సాక్షి, విజయవాడ: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్నందున ప్రకాశం బ్యారేజ్‌కు సుమారు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరనుందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వరద ఉధృతిపై అధికారులను మరింత అప్రమత్తం చేశామన్నారు. ఇవాళ ఉదయం పులిచింతల ప్రాజెక్ట్ వద్ద ఉన్న 7.50 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు 8 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నట్లు చెప్పారు. దీంతో నది పరివాహక ప్రజలు నివాస ప్రాంతాలు ఖాళీ చేసిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజ్ ఇన్‌ఫ్లో 6,36,921 అవుట్ ఫ్లో 6,32,961 క్యూసెక్కులుగా ఉందని ఆయన తెలిపారు.
దీంతో బ్యారెజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యలో వరద ముంపు ప్రాంతాలైన జగ్గయ్యపేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహిసీల్ధార్‌లను అప్రమత్తం చేశామన్నారు. చిన లంక, పెద్ద లంక ప్రాంతాల్లో పట్టిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించినట్లు చెప్పారు. అదే విధంగా కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదని కలెక్టర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment