గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు
సాక్షి నెట్‌వర్క్: తలదాచుకునే గూడు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబాల్లోని అక్కచెల్లెమ్మల చేతికే ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందజేయడంతో వారంతా ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. సొంతింటి కల నెరవేరుతుందని కలలో కూడా ఊహించలేదని.. ఈ ప్రభుత్వం తమను గుర్తించి ఆదుకుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ కన్నీళ్లు తుడిచి మరోసారి అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా 16వ రోజైన శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
చిత్తూరులో శనివారం 3,750 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 7,664 మందికి ఇంటి పట్టాలు, ఇళ్ల హక్కు పత్రాలు అందజేశారు. వైఎస్సార్ జిల్లాలో 2,418 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,02,153 మంది ఇళ్ల పట్టాలు పొందారు. ప్రకాశం జిల్లాలో 298 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగా.. ఇప్పటివరకు మొత్తం 62,298 మందికి లబ్ధి చేకూరింది. గుంటూరు జిల్లాలో 7,708 మందికి ఇళ్ల పట్టాలు, 682 మందికి టిడ్కో ఇళ్ల అగ్రిమెంట్ పత్రాలను అందజేశారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్, కాసు మహేష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఒక్కరోజే 3,083 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు పట్టాలు అందుకున్న లబ్ధిదారుల సంఖ్య 2,40,731కి చేరింది. శ్రీకాకుళం జిల్లాలో శనివారం 3,221 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. 16 రోజుల్లో మొత్తం 57,595 మందికి పట్టాలు అందాయి. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు పట్టాలు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment