మూడేళ్ల వయసులో బాలుడి అదృశ్యం
పుట్టుమచ్చ ఆధారంగా 14 ఏళ్ల తర్వాత ఇంటికి..
రెండేళ్ల అనంతరం చవితి ఉత్సవాల్లో గుండెపోటు
19 ఏళ్ల యువకుడి మృతితో ఆ తల్లికి కడుపుకోత
బి.కొత్తకోట: మూడేళ్ల వయసులో అదృశ్యమైన బిడ్డ.. 14 ఏళ్ల తర్వాత తల్లిండ్రుల వద్దకు చేరాడు. బిడ్డను చూసుకుని మురిసిపోతున్న ఆ తల్లిదండ్రుల నుంచి రెండేళ్ల తరువాత శాశ్వతంగా దూరమయ్యాడు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన శంకర, రెడ్డెమ్మ దంపతులకు ఆకాశ్, అభిలాష్ ఇద్దరు కుమారులు. 2008లో పెద్దకొడుకు ఆకాశ్ మూడేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆచూకీ లభించలేదు. కాగా.. ఆకాశ్‌ను బెంగళూరులో ఉంటున్న రత్నమ్మ అనే మహిళ పెంచుకుంది. మూడేళ్లు పెంచుకున్నాక ఆమె మదనపల్లె మండలం కొత్తపల్లెలో ఉంటున్న ఆటో డ్రైవర్ నాగరాజు, లలితమ్మ దంపతుల వద్దకు ఆకాశ్‌ను పంపించింది. వాళ్లే ఆకాశ్‌ను పెంచుతూ వచ్చారు. ఆ తర్వాత నాగరాజు కుటుంబం నాయనబావికి మకాం మార్చింది.
ఆ బిడ్డ.. మీ బిడ్డే..
ఆకాశ్ తల్లి రెడ్డెమ్మ చెల్లెలు మంజు బెంగళూరులో ఉంటూ కూలి పనులకు వెళ్తోంది. ఓ రోజు ఆకాశ్‌ను మూడేళ్ల పాటు పెంచిన రత్నమ్మ, మంజు కూలీ పనుల్లో కలుసుకున్నారు. మూడేళ్ల వయసులో అదృశ్యమైన పిల్లాడు దొరికాడా అని మంజును ఆరా తీసింది. లేదని మంజు చెప్పడంతో రత్నమ్మ అసలు విషయం చెప్పింది.
నాగరాజు దంపతులు ఆ బిడ్డను తెచ్చి తనకు ఇచ్చారని, మళ్లీ వారికే ఇచ్చినట్టు తెలిపింది. ఈ విషయాన్ని మంజు తన అక్క రెడ్డమ్మకు ఫోన్ చేసి చెప్పింది. బిడ్డను తెచ్చుకునేందుకు తల్లి రెడ్డెమ్మ ఆటోడ్రైవర్ నాగరాజు వద్దకు వెళ్లగా.. ఆకాశ్ నీ బిడ్డ అనేందుకు ఆధారమేంటని గ్రామ పెద్దలు ప్రశ్నించారు. వాడి నాలుకపై పుట్టు మచ్చ ఉంటుందని రెడ్డెమ్మ చెప్పింది.
తల్లి చెప్పినట్టే ఆకాశ్ నాలుకపై పుట్టుమచ్చ ఉంది. తల్లి వద్దకు వెళ్లేందుకు మొదట్లో ససేమిరా అన్న ఆకాశ్.. రెండేళ్ల క్రితం తల్లిదండ్రుల ఇంటికి వచ్చేశాడు. ఇప్పుడు ఆకాశ్ వయసు 19. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వినాయక ఉత్సవాల్లో నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృత్యుఒడికి చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment