేశంలో ఏక్కడా లేని విధంగా రూ.20,000 కోట్లతో నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తోంది.
ఇందులో రామాయపట్నం పోర్టు ఈ ఏడాది చివరికి, మిగిలిన మూడు పోర్టులు 2025 నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఎగుమతుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 సంవత్సరానికి నీతిఆయోగ్ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో రాష్ట్రం 59.27 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. రెండేళ్ల క్రితం 20వ స్థానంలో ఉండగా, గత ఏడాదికి 12 స్థానాలు మెరుగుపరుచుకొని 8వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment