సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే పాఠశాల విద్యను ప్రోత్సహించేందుకు జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, నాడు–నేడు, గోరుముద్ద వంటి పలు పథకాలను తీసుకొచ్చిందని హైకోర్టు తెలిపింది. ఈ పథకాలకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని చెప్పింది. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలను ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయడం ఏకపక్షం, వివక్షాపూరితం కాదని స్పష్టం చేసింది.
ఈ పురస్కారాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 82ను కొట్టేసేందుకు నిరాకరించింది. జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు ఇటీవల తీర్పు చెప్పారు. 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే పరిమితం చేస్తూ 2019లో జారీ చేసిన జీవో 82ను సవాలు చేస్తూ ఏపీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం, పలువురు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ గంగారావు విచారణ జరిపి, తీర్పు వెలువరించారు.
పేదల కోసం విధాన నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది
‘ప్రతిభా పురస్కారాల ప్రదానం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం విద్యలో నాణ్యతను ప్రోత్సహించడం, పేద, అణగారిన వర్గాల పిల్లల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును భరించడం. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే 2017–18 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే ఎక్కువ ప్రతిభా పురస్కారాలు దక్కాయి. ప్రతి ఏటా 50 శాతానికి పైగా అవార్డులు ప్రైవేటు పాఠశాలలే పొందుతున్నాయి.
2019లో ప్రభుత్వం జీవో 82 ద్వారా ఈ పురస్కారాల పథకం పేరును మార్చింది. డాక్టర్ అబ్దుల్ కలాం విద్యా పురస్కారాలుగా నామకరణం చేసింది. ఈ అవార్డులను కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే పరిమితం చేసింది. సమాజంలో పేద, అణగారిన వర్గాల పిల్లల అభ్యున్నతి కోసం విధాన నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.
ప్రభుత్వ పాఠశాలలకే ప్రతిభా పురస్కారాలను పరిమితం చేయాలన్నది అలా తీసుకున్న విధానపరమైన నిర్ణయం. అందులో జోక్యం చేసుకోలేం. తమకు కూడా ఆ అవార్డును వర్తింపజేయాలని కోరే హక్కు పిటిషనర్లకు లేదు. జీవో 82 పిటిషనర్ల హక్కులను ఏ రకంగానూ హరించడంలేదు. ప్రభుత్వ ఉత్తర్వులు ఏ రకంగానూ ఏకపక్షం కాదు. వివక్షాపూరితమూ కాదు. విద్యార్థుల తెలివితేటల ఆధారంగా సహేతుకమైక వర్గీకరణ ఎంత మాత్రం తప్పుకాదు’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment