శ్రీకాకుళం జిల్లా కుప్పిలి గ్రామంలో పూర్తికావచ్చిన లబ్ధిదారుల ఇళ్లు
అన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలా? ఎలా ఇవ్వగలరు? ఇది అసాధ్యం అన్నారు. సాధ్యం చేసి చూపించారు. పట్టాలిచ్చారు సరే, వాటి నిర్మాణం ఎప్పుడు మొదలెడతారో.. అన్నారు. వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా 10.11 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు. కొన్ని లక్షల ఇళ్లు పునాదులు దాటాయి. ఆపై చకచకా పనులు సాగుతున్నాయి. అసాధ్యం అన్న నోళ్లు.. కళ్లప్పగించి చూస్తున్నాయి.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు నిర్మించుకోవాలనే లక్షలాది మంది పేద కుటుంబాల కల కార్యరూపం దాల్చింది. ఇదివరకెన్నడూ.. ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా ఆ కలను సాకారం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దరఖాస్తు చేసుకున్న అతి తక్కువ రోజుల్లోనే.. ఎవరి సిఫారసులు అవసరం లేకుండా.. పైసా అవినీతికి ఆస్కారం లేకుండా ఇళ్ల స్థలాలు అందజేసింది. అంతటితో ఆగకుండా ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఇంటి నిర్మాణానికి ఐఎస్‌ఐ మార్కు ఉన్న నాణ్యమైన వస్తువులను సరఫరా చేస్తోంది.
10.11 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు
తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 15,60,227 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 10,11,006 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఇందులో 8,74,569 ఇళ్లు పునాది దశలో ఉండగా 81,467 ఇళ్లు పునాది దశను పూర్తి చేసుకున్నాయి. 23,226 ఇళ్లు పైకప్పు దశలో ఉండగా.. మరో 27,036 ఇళ్లకు పైకప్పు పూర్తయింది. కాగా, 4,708 ఇళ్ల నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.938.03 కోట్లు మంజూరు చేసింది.
ఆప్షన్–3.. అక్టోబర్ 25న ప్రారంభం
ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంచుకున్న 3,25,899 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని అక్టోబర్ 25న ప్రారంభించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా 10–20 మందిని కలిపి ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 1,77,421 మందితో 12,855 గ్రూపులు ఏర్పాటు చేశారు. మిగిలిన లబ్ధిదారులను కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భవన నిర్మాణ మేస్త్రీలను గుర్తించి.. వారికి గ్రూపులను అనుసంధానించి నిర్మాణ పనులు అప్పగిస్తున్నారు.
నాణ్యమైన వస్తువులు సరఫరా
ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఐఎస్‌ఐ మార్కు ఉన్న నాణ్యమైన సిమెంట్, స్టీల్, ఇతర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువకే అందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు 1,85,696 మెట్రిక్ టన్నుల సిమెంట్, 12,086 మెట్రిక్ టన్నుల స్టీల్, 3,87,562 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసింది.
(చదవండి: ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్)
ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదులకు అవకాశం
పేదలందరికీ ఇళ్లు పథకం కోసం ప్రత్యేకంగా వలంటీర్ యాప్‌ను ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో లాగిన్ అయితే వలంటీర్‌కు తన పరిధిలోని ఇళ్ల లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు తలెత్తితే వలంటీర్ ద్వారా ఈ యాప్‌లో ఫిర్యాదులు చేయొచ్చు. నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక, ఇనుము, తదితరాల కోసం వలంటీర్లను సంప్రదిస్తే వారు యాప్‌లో ఇండెంట్ పెడతారు. అధికారులు ఆ ఇండెంట్‌లను పరిశీలించి కావాల్సిన మెటీరియల్‌ను సమకూరుస్తారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉండేందుకు బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు.
పావలా వడ్డీకే రుణాలు..
లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్)ల నుంచి లబ్ధిదారులకు పావలా వడ్డీకే ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. లబ్ధిదారులకు రుణాలు మంజూరయ్యేలా బ్యాంకర్లతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. లబ్ధిదారులపై రవాణా ఖర్చుల భారం పడకుండా లేఅవుట్‌ల వద్దే ఇసుక డిపోలు, ఇటుకల తయారీ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఇసుక రీచ్‌ల వద్ద లబ్ధిదారుల కోసం ప్రత్యేక క్యూలైన్‌లను ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు, ప్రత్తిపాడు, తీపర్రుల్లో ఇళ్ల లబ్ధిదారుల కోసం ఇసుక డిపోలను కేటాయించారు.
టౌన్‌షిప్‌లకు దీటుగా సకల వసతులు
లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం విద్యుత్, నీటి సరఫరా వసతులు కల్పించింది. తొలి దశలో 8,247 లేఅవుట్‌లలో నీటి వసతి కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు 8,147 (99 శాతం) లేఅవుట్‌లలో పనులు ప్రారంభించారు. 7,172 (87 శాతం) లేఅవుట్‌లలో బోర్లు వేయగా.. 6,884 (83శాతం) లేఅవుట్‌లలో వేసిన బోర్లకు మోటార్లు బిగించి విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చారు. ప్రైవేట్ వెంచర్లు, టౌన్‌షిప్‌లకు దీటుగా వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ప్రభుత్వం సకల వసతులను కల్పిస్తోంది. 20–60 అడుగుల రోడ్లు, ఫుట్‌పాత్‌లు, భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీరు వెళ్లేలా కాల్వలు, విద్యుత్, పార్కులు, 13 శాతం ఓపెన్ ఏరియా, ఇతర మౌలిక వసతుల కల్పన చేపట్టింది. ప్రతి రెండు వేల జనాభాకు అంగ¯న్‌వాడీ కేంద్రం, 1,500 నుంచి 5,000 ఇళ్లకు గ్రంథాలయం ఏర్పాటుతోపాటు కాలనీల్లో ఆహ్లాదం, ఆరోగ్యం అందించే మొక్కల పెంపకానికి పెద్దపీట వేస్తోంది. కాలనీల పరిమాణం, జనాభా సంఖ్య ఆధారంగా స్కూళ్లు, కాలేజీ, బస్టాండ్, గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి జిల్లాకు హౌసింగ్ జేసీ
పేదల ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి జిల్లాకు ఒక హౌసింగ్ జేసీని నియమించి ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తోంది. ప్రజా ప్రతినిధులు, గృహ నిర్మాణ, మున్సిపల్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన ప్రతి గ్రూపునకు గ్రామ స్థాయి అధికారి, లేఅవుట్‌ను మండల స్థాయి అధికారి, నియోజకవర్గాలకు జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు.
(చదవండి: హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుపై స్టేకు హైకోర్టు నిరాకరణ)
మా కష్టాలు తీరనున్నాయి
నా భర్త నాగమల్లేశ్వరరావు కూలీ. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. మాకు సొంతిల్లు లేదు. అద్దె కట్టుకునే స్థోమత కూడా లేదు. దీంతో నా తల్లిదండ్రుల రేకుల షెడ్డులో ఉంటున్నాం. అమ్మా నాన్న, నా సోదరుడు, అతడి భార్య, మేం ఐదుగురం కలిపి మొత్తం తొమ్మిది మందిమి ఆ చిన్న ఇంటిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వైఎస్ జగన్ ప్రభుత్వం మాకు ఉచితంగా స్థలం ఇచ్చి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేసింది. ఇంటి నిర్మాణం దాదాపు పూర్తవడంతో మా కష్టాలు తీరనున్నాయి.
– కె.సునీత, కంటెపూడి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా
స్వగ్రామంలో సొంత ఇంటి కల నెరవేరుతోంది
మా ఊరిలో మాకు ఇల్లు లేదు. దీంతో హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నా భర్త, నేను ఫ్యాక్టరీలో పని చేస్తున్నాం. సొంత ఊరిలో ఇల్లు కట్టుకుని స్థిరపడాలనేది మా కోరిక. అయితే సంపాదన అంతా ఇంటి అద్దె, నా కుమారుడి చదువు, ఇతర ఖర్చులకే సరిపోయేది. జగన్ ప్రభుత్వం ఇల్లు లేనివారికి స్థలం ఇవ్వడంతోపాటు ఇల్లు కట్టిస్తోందని తెలిసి దరఖాస్తు చేసుకున్నాను. స్థలం మంజూరవడంతో నెల క్రితం ఇంటి నిర్మాణం ప్రారంభించాం. మరో నెలలో పూర్తికానుంది. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం.
– మానం సుబ్బలక్ష్మమ్మ, గిద్దలూరు, ప్రకాశం జిల్లా
దరఖాస్తు చేయగానే మంజూరైంది
20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం గొల్లగూడెం వచ్చాం. నా భర్త పెయింట్, నేను కూలి పనులకు వెళ్తున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. ఊర్లోకి వచ్చినప్పటి నుంచి అద్దె ఇంట్లోనే జీవిస్తున్నాం. ఇంటి స్థలం కోసం ఎన్నో ఏళ్లు అధికారుల చుట్టూ తిరిగాం. టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో అర్జీలు పెట్టినా ఫలితం దక్కలేదు. జగన్ ప్రభుత్వం వచ్చాక దరఖాస్తు చేసీ చేయగానే ఇంటి స్థలం మంజూరు చేశారు. ప్రస్తుతం బేస్‌మట్టం వరకు ఇంటి పని పూర్తయ్యింది. 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరబోతోంది.
– కటికల నాని, గొల్లగూడెం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా
రూ.15 లక్షల ఆస్తి సొంతం కానుంది
మాకు ఉండడానికి ఇల్లు లేదు. అద్దె ఇంటిలో ఉంటున్నాం. ఇక్కడ సెంటున్నర స్థలం కొనాలంటే రూ.4 లక్షల నుంచి రూ.4.5 లక్షలు ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలంటే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో సీఎం వైఎస్ జగన్ సొంత అన్నయ్యలా ఆదుకున్నారు. జగనన్న కాలనీలో సెంటున్నర స్థలం, ఇంటి నిర్మాణంతో కలిపి మొత్తం రూ.14 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి మాకు ఇచ్చి గూడు కల్పించారు.
– విత్తనాల రాజేశ్వరి, దార్లపూడి, తూర్పుగోదావరి జిల్లా
ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. లక్షల సంఖ్యలో నిర్మాణాలు చేపడుతుండటంతో మెటల్ సరఫరాదారులు రేట్లు పెంచుతున్నట్టు గుర్తించాం. ఈ నేపథ్యంలో అధికారులు కంకర, రాళ్లు, ఇతర మెటీరియల్ సరఫరా చేసే వారితో సమావేశాలు ఏర్పాటు చేసి ధరలు నిర్ధారిస్తున్నారు. రవాణా వ్యయం పెరగకుండా చూస్తున్నాం. లేఅవుట్‌ల వద్దే ఇసుకను అందుబాటులోకి తెస్తున్నాం. 13 జిల్లాల్లో నిర్మాణాలపై సమీక్షలు చేశాం. ఇకపై నిర్మాణాలు మందకొడిగా సాగుతున్న లేఅవుట్‌లు, నియోజకవర్గాలను గుర్తించి అక్కడ పర్యటిస్తాం. లేఅవుట్‌లలో మోడల్ కాలనీల తరహాలో వసతులు కల్పిస్తాం.
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి
నిర్మాణాలు వేగవంతం
వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక అధికారుల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. ఏవైనా సమస్యలు ఎదురైతే వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం. సీఎం ఆదేశాల మేరకు కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.
– అజయ్ జైన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
సన్నాహాలు చేస్తున్నాం..
ప్రభుత్వమే ఇళ్లు నిర్మించే మూడో ఆప్షన్ ఎంచుకున్న లబ్ధిదారులను గ్రూపులుగా చేస్తున్నాం. సీఎం ఆదేశాల మేరకు అక్టోబర్ 25న నిర్మాణాలు ప్రారంభిస్తాం. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.
– నారాయణ భరత్‌గుప్తా, ఎండీ, హౌసింగ్ కార్పొరేషన్
తొలి దశలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లు : 15,60,227
ఇందుకు ఖర్చయ్యే వ్యయం : రూ.28,084 కోట్లు
సిమెంట్: 69.70 లక్షల మెట్రిక్ టన్నులు
స్టీల్: 7.44 లక్షల మెట్రిక్ టన్నులు
ఇసుక: 310 లక్షల మెట్రిక్ టన్నులు
మెటల్: 223.10 లక్షల మెట్రిక్ టన్నులు
సిమెంట్/బ్రిక్స్: 232.50 కోట్లు
రెండో దశలో ప్రభుత్వం నిర్మించే ఇళ్లు : 12,70,000
ఇందుకయ్యే వ్యయం : రూ.22,860 కోట్లు
– కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వణుకూరుకు చెందిన మాతంగి కీర్తన షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. ఈమె భర్త మాతంగి రాజేశ్ ఎలక్ట్రీషియన్. ఇద్దరూ కష్టపడితే వచ్చేది నెలకు రూ.18 వేలు. ఇందులో రూ.4 వేలు ఇంటి అద్దె. ఇతరత్రా ఖర్చుల కోసం మిగతా మొత్తం సరిపోతోంది. దీంతో పొదుపు చేసి, స్థలం కొని.. సొంత ఇల్లు కట్టుకోవడం అన్నది కలగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎటువంటి సిఫార్సులు లేకుండానే వీరికి ఇంటి స్థలం కేటాయించింది. గృహ నిర్మాణానికీ ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుతం వీరి ఇంటి నిర్మాణం పైకప్పు దశకు చేరుకుంది.
ఇతని పేరు వజ్రాల కోటిరెడ్డి. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామం. పొగాకు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. తద్వారా వచ్చే ఆదాయం ఇంటి అద్దె, పిల్లల చదువులు, కుటుంబ పోషణకే సరిపోతోంది. దీంతో 40 ఏళ్లకు పైగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. సొంతిల్లు కట్టుకోవాలనే ఆయన ఆశకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కోటిరెడ్డి భార్య శారద, చిన్న కుమారుడి భార్య తహేరాకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. శారద ఇంటి నిర్మాణం పునాది దశలో, తహేరా ఇంటి నిర్మాణం పైకప్పు దశలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment