సాక్షి, విజయవాడ: మహారాష్ట్రలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం మొదలగు రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. నాగార్జున సాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టుకు కూడా వరద వచ్చి చేరుతుంది. ఎడమ కాలువకు నీటి విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండటంతో గత ఏడాది ఆగస్టు 12న క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది కూడా ఇదే వరద కొనసాగితే డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ బహుళార్ధక సాధక ప్రాజెక్టు కింద కుడి ఎడమ కాలువలకు మొత్తం ఆయకట్టు 22 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. నాగార్జునసాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 560 అడుగులకు చేరింది. ఇదే వరద మరో 20 రోజులు కొనసాగితే పూర్తిస్థాయికి చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment