సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలు చేసే పిటిషన్‌కు విచారణార్హత ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఇటీవల శిక్ష విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌కు నంబర్ కేటాయించాక శ్రీలక్ష్మికి విధించిన శిక్షను పునఃసమీక్షించాలా? లేదా? అనేదానిపై న్యాయమూర్తి వాదనలు వింటారు.
నేపథ్యమిదీ..
ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటివాటిని నిర్మించవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా పలుచోట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఇటీవల హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. వాదనల అనంతరం 8 మంది ఐఏఎస్ అధికారులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వారిని సామాజిక సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సామాజిక సేవ కింద నెలలో ఓ ఆదివారం చొప్పున 12 ఆదివారాలు వారికి నచ్చిన సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేయాలంటూ శిక్ష విధించింది.
శ్రీలక్ష్మి పిటిషన్‌కు విచారణార్హత ఉంది..
శ్రీలక్ష్మి పిటిషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ సందేహాలు లేవనెత్తింది. కోర్టు ధిక్కార కేసులో పిటిషన్‌కు ఆస్కారం ఉందా? అలాంటి పిటిషన్‌కు విచారణార్హత ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేసింది. ఈ అనుబంధ పిటిషన్‌కు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ అనుబంధ పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ముందు విచారణకొచ్చింది. న్యాయమూర్తి స్పందిస్తూ.. కోర్టు ధిక్కార కేసులో పునః సమీక్ష పిటిషన్ దాఖలు చేయొచ్చా? అలా దాఖలు చేసే పిటిషన్‌కు విచారణార్హత ఉంటుందా? అనేదానిపై ముందు వాదనలు వినిపించాలని శ్రీలక్ష్మి తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ఆదేశించారు.
ఇదే అంశంపై కోర్టుకు సహకరించాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్‌ను కోరారు. సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ధిక్కార కేసులో పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేసుకోవచ్చన్నారు. అలా దాఖలు చేసే పిటిషన్‌కు విచారణార్హత ఉందని తెలిపారు. ఈ మేరకు గతంలో ఏపీ, కేరళ హైకోర్టులు తీర్పులు ఇచ్చాయన్నారు. అనంతరం ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు తన స్వీయ ఉత్తర్వులను పునః సమీక్షించే విషయంలో ఎలాంటి నిషేధం లేదన్నారు. ఈ విషయంలో కోర్టుకు పూర్తి అధికారాలున్నాయన్నారు. కోర్టు ధిక్కార కేసులో ఇచ్చింది తీర్పే కాబట్టి, తీర్పును పునఃసమీక్షించాలంటూ పిటిషన్ దాఖలు చేయవచ్చన్నారు. అయితే కోర్టు ధిక్కారం ఎదుర్కొంటున్న అధికారులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment