జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి:హత్యలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు వంటి హేయమైన నేరాలకు పాల్పడిన వారిలో ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారు, వారిలో ఎంతమంది అనారోగ్య కారణాలతో జైలు నుంచి విడుదలయ్యారనే వివరాలను తమ ముందుంచాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.
శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తీవ్ర అస్వస్థతకు గురై, అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు వారిని బయట ఆస్పత్రులకు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు పంపే విషయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) రూపొందించాలని కూడా జైళ్ల శాఖను ఆదేశించింది. అఫిడవిట్ రూపంలో ఆ ఎస్‌వోపీని తమ ముందుంచాలని కోరింది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
మధ్యంతర బెయిల్ కోరిన కేసులో..
ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన శ్రీనివాస వర్మకి గుంటూరు పోక్సో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ 2022 డిసెంబర్ 19న తీర్పునిచ్చింది. దీంతో వర్మ రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. పోక్సో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వర్మ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తీవ్ర గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వర్మ అత్యవసర చికిత్స నిమిత్తం 6 నెలల పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ అప్పీల్‌తో పాటు అనుబంధ పిటిషన్‌పై జస్టిస్ నరేందర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అత్యవసర వైద్య చికిత్స అవసరమైనప్పుడు మంచి ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతుండటంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పిటిషనర్ వర్మకు అత్యవసర చికిత్స అవసరమైన నేపథ్యంలో అతన్ని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదే సమయంలో జైళ్ల శాఖ డీఐజీని కోర్టుకు పిలిచి ఖైదీల అత్యవసర చికిత్స విషయంలో జైళ్ల నిబంధనలు ఏం చెబుతున్నాయో ఆరా తీసింది. చికిత్స అవసరమైన ఖైదీలను ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు పంపుతున్నామని డీఐజీ వివరించారు. పిటిషనర్ వర్మను అలాగే నెట్‌వర్క్ ఆస్పత్రికి పంపి చికిత్స అందించామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జైళ్ల నిబంధనలను పరిశీలించింది.
ఖైదీలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు పంపి చికిత్స అందించవచ్చునని, అయితే మెడికల్ ఆఫీసర్ ఆ మేర సర్టిఫికెట్ ఇస్తే చాలని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొంది. అందువల్ల ఈ విషయంలో అన్ని జైళ్లకు వర్తించేలా ఓ ఎస్‌వోపీని రూపొందించాలని జైళ్ల శాఖను ఆదేశించింది. కోర్టుకొచ్చే పని లేకుండా జైలు అధికారులే చికిత్స నిమిత్తం సూపర్ స్పెషాలిటీ లేదా బయట ఆస్పత్రులకు పంపే దిశగా ఎస్‌వోపీ రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment