సాక్షి, అమరావతి: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు జిల్లాల్లో(విశాఖ, నంద్యాల, ఏలూరు, ఎన్టీఆర్) విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇదిలా ఉండగా.. కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లు ఎడతెగని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
10 జిల్లాలకు రెడ్.. 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
అల్పపీడనం ప్రభావం గురువారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నందున, అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాలతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం వరకు అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉన్నందున రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.
2వ తేదీ నాటికి మరో అల్పపీడనం
అల్పపీడనం కేంద్రీకృతమైన బంగాళాఖాతం నుంచి కోస్తా జిల్లాల వైపు నిరంతరాయంగా మేఘాలు వస్తూనే ఉండడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మీదుగా వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. కాగా, బంగాళాఖాతంలో వచ్చే నెల 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాత ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని ఏపీఎస్‌డీపీఎస్ అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన అమలు
Comments
Please login to add a commentAdd a comment