సాక్షి, అమరావతి: దాదాపు మూడు దశాబ్దాల క్రితం కనుమరుగైపోయిన ఆంధ్ర ‘అమృతపాణి’ డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్శిటీ శాస్త్రవేత్తల విశేష కృషి వల్ల మళ్లీ జీవం పోసుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, పురాతనమైన ఈ అరటి రకం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ప్రత్యేకమైంది.
ఒకప్పుడు గోదావరి జిల్లాలతో పాటు ప్రతీ ఇంటి పెరట్లో విస్తృతంగా సాగయ్యేది. అలాంటి ఈ అరుదైన రకం ప్రస్తుతం అంతరించిపోయిన అరటి రకాల జాబితాలో చేరింది. 1950–60 దశకంలో ‘పనామా’ తెగులు ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సాగులో ఉన్న ‘గ్రాస్ మైఖెల్’తో పాటు మన దేశానికి చెందిన నాన్జనుడ్ రసబలి, రస్తాలి, శబరి, అమృతపాణి వంటి రకాలు కనుమరుగైపోయాయి.
పునరుత్పత్తి కోసం విస్తృత పరిశోధనలు..
అంతరించిపోయిన ఆంధ్ర అమృతపాణి రకాన్ని పునరుత్పత్తి చేయాలన్న సంకల్పంతో ఉద్యాన వర్శిటీ గత కొన్నేళ్లుగా విస్తృత పరిశోధనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీకి అనుబంధంగా ఉన్న కొవ్వూరు ఉద్యాన పరిశోధనా శాస్త్రవేత్తల బృందం రెండేళ్ల క్రితం మారేడుమిల్లి మండలం కొండవాడ గ్రామంలో అరగటి సుబ్బారెడ్డి అనే గిరిజన రైతు ఇంటి పెరట్లో ఉన్న అరటి మొక్కలను చూసి ఆశ్చర్యపోయారు.
మొక్కల కాండం, ఆకులు, గెల, కాయల లక్షణాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు దేశవాళి అమృతపాణి రకంగా గుర్తించారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 300 అడుగులు ఎత్తులో ఉండడంతో ఎలాంటి పోషక, కలుపు యాజమాన్య పద్ధతులు చేపట్టకపోయినా ఎలాంటి తెగుళ్లు సోకకుండా మొక్కలు ఆరోగ్యకరంగా ఉన్నట్లు గుర్తించారు. అక్కడ నుంచి సేకరించిన మొక్కల నుంచి ఇప్పటి వరకు 3వేల టిష్యూ కల్చర్ దేశవాళి అమృత పాణి రకం మొక్కలను అభివృద్ధి చేశారు.
గిరిజన ప్రాంతం అనుకూలం
దేశవాళి అమృతపాణి సాగుకు గిరిజన ప్రాంతం అనువైనదిగా గుర్తించారు. ఎత్తయిన గిరిజన ప్రాంతాలు కావడంతో పాటు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ నేలలో సేంద్రీయ కర్బనం అధికంగా ఉండడం వలన మొక్కలకు అవసరమైన అన్ని రకాలైన పోషక పదార్థాలు అందుతున్నాయని గుర్తించారు. పైగా వాణిజ్యపరంగా, ఇతర ఉద్యానపంటలతో కలిపి సాగు చేయకపోవడం వలన ఈ నేలల్లో తెగుళ్లను కలిగించే శిలీంధ్రాల ఉనికి లేదని గుర్తించారు.
గిరిజన రైతులకు పంపిణీ
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదగెద్దాడ పంచాయతీ పరిధిలో వెయ్యి టిష్యూ కల్చర్ అమృతపాణి మొక్కలను వంద మంది గిరిజన రైతులకు ఇటీవలే ఉద్యాన వర్శిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద మరో 2వేల మొక్కలను జూన్‌లో పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.
అమృతపాణికి ఎన్నో ప్రత్యేకతలు
ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఈ రకానికి వాణిజ్యపరంగా మంచి డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాలలోని రస్తాలి, రసబలె, రసకేళి, మల్ఫోగ్, సాప్కాల్, మార్టమాన్, దూద్ సాగర్ వంటి రకాల లక్షణాలను పోలి ఉంటుంది. 11–12 నెలల కాలపరిమితితో 2.5–3 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతూ సగటున 15–18 కిలోల బరువైన గెలలు వేస్తుంది. కాయలు లేత దశలో పసుపు ఆకుపచ్చ రంగులో, పక్వదశలో లేత పసుపువర్ణం నుండి బంగారు వర్ణంలోకి మారతాయి. పలుచని తొక్కతో ప్రత్యేకమైన రుచి, సువాసన కలిగి ఉంటాయి. పక్వ దశలో పండ్లు గెల నుంచి రాలిపోయే లక్షణం ఉండడంతో దూర ప్రాంత రవాణాకు అనుకూలం కాదు.
గిరిజనులకు అదనపు ఆదాయ వనరు
అరుదైన ఈ జన్యురకాన్ని పరిరక్షించడం, విస్తృతంగా సాగులోకి తీసుకురావడం లక్ష్యంగా విస్తృత పరిశోధనలు చేస్తున్నాం. వీటి సాగుకు అనువైన గిరిజన ప్రాంతంలో ఈ రకం సాగును ప్రోత్సహించాలని సంకల్పించాం. గిరిజనులకు మంచి పోషకాహారంగానే కాకుండా అదనపు ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది. – టి.జానకీరామ్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ
కణజాల ప్రవర్ధన పద్ధతిలో పునరుత్పత్తి
అంతరించిపోయిన ఈ అరుదైన రకాన్ని పరిరక్షిస్తున్న గిరిజన రైతు సుబ్బారెడ్డిని ముందుగా అభినందించాలి. దాదాపు ఐదారు దశాబ్దాల నుంచి పెంచుకుంటూ వాటిని పరిరక్షిస్తుండడం వలనే ఈ మొక్కల నుంచి పునరుత్పత్తి చేయగలిగే అవకాశం మనకు దక్కింది. ఈ మొక్కల నుంచి సేకరించిన మగపువ్వులలోని లేత హస్తాలను కణజాల ప్రవర్ధన పద్ధతిలో దశల వారీగా ప్రవర్ధనం చేసి ఎలాంటి తెగుళ్లు సోకని మొక్కలను పునరుత్పత్తి చేశాం. – డాక్టర్ కె.రవీంద్రకుమార్, సీనియర్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా కేంద్రం, కొవ్వూరు
Comments
Please login to add a commentAdd a comment