ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో తొలిసారి మహిళకు హోం మంత్రి పదవి కట్టబెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌దైతే, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. వరుసగా ఇద్దరు దళిత మహిళలకు కీలకమైన ఈ బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ఈ మాటలన్నారు. మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఊహించలేదన్నారు. రెండోసారి హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి వచ్చిన వనిత బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా ఏమన్నారంటే.. –కొవ్వూరు
ప్రశ్న: పోలీసులపై పని ఒత్తిడి అధికంగా ఉంది. వారాంతపు సెలవులు కొన్నిచోట్ల సక్రమంగా అమలు కావడం లేదన్న వాదనలు ఉన్నాయి?
మంత్రి: క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఇబ్బందులను తెలుసుకుంటాను. పోలీసులకు కచ్చితంగా వారాంతపు సెలవులు అన్నిచోట్లా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.
ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. దీనిపై మీ అభిప్రాయం?
ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతో అవసరం. ఏ సమస్యపైనైనా ప్రజలు నిర్భయంగా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే ప్రజలకు, పోలీసులకు మధ్య çసుహృద్భావ వాతావరణం ఉండాలి. దీనివల్ల ప్రజల్లో సదభిప్రాయం కలుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి.
మహిళలు, యువతులపై అకృత్యాల నివారణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు?
ఇప్పటికే ప్రభుత్వం ప్రతి పోలీసు స్టేషన్‌లో మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. దిశ సహాయ కేంద్రం పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను నియమించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రతి జిల్లాకి ఒక దిశ పోలీసు స్టేషన్‌తో పాటు ప్రత్యేకంగా దిశ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. దిశ యాప్ ద్వారా పోలీసుల నుంచి ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకున్నాం.
మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ ఎలా ఉంది?
మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించడం ద్వారా సామాజిక విప్లవానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం ఓ చారిత్రక నిర్ణయం. భవిష్యత్తు తరాల రాజకీయాలకు సీఎం ఓ దిక్సూచిగా నిలిచారు.
హైవే పెట్రోలింగ్ వాహనాల్లో పోలీసుల పని తీరుపై విమర్శలున్నాయి. దీనిపై మీ స్పందన.?
హైవేల్లో ప్రమాదాలు సంభవించిన సమయంలో తక్షణ సాయం అందించేందుకు నిర్దేశించిన హైవే పెట్రోలింగ్ వాహనాల పనితీరు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటాం. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా చూస్తాం.
పోలీసుల్లో అవినీతి నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.?
అవినీతి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అందుకు ప్రజల వైఖరిలోను మార్పు రావాల్సిన అవసరం ఉంది. డబ్బులిస్తేనే తొందరగా పని అవుతుందన్న భావన నుంచి ప్రజలు బయటికి వస్తేనే అవినీతి కట్టడి అవుతుంది.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారు.?
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. శాంతిభద్రతలకు విఘాతం కలించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.
ఇటీవల తాడేపల్లిగూడెం నిట్ కళాశాలలో ర్యాగింగ్ అంశం తెరపైకి వచ్చింది. కళాశాలల్లో ర్యాగింగ్ నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.?
ర్యాగింగ్‌కి పాల్పడితే కలిగే అనర్థాలు, శిక్షల గురించి విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తాం. విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ప్రతీ కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణ కమిటీల పనితీరును మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment