మోరంపూడి జంక్షన్‌లో మాస్క్ లేకుండా నగదు వసులు చేస్తున్న హిజ్రా
సాక్షి,రాజమహేంద్రరం రూరల్: నగరంలోని జంక్షన్లలో హిజ్రాలు హల్‌చల్ చేస్తున్నారు. కొందరు ఎటువంటి మాస్కు ధరించకుండా నగదు వసూలు చేయడంతో వాహన చోదకులు బెంబేలెత్తిపోతున్నారు. రెండు నెలలుగా మోరంపూడి జంక్షన్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. రాజమహేంద్రవరంలో అతిపెద్దది మోరంపూడి జంక్షన్. ఇక్కడ అధికంగా నగదు వస్తుందన్న అంచనాతో హిజ్రాలు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇందులో సగం మంది ఎటువంటి మాస్కులు ధరించకుండా నగదు వసూలు చేస్తున్నారు. సిగ్నల్ పడినప్పుడు ఎక్కువ వాహనాలు ఆగుతాయి. ఆ సమయంలో నాలుగు వైపుల నుంచి హిజ్రాలు వచ్చి వాహన చోదకులను నగదు డిమాండ్ చేస్తున్నారు.
కారులు, లారీలు, ఇతర వాహన చోదకుల నుంచి రూ.10 తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా వల్ల జాతరలు, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో జంక్షన్లలో నగదు వసూలు చేస్తున్నారన్న మానవతా దృక్పథంతో వాహన చోదకులు సైతం ఎంతో కొంత ఇస్తున్నారు. వీరితో పాటు భిక్షాటన చేసే చిన్నపిల్లలతో తల్లులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ వస్తువులు అమ్మకందారులతో జంక్షన్‌లో రద్దీగా ఉంటోంది.
అన్నీ జంక్షన్లలోనూ..
మోరంపూడి జంక్షన్‌తో పాటు నగరంలోని ఇతర ముఖ్యకూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద హిజ్రాల నగదు వసూలు కొనసాగుతూనే ఉంది. ఇటీవల తాడితోట జంక్షన్‌లో హిజ్రాలను చెదరగొట్టే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌పై తిరగబడ్డారు. జంక్షన్లలో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సిగ్నల్‌ను చూసుకోవాలో, హిజ్రాల నుంచి తప్పించుకోవాలో తెలియక కంగారు పడుతున్నారు. కుటుంబంతో కలిసి మోటారుసైకిల్‌పై వచ్చిన వారిని కూడా వదలడం లేదు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్య నుంచి రక్షించాలని వాహనచోదకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment