
సాక్షి, తిరుపతి: నివర్ తుపాను చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ‘నివర్’ తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో ఘాట్ రోడ్ హరిణి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది జేసీబీ సాయంతో కొండచరియలను తొలగిస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్సానికి శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరాయి. దీంతో సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపుతున్నారు. బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రహారీ గోడ కూలగా, బైక్‌లు ధ్వంసం అయ్యాయి.
నెల్లూరు:
జిల్లాలో ‘నివర్’ తుపాను కారణంగా నెల్లూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వాకాడు, కోట, మనుబోలు, ముత్తుకూరు, కావలిలో కుంభవృష్టి వర్షం పడుతోంది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.దీంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అదేవిధంగా ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని 1600 చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి.చెరువులకు గండ్లు పడకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. సోమశిల, కండలేరు నుంచి భారీగా సముద్రంలోకి నీటి విడుదల చేశారు. తీర, లోతట్టు ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు. నెల్లూరు జిల్లాల్లో 100 తుపాను సెంటర్లు ఏర్పాటు చేశారు. తుపాను సహాయక చర్యల్లో 5వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్ - 1077 ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ కడప: తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కడప జిల్లా కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్, కడప, రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాలతోపాటు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08562 - 245259
కడప సబ్ కలెక్టర్ ఆఫీస్: 08562- 295990, 93814 96364, 99899 72600
రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం: 08565- 240066, 93816 81866
జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం: 96766 08282, 08560-271088
చిత్తూరు:
తీవ్రమైన నివర్ తుపాన్ నేపథ్యంలో రేణిగుంటలో బాలాజీ కాలనీ నీటమునిగింది. తిరుపతిలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయి. దీంతో అరినియర్, మల్లెమడుగు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేత వేశారు. పలు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అధికారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.